Seeley
-
రవి మరణం తీరని లోటు
చివరి క్షణం వరకు ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించాం మావోయిస్టు పార్టీ ఈస్ట్ డివిజన్ కమిటీ ప్రకటన సీలేరు: మన్యం వీరుడు, అల్లూరి వారసుడిగా ఆఖరి శ్వాసవరకు ప్రజల కోసం జీవించి తీవ్ర అనారోగ్యంతో అసువులు బాసిన కుడుముల వెంకటరమణ అలియాస్ రవి మరణం మావోయిస్టు పార్టీకి తీరని లోటని ఈస్ట్ డివిజన్ కమిటీ పేరిట మంగళవారం సీలేరు విలేకరులకు ప్రకటన విడుదల చేశారు. రవి ప్రజల కోసమే తన జీవితాన్ని త్యాగం చేశాడని, ఆయన ఆశయసాధనకు కలిసికట్టుగా పోరాటం సాగిద్దామని పేర్కొన్నారు. అనారోగ్యానికి గురైన రవిని కాపాడటానికి మావోయిస్టు పార్టీ శాయశక్తులా అన్ని మార్గాల ద్వారా విశ్వ ప్రయత్నం చేసిందని, పోలీసు నిఘా, ప్రభుత్వ నిర్బంధాలతో ప్రమాదం ఉన్నప్పటికీ ఆయన ప్రాణాలు కాపాడటానికి ఆఖరి ప్రయత్నంగా మైదాన ప్రాంతానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేశామని, అయిప్పటికీ ఆయనను దక్కించుకోలేకపోయామని విచారం వ్యక్తంచేశారు. ప్రజల కోసం, సమాజం మార్పు కోసం పోరాడుతున్న మావోయిస్టు పార్టీపైన, ప్రజలపైన నేడు దోపిడీ పాలకులు తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారని, మార్చి మొదటివారంలో పుట్టకోట ప్రాంతంలో మల్కన్‌గిరి నుంచి వేటకు వస్తున్న సాధారణ పౌరులపై కాల్పులు జరిపి హత్య చేయడం, ఒకరిని తీవ్రంగా గాయపర్చడం అందరికీ తెలిసిందేన న్నారు. గతేడాది ఇదే కాలంలో మల్కన్‌గిరి జిల్లా పొడియా ఏరియా కమిటీ సభ్యుడు రామిరెడ్డి యోగల్ పార్టీ పనిపై ఇక్కడికి వచ్చి అనారోగ్యం బారిన పడి వైద్య అందక మృతి చెందాడని గుర్తుచేశారు. -
సీలేరు నుంచి అదనపు జలాలు
సీలేరు : ఉభయ గోదావరి జిల్లాల్లో రెండో పంట కోసం విశాఖ జిల్లా సీలేరు విద్యుత్ కాంప్లెక్స్ డొంకరాయి జలాశయం మీదుగా శుక్రవారం మధ్యాహ్నం నుంచి అదనంగా మరో వెయ్యి క్యూసెక్కుల నీటిని జెన్కో అధికారులు విడుదల చేయనున్నారు. విద్యుత్ ఉత్పాదన నిమిత్తం సీలేరు కాంప్లెక్స్ నుంచి గురువారం వరకు వెయ్యి క్యూసెక్కుల నీటిని ఇచ్చేలా నీటి పారుదల శాఖ అధికారులు విద్యుత్‌శాఖ అధికారులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే పొలాలకు మరింత నీరు అవసరం కావడంతో తూర్పుగోదావరి జిల్లా డొంకరాయి మెయిన్ డ్యాం నుంచి ఇప్పటివరకు ఇస్తున్న నీటితోపాటు మరో వెయ్యి క్యూసెక్కుల నీటిని వారం రోజులపాటు విడుదల చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. -
బోర్డు కోరినా నివేదిక లేదు
‘సీలేరు’పై స్పందించని కేంద్ర ప్రాధికార సంస్థ ఏపీ ఇవ్వనందువల్లే ఎస్ఆర్ఎల్డీసీకి చేరని సమాచారం! ఢిల్లీ పర్యటనలో కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్న కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: గోదావరి నదీ జలాలతో ఎగువ, దిగువ సీలేరు కేంద్రాల్లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్, వినియోగం నివేదికలను తమకు అందించాలన్న గోదావరి నది యాజమాన్య బోర్డు విజ్ఞప్తిపై కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (సీఈఏ) నుంచి స్పందన కరువైంది. దక్షిణ ప్రాంత లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఆర్ఎల్డీసీ) నుంచి వివరాలు తెప్పించుకొని తమకు అందజేయాలని ఇరవై రోజుల కిందటే బోర్డు స్వయంగా కోరినా.. ఇప్పటికీ ఏమాత్రం కదలిక లేదు. ఎప్పటికప్పుడు సీలేరులో విద్యుత్ ఉత్పత్తి సమాచారాన్ని అందించాల్సిన ఆంధ్రప్రదేశ్.. ఇవ్వనందువల్లే సీఈఏ చేతులెత్తేస్తోందని తెలంగాణ నీటి పారుదల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. దీనిపై సీఎం కేసీఆర్ శుక్రవారం నుంచి జరిపే ఢిల్లీ పర్యటనలో కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు. దిగువ సీలేరులో 460 మెగావాట్లు, ఎగువ సీలేరులో 240 మెగావాట్లు మొత్తంగా 700 మెగావాట్ల ఉత్పత్తికి అవకాశముంది. ఈ విద్యుత్‌ను 54:46 నిష్పత్తిలో ఇరు రాష్ట్రాలు పంచుకోవాల్సి ఉంది. పోలవరం ముంపు మండలాలు ఏపీలో కలవడంతో సీలేరు సైతం ఏపీకే వెళ్లింది. ఏపీ ఇందులో విద్యుత్ వాటాను తెలంగాణకు ఇవ్వాల్సి ఉంది. కానీ సీలేరులో విద్యుత్ వాటా, ఉత్పత్తి వివరాలను తెలంగాణకు సమర్పించలేదు. గోదావరి బోర్డు ఈ విషయంలో స్పందించి సీఈఏ నుంచి నివేదిక వచ్చిన వెంటనే మరోమారు సమావేశం కావాలని భావించింది. కానీ ఇప్పటికీ నివేదిక అందకపోవడంతో సమావేశం నిర్వహణపై ఓ స్పష్టతకు రాలేకపోతోంది. కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్న సీఎం.. సీలేరు విద్యుత్ ఉత్పత్తి అంశాన్ని సీఎం కేసీఆర్ కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్న సీఎం కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతిని కలిసి ఈ అంశాన్ని ప్రస్తావిస్తారని నీటి పారుదల శాఖ వర్గాలు వెల్లడించాయి. కేవలం ఏపీ ప్రభుత్వం ఎస్ఆర్ఎల్డీసీకి షెడ్యూలింగ్ చేయనందువల్లే సీఈఏ నివేదికలో జాప్యం జరుగుతున్న అంశాన్ని వివరిస్తారని తెలిపాయి. వీటితో పాటే కృష్ణపట్నం విద్యుత్ కేంద్రం నుంచి రావాల్సిన 430 మెగావాట్ల విద్యుత్ వాటా విషయాన్ని కూడా కేంద్ర మంత్రికి నివేదిస్తారని తెలుస్తోంది. ఇక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు ఆటంకాలు లేకుండా చూడాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పనున్నారని సమాచారం. ఈ ప్రాజెక్టుపై ఇంకా పాలనాపరంగా ఎలాంటి నిర్ణయం తీసుకోకున్నా... ఏపీ అప్పుడే కొర్రీలు పెడుతూ ప్రాజెక్టును ఆపించాలంటూ కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది కూడా. ఈ దృష్ట్యా ప్రాజెక్టు అవసరాన్ని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లి అడ్డంకుల నివారణ కోసం జోక్యం కోరవచ్చని తెలుస్తోంది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా, రావాల్సిన అనుమతుల్లో వేగం, ట్రిపుల్ ఆర్ నిధులు, రాష్ట్రానికి రావాల్సిన ఏఐబీపీ నిధులు రూ. 250 కోట్లపై ఢిల్లీ పర్యటనలో కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ విజ్ఞప్తులు చేయనున్నారు. -
వర్షాతిరేకం
ఏజెన్సీలో భారీ వర్షాలు పొంగి పొర్లుతున్న వాగులు, గెడ్డలు ఖరీఫ్‌కు అనుకూలం పాడేరు: ఏజెన్సీలో మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవల 8 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసి రెండు రోజులపాటు తెరిపినిచ్చిన ప్పటికి మరల వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. ఈదురుగాలులతో కూడిన వర్షాలతో జనజీవనానికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. పాడేరు, చింతపల్లి, రొంపుల, సీలేరు, అనంతగిరి ఘాట్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈదురుగాలుల ఉధృతికి గిరిజనులు అవస్థలు పడుతున్నారు. రోడ్డుకు ఆనుకుని భారీ వృక్షాలు ఉండడంతో భయంభయంగానే వాహనాలను నడుపుతున్నారు. కాగా విస్తారంగా కురుస్తున్న వర్షంతో ఖరీఫ్ వ్యవసాయ పనులకు మరింత మేలు చేస్తుంది. పంట పొలాల్లో నీరు చేరింది. ఇప్పటికే ఏజెన్సీవ్యాప్తంగా 50 శాతం వరినాట్లు పూర్తవగా ఈ వర్షాలకు మిగతా వ్యవసాయ భూముల్లో కూడా పనులకు మేలు జరగనుంది. మరోవైపు ఏజెన్సీలో చిన్న చిన్న కొండవాగులు కూడా ఉధృతంగానే ప్రవహిస్తున్నాయి. జోలాపుట్టు, సీలేరు, కోనాం, తారకరామ, పెద్దేరు, రైవాడ జలాశయాలకు కూడా వరదనీరు చేరుతోంది. మత్స్యగెడ్డ, రాళ్ళగెడ్డ, బొయితిలి గెడ్డ, కించూరు గెడ్డ, లోతుగెడ్డ సమీపంలోని పెద్ద గెడ్డలన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రమాదస్థాయికి డుడుమా ముంచంగిపుట్టు: అల్పపీడన ప్రభావంతో మూడ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి నీరందించే డుడుమ(డైవర్షన్) డ్యాంలో 2 వేలు క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండడంతో నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరుతోంది. ఈ డ్యాం పూర్తి సామర్ధ్యం 2690 అడుగులకుగాను మంగళవారం నాటికి 2589.1 అడుగుల నీటి మట్టం నమోదైంది. దీంతో అప్రమత్తమైన ప్రాజెక్టు అధికారులు 7,8 నంబర్ల గేట్ల ద్వారా 5000 క్యూసెక్కుల నీటిని దిగువనున్న బలిమెల రిజర్వాయర్‌కు విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి పెరిగితే మరింత నీటిని విడుదల చేసే అవకాశం ఉందని ప్రాజెక్టు అధికారులు పేర్కొంటున్నారు. జోలాపుట్టు గేట్లు మూసివేత : డుడుమ డ్యాంలో వరద నీరు అధికంగా చేరుతుండడంతో సోమవారం రాత్రి నుంచి జోలాపుట్టు ప్రధాన రిజర్యాయర్లోని గేట్లను మూసేసి నీటి విడుదల నిలుపుదల చేశారు. ఇక్కడ నుంచి విద్యుత్ ఉత్పతికి డుడుమ డ్యాంకు 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండేవారు. ఈ రిజర్వాయర్ పూర్తి సామర్ధ్యం 2750 అడుగులకుగాను ప్రస్తుతం 2721.10 అడుగులు నీటి నిల్వ ఉంది. ప్రస్తుతం మాచ్‌ఖండ్‌లో 92 మెగావాట్ల విద్యుదుత్పతి జరుగుతుంది.