‘పెన్షన్’ పత్రిక
ఆ జ్ఞానము అచట ఉన్నది. పండిన అనుభవాల రాశి పోగుబడి ఉన్నది. వేళ్లకు వయసు వచ్చినది కాని కలానికి కాదు సుమా. విశాలమైన తలపులు చెప్పవలసిన సంగతులు ఒకటా రెండా? మేము విశ్రాంతిలో లేము. అక్షరాల ఆలోచనల్లో ఉన్నాం. గత యాత్రకు కొనసాగింపులో ఉన్నాం. మేము నడవవలసిన దారి తెరిచిన పుటల మీదుగా సాగుతుంది. పాఠకుల మనోరథాల మీదుగా విహరిస్తుంది. ఊహలకు ఊపిరి పోస్తే మాకు ఆయువు. పాత్రలతో సంభాషిస్తే మాకు ఉత్సాహం. మేమెవరమో మీకు తెలుసా? మా లోపల ఏముందో మీకు ఎరుకేనా?‘మా నాన్న అదృష్టవంతుడు. చనిపోయే వరకూ రాస్తూనే ఉన్నాడు. రాసిన దాని కోసం పత్రికలు ఎదురు చూశాయి. ప్రచురించి మర్యాద చేశాయి. ఆయన రచయితగా జీవించి రచయితగా మరణించాడు. నేనూ ఉన్నాను. కథ రాస్తే ఎక్కడ ఇవ్వను. రాయకుండా ఎలా బతకను?’ పెన్షనర్ వయసున్న ఒక రచయిత అన్న మాటలు ఇవి. నేటి తెలుగు రాష్ట్రాల్లో యాభైలు దాటి, రచనాశక్తితో ఉన్న వారి ఆవేదనంతటికీ ఈ మాటలు శోచనీయమైన ఆనవాలు.ఒక రచయిత పరిణతి యాభైల తర్వాతే రచనల్లో వ్యక్తమవుతుంది. అనుభవాల సారము, వాటి బేరీజు, వాటిపై వ్యాఖ్యానం, వాటితో నేటి తరానికి చెప్పవలసిన జాగరూకత, వాటి నమోదు, తద్వారా బలపడే సారస్వత సంపద... ఏ జాతికైనా పెను పెన్నిధి. దురదృష్టం, కాలమహిమ తెలుగు రాష్ట్రాల్లో పత్రికలు కనుమరుగైపోయాయి. సాహిత్య పత్రికలు, చిన్న పత్రికలు, వీక్లీలు.... ఎంత రాసినా వేసే మంత్లీలు... బైమంత్లీలు... క్వార్టర్లీలు.... ఏ బస్టాండ్ బడ్డీకొట్టులోనో అందుకునే అపరిచిత పాఠకుడికై వాటి అందుబాటు... ఎక్కడ... ఎక్కడా? ‘మీ రచనను ప్రచురణకు స్వీకరించాం’ కార్డు ముక్క, దానికి ఫలానా చిత్రకారుడు వేసే గొప్ప బొమ్మ, పోస్టులో పత్రిక అందడం, మరికొన్ని రోజులకు సంబరంగా సంతకం చేసి తీసుకునే పారితోషికపు మనీఆర్డర్... ఎక్కడ... ఎక్కడా? కంప్యూటర్ స్క్రీన్ కో, సెల్‌ఫోన్ కురచదనానికో సంతృప్తి పడే నేటి పాఠకులు ఉండుగాక. కాని పెద్దలు ఉన్నారు. కాగితపు వాసనను పీల్చి, అక్షరాలను వేళ్లతో తడిమిగాని సంతృప్తి పడని ప్రాణాలున్నాయి. కట్టె కొట్టె తెచ్చేలా కాకుండా, అరచేత్తో లోడేదే లోతు అనుకునే రచయితల్లా కాకుండా, తమ రచనలతో చెరువులనూ, కడలి కెరటాల సంచలనాత్మలనూ సృష్టించిన చేతులు ఉన్నాయి. వారి సంగతి ఏమిటి? వారికేదైనా పెన్షన్ కావాలని ఎవరైనా ఆలోచించారా?1970–90ల మధ్య కాలంలో కథ అంటే కనీసం ఐదారు పేజీలు ఉండేది. పెద్దకథలు ఉండేవి. నవలికలు, సీరియల్ నవలలు, గల్పికలు, ప్రహసనాలు, ఆత్మకథలు, జ్ఞాపకాలు, సంవాదాలు, అనువాదాలు, ఇంటర్వ్యూలు... ఇవన్నీ రాసినవారు, ఇచ్చినవారు ఇంకా ఉన్నారు. జనాభా లెక్కల్లో గల్లంతై పోలేదు. వీరు రాయగా చదివి అభిమానులు అయినవారు ఉన్నారు. బండలై పోలేదు. ఈ రాసే వారు రాయడానికీ... ఈ చదివేవారు అనుసంధానమై చదవడానికీ... అవసరమైన వేదికలే తెలుగునాట లేవు. ఈ రచయితలకు, పాఠకులకు ఒక పెన్షన్ స్కీమ్ కావాలి. వీరి అనుభవాన్ని, ఆత్మగౌరవాన్ని మన్నిస్తూ వీరి రచనలకు చోటు కల్పించడం కోసం ఒక పథకం కావాలి. కొత్త తరాలతో పోటీ పడుతూ డిజిటల్ క్యూలలో దూరి బుకింగ్ కోసం వీరు చేయి దూర్చరని గ్రహించడం అత్యవసరం. అదొక్కటేనా? పునఃపఠనం సంగతో? ఎంతో రాసి, ఎన్నో క్లాసిక్స్ ఇచ్చిన రచయితలను రీవిజిట్ చేయడానికి ఒక్క కాగితపు పుట ఇంత పెద్ద జాతికి లేకపోవడం విషాదమా, కాదా?‘ఏజ్‌లెస్ ఆథర్స్’... 65 ఏళ్లు ఆపైన వయసున్న వారి రచనలనే క్రమం తప్పకుండా వెలువరించే సంకలనాల వరుస ఇది. ‘క్రోన్ : విమెన్ కమింగ్ ఆఫ్ ఏజ్’... ఇది అరవైలు దాటిన స్త్రీల రచనలు ప్రచురించే పత్రిక. ‘పాసేజర్’... యాభై ఏళ్ల తర్వాత రాసిన వారివే ఈ పత్రిక వేస్తుంది. ‘ఎనభై ఏళ్లు పైబడిన వారు రాయట్లేదే అని చింతించాం. కాని ఇప్పుడు ఆ వయసు వారూ వచ్చి రాస్తున్నందుకు సంతోషంగా ఉంది’ అని ఆ పత్రిక పేర్కొంది. ‘రీ ఇన్వెన్షన్ ఆఫ్టర్ రిటైర్మెంట్’... స్లోగన్‌తో యాభైలు దాటిన రచయితల రచనలు మాత్రమే వేసే పత్రికలు పాశ్చాత్య దేశాల్లో ఉన్నాయి. వారి మానసిక ఆనందానికి అవి అవసరం అని ఆ యా దేశాలు భావిస్తున్నాయి. మన దేశంలో ఇతర భాషల్లో పత్రికలు సజీవంగా ఉన్నాయి కాబట్టి వారికి ఈ బెడద తెలియదు. తెలుగు సీనియర్స్కే సమస్య అంతా! వీరు చదివిన వందల పుస్తకాల నుంచి విలువైన మాటలు చెప్పాలా, వద్దా? వేయిదీపాల మనుషులు వీరు అనే సోయి మనకు ఉందా?‘రాయాలంటే ఎక్కడ రాయాలి’ అనుకునే కవులు, రచయితలు, ఆలోచనాపరులు, విమర్శకులు, నాటకకర్తలు, వ్యంగ్య విన్యాసకులు నేడు ఎందరో నిశ్శబ్దంగా ఉన్నారు. లోపలి వెలితితో ఉన్నారు. వీరి సృజన సన్నగిల్లలేదు. మరింత విస్తరణను కోరుకుంటోంది. వీరిని నిర్లిప్తంగా ఉంచడమంటే కనబడని గోడల జైలులో పెట్టడమే! సాంస్కృతిక ఆస్తిపత్రాలు గల్లంతు చేసుకోవడమే. ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు, ఇద్దరు సంపాదక సిబ్బందితో ఏ రాష్ట్ర సాంస్కృతిక శాఖ అయినా ఏ యూనివర్సిటీ అయినా ఏ బాధ్యత గల్ల సంస్థైనా ప్రతి నెలా ‘పెన్షన్ పత్రిక’ నడపవచ్చు. పెన్షన్లు వ్యక్తిగత హితానికైతే ఇది సామాజిక హితానికి! అమరావతి, మూసీల ఖర్చులో దీనికై వెచ్చించవలసింది 0.0000001 పైసా. ఈ కొత్త పెన్షన్ కోసం డిమాండ్ చేద్దాం!