బోర్డు కోరినా నివేదిక లేదు | Not including the report of the Board | Sakshi
Sakshi News home page

బోర్డు కోరినా నివేదిక లేదు

Published Thu, Dec 4 2014 1:25 AM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM

Not including the report of the Board

  •  ‘సీలేరు’పై స్పందించని కేంద్ర ప్రాధికార సంస్థ
  •  ఏపీ ఇవ్వనందువల్లే ఎస్‌ఆర్‌ఎల్డీసీకి చేరని సమాచారం!
  •  ఢిల్లీ పర్యటనలో కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్న కేసీఆర్
  • సాక్షి, హైదరాబాద్: గోదావరి నదీ జలాలతో ఎగువ, దిగువ సీలేరు కేంద్రాల్లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్, వినియోగం నివేదికలను తమకు అందించాలన్న గోదావరి నది యాజమాన్య బోర్డు విజ్ఞప్తిపై కేంద్ర  విద్యుత్ ప్రాధికార సంస్థ (సీఈఏ) నుంచి స్పందన కరువైంది. దక్షిణ ప్రాంత లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్‌ఆర్‌ఎల్డీసీ) నుంచి వివరాలు తెప్పించుకొని తమకు అందజేయాలని ఇరవై రోజుల కిందటే బోర్డు స్వయంగా కోరినా.. ఇప్పటికీ ఏమాత్రం కదలిక లేదు.

    ఎప్పటికప్పుడు సీలేరులో విద్యుత్ ఉత్పత్తి సమాచారాన్ని అందించాల్సిన ఆంధ్రప్రదేశ్.. ఇవ్వనందువల్లే సీఈఏ చేతులెత్తేస్తోందని తెలంగాణ నీటి పారుదల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. దీనిపై సీఎం కేసీఆర్ శుక్రవారం నుంచి జరిపే ఢిల్లీ పర్యటనలో కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు. దిగువ సీలేరులో 460 మెగావాట్లు, ఎగువ సీలేరులో 240 మెగావాట్లు మొత్తంగా 700 మెగావాట్ల ఉత్పత్తికి అవకాశముంది.

    ఈ విద్యుత్‌ను 54:46 నిష్పత్తిలో ఇరు రాష్ట్రాలు పంచుకోవాల్సి ఉంది. పోలవరం ముంపు మండలాలు ఏపీలో కలవడంతో సీలేరు సైతం ఏపీకే వెళ్లింది. ఏపీ ఇందులో విద్యుత్ వాటాను తెలంగాణకు ఇవ్వాల్సి ఉంది. కానీ సీలేరులో విద్యుత్ వాటా, ఉత్పత్తి వివరాలను తెలంగాణకు సమర్పించలేదు. గోదావరి బోర్డు ఈ విషయంలో స్పందించి సీఈఏ నుంచి నివేదిక వచ్చిన వెంటనే మరోమారు సమావేశం కావాలని భావించింది. కానీ ఇప్పటికీ నివేదిక అందకపోవడంతో సమావేశం నిర్వహణపై ఓ స్పష్టతకు రాలేకపోతోంది.
     
    కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్న సీఎం..

    సీలేరు విద్యుత్ ఉత్పత్తి అంశాన్ని సీఎం కేసీఆర్ కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్న సీఎం కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతిని కలిసి ఈ అంశాన్ని ప్రస్తావిస్తారని నీటి పారుదల శాఖ వర్గాలు వెల్లడించాయి. కేవలం ఏపీ ప్రభుత్వం ఎస్‌ఆర్‌ఎల్డీసీకి షెడ్యూలింగ్ చేయనందువల్లే సీఈఏ నివేదికలో జాప్యం జరుగుతున్న అంశాన్ని వివరిస్తారని తెలిపాయి. వీటితో పాటే కృష్ణపట్నం విద్యుత్ కేంద్రం నుంచి రావాల్సిన 430 మెగావాట్ల విద్యుత్ వాటా విషయాన్ని కూడా కేంద్ర మంత్రికి నివేదిస్తారని తెలుస్తోంది.

    ఇక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు ఆటంకాలు లేకుండా చూడాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పనున్నారని సమాచారం. ఈ ప్రాజెక్టుపై ఇంకా పాలనాపరంగా ఎలాంటి నిర్ణయం తీసుకోకున్నా... ఏపీ అప్పుడే కొర్రీలు పెడుతూ ప్రాజెక్టును ఆపించాలంటూ కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది కూడా.

    ఈ దృష్ట్యా ప్రాజెక్టు అవసరాన్ని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లి అడ్డంకుల నివారణ కోసం జోక్యం కోరవచ్చని తెలుస్తోంది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా, రావాల్సిన అనుమతుల్లో వేగం, ట్రిపుల్ ఆర్ నిధులు, రాష్ట్రానికి రావాల్సిన ఏఐబీపీ నిధులు రూ. 250 కోట్లపై ఢిల్లీ పర్యటనలో కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ విజ్ఞప్తులు చేయనున్నారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement