సీమాంధ్ర ఉద్యోగి తెలంగాణలో పనిచేసే వీల్లేదు
తెలంగాణ ఉద్యోగాలు ఇక్కడి వారికే ఇవ్వాలి
విఠల్ డిమాండ్
హైదరాబాద్, న్యూస్‌లైన్: అక్రమంగా నియామకం పొందిన ఏ ఒక్క సీమాంధ్ర ఉద్యోగీ తెలంగాణలో పనిచేయడానికి వీల్లేదని టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సి. విఠల్ హెచ్చరించారు. ప్రగతి మహా విద్యాలయ తెలంగాణ టెక్నిక్, నాన్ టెక్నిక్ స్టాఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం తెలంగాణ విజయోత్సవ సభ జరిగింది. ఈ సందర్భంగా విఠల్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటులో సోనియా, సుష్మాస్వరాజ్ ప్రధానపాత్ర పోషించారని కొనియాడారు.
నారాయణ, శ్రీచైతన్యల లాంటి విద్యా సంస్థల రద్దుపై నవ తెలంగాణలో తొలిసంతకం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ లెక్చరర్ ఫోరం అధ్యక్షుడు కత్తి వెంకటస్వామి మాట్లాడుతూ, సీమాంధ్ర ఉద్యోగులు వెళ్లని పక్షంలో వారిని తరిమికొడతామని హెచ్చరించారు. టీ ప్రభుత్వ కళాశాల అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి, రాజ్‌మహేందర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ టివి.రావ్‌ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.