లగ్జరీ కారులో.. హాయిగా షికారు!
లగ్జరీ కారులో షికారుకెళ్లాలంటే లక్షలకు లక్షలు డబ్బులు పోసి కారు కొనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మన మహా నగరంలో లగ్జరీ కార్లు అద్దెకు దొరుకుతున్నాయి. స్వయంగా కారును నడుపుకుంటూ, కుటుంబ సభ్యులతో ఎంచక్కా షికారుకెళ్లవచ్చు. లగ్జరీ కారును నడిపామన్న అనుభూతిని సొంతం చేసుకోవచ్చు. పైగా కొన్న కారు అయితే ఒకటే ఉంటుంది. అదే అద్దె కారయితే నెలకొకటి చొప్పున అన్ని లగ్జరీ కార్లలోనూ చక్కర్లు కొట్టవచ్చు కదా!
ఖరీదైన కార్లను తామే నడుపుతూ ప్రయాణాన్ని ఆస్వాదించాలని ఆరాట పడుతున్న వారి సంఖ్య నగరంలో రోజు రోజుకూ పెరుగుతోంది. కానీ ఆడి, జాగ్వార్, మెర్సీడిస్, ల్యాండ్‌రోవర్, బెంజ్ తదితర లగ్జరీ కార్లను కొనుగోలు చేయడం అంటే సాధారణ విషయం కాదు. ఈ తరహా లగ్జరీ కార్ల ఖరీదంతా కోట్లలోనే ఉంటుంది. అయితే సామాన్య, మధ్య తరగతి జీవి కూడా ఈ లగ్జరీ కారు ప్రయాణాన్ని సెల్ఫ్డ్రైవ్లో ఆస్వాదించేందుకు ఇప్పుడు నగరంలో అవకాశం ఉంది. మెట్రో నగరంలో పెరుగుతున్న ‘సెల్ఫ్ డ్రైవింగ్ రెంటల్ కార్స్’ ట్రెండ్‌పై ప్రత్యేక కథనం...
బెంగళూరు: మహేష్...నగరంలోని ప్రముఖ సంస్థలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. ఖరీదైన ఆడి సిరీస్ కారులో సెల్ఫ్‌డ్రైవ్ చేసుకుంటూ వీకెండ్స్‌లో రైడ్‌కు వెళ్లాలనేది మహేష్ కోరిక. కానీ అతనికి వచ్చే ఆదాయం కారణంగా లగ్జరీ ఆడి కారును కొనే స్థోమత మహేష్‌కు లేదు. అందుకే నగరంలోని ఓ ట్రావెల్స్ సర్వీసును ఆశ్రయించాడు. ఎంచక్కా వీకెండ్లో ఓ కారును అద్దెకు తీసుకుని కుటుంబంతో కలిసి సెల్ఫ్‌డ్రైవ్ చేస్తూ విలాసవంతమైన ప్రయాణాన్ని ఆస్వాదించాడు.
వ్యాపార విస్తరణలో భాగంగా...
ట్రావెల్ ఏజన్సీలు అద్దెకు కార్లను ఇవ్వడం ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ఈ అద్దె కార్లను ఆయా సంస్థలకు చెందిన డ్రైవర్లే నడిపేవారు. అయితే ట్రావెల్ ఏజన్సీ తరఫున పనిచేసే డ్రైవర్లు లేకుండా సెల్ఫ్‌డ్రైవింగ్ కోరుకునే వారికి కార్లను అద్దెకు ఇవ్వడం ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. ప్రస్తుతం ఉద్యాననగరిలోని అనేక మంది ఉద్యోగులు సెల్ఫ్డ్రైవింగ్ని ఆస్వాదించాలనుకోవడమే ఇందుకు కారణం. అంతేకాక తమ వ్యాపారాన్ని మరింత విస్తరించాలనే ఆలోచన కూడా ట్రావెల్ ఏజన్సీలను ఈ దిశగా నడిపిస్తోంది. వారాంతాల్లో తమ కుటుంబంతో లేదా మనసైన వారితో లాంగ్‌డ్రైవ్‌కు వెళ్లాలనుకునే వారంతా ప్రస్తుతం ఈ తరహా లగ్జరీ అద్దె కార్లను ఆశ్రయిస్తుండడంతో నగరంలో సెల్ఫ్‌డ్రైవింగ్ రెంటల్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. ఇక నగరంలోని ఐటీ ఉద్యోగులు చాలా మంది వారాంతాల్లో విహారం కోసం ఈ తరహా సెల్ఫ్‌డ్రైవింగ్ సదుపాయం గల అద్దె కార్లను ఆశ్రయిస్తుండడంతో వారాంతాల్లో అద్దె కార్లకు మరింత డిమాండ్ ఏర్పడుతోంది.
ప్రత్యేక ‘సమ్మర్ హాలిడే’ ప్యాకేజీలు కూడా...
సాధారణంగా ట్రావెల్ ఏజన్సీలు ఈ తరహా అద్దె కార్లకు రోజుకు చొప్పున అద్దెను వసూలు చేస్తుంటాయి. అయితే వేసవికాలాన్ని దృష్టిలో పెట్టుకొని నగరంలోని ట్రావెల్ ఏజన్సీలు తమ వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. వేసవి సమయంలో కుటుంబంతో కలిసి దూర ప్రాంతాలకు విహారయాత్రలకు వెళ్లడానికి వారం లేదా అంతకంటే ఎక్కువ రోజులు కార్లను అద్దెకు తీసుకునే వారికి చెల్లించాల్సిన మొత్తంపై సబ్సిడీలు ప్రకటిస్తున్నాయి. ఈ విషయంపై నగరానికి చెందిన ఓ ట్రావెల్ ఏజన్సీలో పనిచేస్తున్న అభిషేక్ మాట్లాడుతూ...‘వేసవి సమయంలో దూర ప్రాంతాలకు కుటుంబంతో విహారయాత్రలకు వెళ్లే వారి కోసం ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తున్నాం. ప్రస్తుతం నగరంలో చాలా మంది బస్‌లు, రైళ్లలో విహారయాత్రలకు వెళ్లడం కంటే తమ సొంత కార్లో వెళ్లడానికే ఆసక్తి చూపుతున్నారు. తద్వారా తమకు నచ్చిన సమయంలో నచ్చిన ప్రాంతానికి సులభంగా చేరుకోవచ్చనేది వారి ఆలోచన. అందువల్ల ఈ వేసవి సెలవుల్లో సెల్ఫ్ డ్రైవింగ్ రెంటల్ కార్స్‌కి డిమాండ్ మరికాస్తంత పెరిగింది’ అని చెప్పారు.
కొంత మొత్తం డిపాజిట్‌గా...
ఏదైనా ట్రావెల్ ఏజన్సీ నుంచి సెల్ఫ్ డ్రైవింగ్ విభాగంలో కార్‌ను అద్దెకు తీసుకోవాలంటే ముందుగా కొంత మొత్తాన్ని డిపాజిట్‌గా చెల్లించాల్సి ఉంటుంది. అద్దెకు తీసుకునే కారు ధరను బట్టి ఈ మొత్తం రూ.10వేల నుంచి రూ.లక్ష వరకు ఉంటుంది. అంతేకాక కారు అద్దెకు తీసుకునే వారి డ్రైవింగ్ లెసైన్స్, డ్రైవింగ్‌లో ఉన్న అనుభవాన్ని తెలిపే ఐడీ కార్డులు, గుర్తింపు కార్డులను ట్రావెల్ ఏజన్సీలో అందించాల్సి ఉంటుంది. ఇక మిగతా ఒప్పంద పత్రాలు ఆయా సంస్థలను బట్టి మారుతూ ఉంటాయి.