వర్షాతిరేకం
- ఏజెన్సీలో భారీ వర్షాలు
- పొంగి పొర్లుతున్న వాగులు, గెడ్డలు
- ఖరీఫ్‌కు అనుకూలం
పాడేరు: ఏజెన్సీలో మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవల 8 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసి రెండు రోజులపాటు తెరిపినిచ్చిన ప్పటికి మరల వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. ఈదురుగాలులతో కూడిన వర్షాలతో జనజీవనానికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
పాడేరు, చింతపల్లి, రొంపుల, సీలేరు, అనంతగిరి ఘాట్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈదురుగాలుల ఉధృతికి గిరిజనులు అవస్థలు పడుతున్నారు. రోడ్డుకు ఆనుకుని భారీ వృక్షాలు ఉండడంతో భయంభయంగానే వాహనాలను నడుపుతున్నారు. కాగా విస్తారంగా కురుస్తున్న వర్షంతో ఖరీఫ్ వ్యవసాయ పనులకు మరింత మేలు చేస్తుంది.
పంట పొలాల్లో నీరు చేరింది. ఇప్పటికే ఏజెన్సీవ్యాప్తంగా 50 శాతం వరినాట్లు పూర్తవగా ఈ వర్షాలకు మిగతా వ్యవసాయ భూముల్లో కూడా పనులకు మేలు జరగనుంది. మరోవైపు ఏజెన్సీలో చిన్న చిన్న కొండవాగులు కూడా ఉధృతంగానే ప్రవహిస్తున్నాయి. జోలాపుట్టు, సీలేరు, కోనాం, తారకరామ, పెద్దేరు, రైవాడ జలాశయాలకు కూడా వరదనీరు చేరుతోంది. మత్స్యగెడ్డ, రాళ్ళగెడ్డ, బొయితిలి గెడ్డ, కించూరు గెడ్డ, లోతుగెడ్డ సమీపంలోని పెద్ద గెడ్డలన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
ప్రమాదస్థాయికి డుడుమా
ముంచంగిపుట్టు: అల్పపీడన ప్రభావంతో మూడ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి నీరందించే డుడుమ(డైవర్షన్) డ్యాంలో 2 వేలు క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండడంతో నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరుతోంది. ఈ డ్యాం పూర్తి సామర్ధ్యం 2690 అడుగులకుగాను మంగళవారం నాటికి 2589.1 అడుగుల నీటి మట్టం నమోదైంది. దీంతో అప్రమత్తమైన ప్రాజెక్టు అధికారులు 7,8 నంబర్ల గేట్ల ద్వారా 5000 క్యూసెక్కుల నీటిని దిగువనున్న బలిమెల రిజర్వాయర్‌కు విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి పెరిగితే మరింత నీటిని విడుదల చేసే అవకాశం ఉందని ప్రాజెక్టు అధికారులు పేర్కొంటున్నారు.
జోలాపుట్టు గేట్లు మూసివేత : డుడుమ డ్యాంలో వరద నీరు అధికంగా చేరుతుండడంతో సోమవారం రాత్రి నుంచి జోలాపుట్టు ప్రధాన రిజర్యాయర్‌లోని గేట్లను మూసేసి నీటి విడుదల నిలుపుదల చేశారు. ఇక్కడ నుంచి విద్యుత్ ఉత్పతికి డుడుమ డ్యాంకు 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండేవారు. ఈ రిజర్వాయర్ పూర్తి సామర్ధ్యం 2750 అడుగులకుగాను ప్రస్తుతం 2721.10 అడుగులు నీటి నిల్వ ఉంది. ప్రస్తుతం మాచ్‌ఖండ్‌లో 92 మెగావాట్ల విద్యుదుత్పతి జరుగుతుంది.