షేక్పేట్నాలాలో ఘాతుకం?
సిటీకి చేరుకున్న లైంగికదాడి బాధితురాలు
కేసు రీ-రిజిస్టర్ చేసిన సీసీఎస్ అధికారులు
బాధితురాలికి పోలీసులు పెట్టిన పేరు రక్షిత
హ్యాపీ ముంబైకి చెందిన వ్యక్తిగా గుర్తింపు
అదుపులో నలుగురు అనుమానిత వ్యక్తులు
సాక్షి, సిటీబ్యూరో: ముంబై మోడల్ కేసు దర్యాప్తును ప్రారంభించిన సీసీఎస్ అధికారులు సైబరాబాద్ పోలీసుల సహకారంతో ముందుకు వెళ్తున్నారు. ఈ ఘాతుకానికి సంబంధించి ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్న వ్యక్తి అలీగా గుర్తించారు. లైంగికదాడి షేక్‌పేట్‌నాలా ప్రాంతంలో జరిగినట్లు తెలిసిం ది. దీనిపై జంట కమిషనరేట్ల అధికారులు చేసిన ఆపరేషన్‌లో నలుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారని తెలిసింది. ఢిల్లీలో నిర్భయ, సైబరాబాద్‌లో అభయ మాదిరిగా ఈ బాధితురాలికి హైదరాబాద్ పోలీసులు రక్షితగా పేరు పెట్టారు. ‘న్యూ ఇయర్’ ఈవెంట్ కోసమంటూ పిలిచిన ముంబై మోడల్‌పై హైదరాబాద్‌లో చోటు చేసుకున్న సామూహిక లైంగికదాడికి సంబంధించి వెర్సోవా పోలీసులు ‘జీరో ఎఫ్ఐఆర్’ నమోదు చేసిన విషయం విదితమే.
‘హుస్సేన్‌సాగర్’లో నగరానికి...
కేసుకు సంబంధించిన ఆధారాలతోపాటు బాధితురాలినీ తీసుకుని బయలుదేరిన వెర్సోవా పోలీసు బృందం శుక్రవారం మధ్యాహ్నం హుస్సేన్‌సాగర్ ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్ చేరుకుంది. నేరుగా పోలీసు కమిషనర్ ఎదుట బాధితురాలిని ప్రవేశపెట్టిన అధికారులు ఆయన ఆదేశాల మేరకు కేసును, ఆమెనూ సీసీఎస్‌కు అప్పగించారు. ముంబై పోలీసులు రిజిస్టర్ చేసిన జీరో ఎఫ్ఐఆర్ను తీసుకున్న అధికారులు కేసును రీ-రిజిస్టర్ చేశారు.
‘వాట్స్‌యాప్’లో మునిగిపోయిన రక్షిత
‘న్యూ ఇయర్’ ఈవెంట్ కోసం నగరానికి వచ్చిన రక్షితను బుక్ చేసిన హ్యాపీ ముంబైకి చెందిన వ్యక్తిగా తేలింది. ఆమె శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన తరవాత అలీ సహా మరికొందరు వచ్చి ఆమెను రిసీవ్ చేసుకుని కారులో దాదాపు గంట పాటు తీసుకువెళ్లారు. ఆ తరవాత మరో కారులోకి మార్చినప్పుడు వేరే వ్యక్తులు ఇద్దరు ఎక్కారు. దీన్నిబట్టి ఈ ఘాతుకంలో అలీతో పాటు మరో నలుగురు నిందితులు ఉండచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. రెండో కారులో ప్రయాణిస్తున్న సందర్భంలో తాను సెల్ఫోన్లో వాట్స్‌యాప్ చూస్తూ గడిపానని, అందుకే పరిసరాలను పూర్తిగా గమనించలేదని రక్షిత సీసీఎస్ పోలీసులకు వెల్లడించారు. తాను పరిశీలించిన దారి ప్రకారం ట్రాఫిక్ తక్కువగా ఉన్న రోడ్డు, ఫ్లైవోవర్లు దాటుకుంటూ దాదాపు గంటన్నర ప్రయాణించినట్లు రక్షిత పోలీసులకు చెప్పారు. వీటి ఆధారంగా పోలీసులు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్స్‌లో ఈ ప్రయాణం సాగినట్లు భావిస్తున్నారు.
ఘాతుకం జరిగింది అపార్ట్మెంట్లో..?
నిందితుల్ని పట్టుకోవడానికి సీసీఎస్ అధికారులు ఆరు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఓ బృందం రక్షితను తీసుకుని డిసెంబర్ 31న ఆమె హైదరాబాద్ వచ్చినప్పుడు విమానం దిగిన శంషాబాద్ విమానాశ్రయం నుంచి చుట్టుపక్కల మార్గాల్లో సంచరించడం ద్వారా అన్ని ప్రాంతాలు గుర్తిం చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రాథమికంగా సేకరించిన వివరాలను బట్టి ఈ ఘాతుకం మణికొండ-గోల్కొండ మధ్యలో ఉన్న షేక్పేట్నాలాలో జరిగినట్లు నిర్థారించారు. అక్కడి ఓ ప్రైవేట్ టెక్నోస్కూల్ సమీపంలోని అపార్ట్మెంట్లో ఉన్న సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్‌లోనే నిర్భంధించి లైంగిక దాడి చేసినట్లు తేల్చారని సమాచారం. ఇది అలీ అనే వ్యక్తికి చెందినదని తెలి సింది. ఫ్లాట్ యజమానితో పాటు వాచ్‌మన్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
ఏటీఎం కేంద్రాల గుర్తింపు...
అపస్మారక స్థితిలో ఉన్న రక్షితపై ఘాతుకానికి ఒడిగట్టిన నిందితులు ఆమె మూడు ఉంగరాలు, గొలుసు, ఏటీఎం కార్డుల్ని తస్కరించారు. ఏటీఎం కార్డుతో మూడు ఏటీఎంల్లో నగదు డ్రా చేసినట్లు తేలడంతో ఆయా కేంద్రాల నుంచి సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను సేకరిస్తున్నారు. మరోపక్క విమానాశ్రయంలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్ కోసమూ ఓ బృందం బయలుదేరింది. లైంగికదాడి అనంతరం రక్షితను ముంబై పంపేందుకు ముష్కరులు కొండాపూర్‌లో ఉన్న జెన్ జబ్బార్ ట్రావెల్స్‌లో బస్సు టిక్కెట్ కొన్నారని పోలీసులు గుర్తించారు. దీన్ని బుక్ చేసిన మంజూర్ అనే వ్యక్తి గురించి ఆరా తీయగా అతడు ట్రావెల్ ఏజెంటని తెలిసింది.
సూత్రధారి పాత నేరగాడేనా..?
పోలీసులు అలీ, మంజూర్ తదితరుల్ని ప్రాథమికంగా అనుమానితుల జాబితాలో చేర్చారు. ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అలీ పాత నేరగాడని సీసీఎస్ అధికారులు అనుమానిస్తున్నారు. ఇతడితో పాటు మరో నలుగురి కోసమూ గాలింపు చేపట్టామని అధికారులు తెలిపారు. అయితే శుక్రవారం రాత్రి కొందరిని అదుపులోకి తీసుకున్నారని సమాచారం. దీన్ని పోలీసులు మాత్రం ధ్రువీకరించట్లేదు. నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ నిందితుల్ని కచ్చితంగా అరెస్టు చేస్తామని అన్నారు.