టీడీపీ... ఎక్స్ అఫీషియో మంత్రాంగం..
ఆమదాలవలస: ఇప్పటివరకూ ఎప్పుడా ఎప్పుడా అని అంతా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. నేటితో పురపాలక చైర్పర్సన్ ఎవరనేది తేలిపోనుంది. ఆమదాలవలస పురపాలక సంఘంలో చైర్పర్సన్ ఎన్నిక జిల్లా అధికారుల సమక్షంలో కమిషనర్ ఎన్.నూకేశ్వరావు గురువారం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. గతంలో వెలువడిన పుర ఫలితాలలో వైఎస్సార్సీపీ-10, టీడీపీ-8, కాంగ్రెస్-3, స్వతంత్రులు 2 స్థానాలు కైవసం చేసుకున్న విషయం పాఠకులకు విధితమే. మున్సిపాలిటి ఏర్పడిన దగ్గర నుంచి బొడ్డేపల్లి కుంటుంబీకులకే పట్టణ ప్రజలు అధికారం కట్టబెట్టారు. ప్రస్తుతం స్వతంత్ర అభ్యర్థుల్లో ఒకరు వైసీపీలో ఫలితాలు వెలువడకముందే చేరారు.
మరొకరు ఫలితాల అనంతరం టీడీపీలో చేరారు. వైఎస్సార్సీపీ మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా బొడ్డేపల్లి అజంతా కుమారి, టీడీపీ అభ్యర్థిగా తమ్మినేని గీతను ఎన్నికలముందే ప్రకటించారు. అయితే ఫలితాలు వెలువడ్డాక వైఎస్సార్ సీపీ ఆధిక్యంలో ప్రకటించడంతో మరలా బొడ్డేపల్లి కుటుంబానిదే చైర్పర్సన్ కుర్చి అని అంతా భావిస్తున్నారు. ఈ తరుణంలో రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో స్థానిక నాయకులు ఎలాగైనా గెలిచిన ఇతర పార్టీ కౌన్సిలర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు కౌన్సిలర్లపై టీడీపీ ఎక్కువ ఆశలు పెట్టుకుంది. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి ఎవరికీ మద్దతు తెలుపుతారో అనే అంశంపైనే చైర్పర్సన్ ఎన్నిక ముడిపడి ఉందని పలువురు చెబుతున్నారు.
మాట వినని కాంగ్రెస్ కౌన్సిలర్లు ...
కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన కౌన్సిలర్లు ఆ పార్టీ నాయకులరాలు బొడ్డేపల్లి సత్యవతి మాటలు వినడంలేదని సమాచారం. వీరు ఎవరికి మద్దతు పలుకుతారనేది కీలకం కానుంది. వీరు ఓటింగ్ సమయంలో హాజరుకాకుండా చూసే విధంగా కొంతమంది నాయకులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వారు రాకపోతే టీడీపీదే పైచేయి అవుతుందని వారి నమ్మకం.
ఎక్స్అఫిషియో ఓట్లతో గెలవాలనుకుంటున్న టీడీపీ...
టీడీపీ నుంచి ఆమదాలవలస ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కూన రవికుమార్‌తోపాటు శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మిదేవి, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడుకు ఎక్స్అఫిసియో ఓట్లు ఆమదాలవలస మున్సిపాలిటీలో వినియోగించుకోనున్నారు. వీరి ముగ్గురు ఓట్లతో టీడీపీకి 12, వైఎస్సార్సీపీకి 11 ఓట్లు మాత్రమే లభించే అవకాశాలు ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ కౌన్సెలర్ అభ్యర్థులు వైఎస్సార్సీపీకి మద్దతు ప్రకటిస్తేనే మంచిదని ప్రజలు భావిస్తున్నారు. పట్టణంలో ఎక్కడ చూసినా చైర్పర్సన్ ఎంపిక గురించే చర్చ సాగుతోంది. మరి కొన్ని గంటల్లోనే ఈ చర్చకు తెరపడనుంది.