చివరి క్షణం వరకు ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించాం
మావోయిస్టు పార్టీ ఈస్ట్ డివిజన్ కమిటీ ప్రకటన
సీలేరు: మన్యం వీరుడు, అల్లూరి వారసుడిగా ఆఖరి శ్వాసవరకు ప్రజల కోసం జీవించి తీవ్ర అనారోగ్యంతో అసువులు బాసిన కుడుముల వెంకటరమణ అలియాస్ రవి మరణం మావోయిస్టు పార్టీకి తీరని లోటని ఈస్ట్ డివిజన్ కమిటీ పేరిట మంగళవారం సీలేరు విలేకరులకు ప్రకటన విడుదల చేశారు. రవి ప్రజల కోసమే తన జీవితాన్ని త్యాగం చేశాడని, ఆయన ఆశయసాధనకు కలిసికట్టుగా పోరాటం సాగిద్దామని పేర్కొన్నారు. అనారోగ్యానికి గురైన రవిని కాపాడటానికి మావోయిస్టు పార్టీ శాయశక్తులా అన్ని మార్గాల ద్వారా విశ్వ ప్రయత్నం చేసిందని, పోలీసు నిఘా, ప్రభుత్వ నిర్బంధాలతో ప్రమాదం ఉన్నప్పటికీ ఆయన ప్రాణాలు కాపాడటానికి ఆఖరి ప్రయత్నంగా మైదాన ప్రాంతానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేశామని, అయిప్పటికీ ఆయనను దక్కించుకోలేకపోయామని విచారం వ్యక్తంచేశారు.
ప్రజల కోసం, సమాజం మార్పు కోసం పోరాడుతున్న మావోయిస్టు పార్టీపైన, ప్రజలపైన నేడు దోపిడీ పాలకులు తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారని, మార్చి మొదటివారంలో పుట్టకోట ప్రాంతంలో మల్కన్‌గిరి నుంచి వేటకు వస్తున్న సాధారణ పౌరులపై కాల్పులు జరిపి హత్య చేయడం, ఒకరిని తీవ్రంగా గాయపర్చడం అందరికీ తెలిసిందేన న్నారు. గతేడాది ఇదే కాలంలో మల్కన్‌గిరి జిల్లా పొడియా ఏరియా కమిటీ సభ్యుడు రామిరెడ్డి యోగల్ పార్టీ పనిపై ఇక్కడికి వచ్చి అనారోగ్యం బారిన పడి వైద్య అందక మృతి చెందాడని గుర్తుచేశారు.