డీపీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ
- 12 నుంచి నామినేషన్ల స్వీకరణ
- 15న పరిశీలన
- 17న పోలింగ్, అదే రోజు ఫలితాలు
ఇందూరు : జిల్లా ప్రణాళిక కమిటీ(డీపీసీ) సభ్యుల ఎన్నికలకు తెరలేచింది. పది రోజుల క్రితం ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా జిల్లా పరిషత్ అధికారులు డీపీసీ ఎన్నికలకు సంబంధించిన ఫైలును కలెక్టర్కు పంపారు. ఆయన దీనిపై సంతకం చేస్తూ సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేశారు. ఇటు జడ్పీ అధికారులు ఎన్నికల ఓటర్ల ముసాయిదా జాబితాను కూడా నోటీస్ బోర్డుపై పెట్టారు. 10వ తేదీ వరకు ఓటర్ల జాబితాలో పేర్లపై అభ్యంతరాలు స్వీకరిస్తారు.
కొత్తగా ఓట్లను నమోదు చేసుకుంటారు. 11న తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు. 12న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 15న నామినేషన్లను పరిశీలించిన అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను వెల్లడిస్తారు. 16న నామినేషన్ల ఉపసంహరణ, 17న పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు ఓట్లను లెక్కించి సాయంత్రానికల్లా ఫలితాలను ప్రకటిస్తారు.
డీపీసీ అధ్యక్షుడిగా జిల్లా మంత్రి..
స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన వెంటనే డీపీసీ ఎ న్నికలు జరగాల్సి ఉంది. అయితే ఆలస్యంగా వెలువడిన నోటిఫికేషన్లో ప్రభుత్వం డీపీసీలో కొన్ని మా ర్పులు చేసింది. గతంలో కమిటీకి చైర్మన్గా జిల్లా పరి షత్ చైర్మన్ ఉండేవారు. ఇక నుంచి జిల్లాకు చెందిన మంత్రి అధ్యక్షుడిగా ఉంటారు. కమిటీకి ఉపాధ్యక్షుడి గా జడ్పీ చైర్మన్, కార్యదర్శిగా కలెక్టర్ వ్యవహరిస్తారు.
జిల్లా ప్రణాళిక కమిటీ చాలా ముఖ్యమైంది. కమిటీ సభ్యులు ఆమోదం తెలిపితేనే జిల్లాకు కేంద్ర, రాష్ట్రాల నుంచి నిధులు వస్తాయి. ఈ డీపీసీలో మొత్తం 30 మంది సభ్యులుంటారు. మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్, మున్సిపల్ చైర్మన్లు ప్రత్యేక ఆహ్వనితులుగా ఉంటారు. ఎన్నికల్లో వీరికి ఓటు హక్కు ఉండదు. జడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు మాత్రమే ఓటర్లుగా ఉంటారు.