Sensex crash
-
స్టాక్ మార్కెట్ రక్తమోడినా...
ముంబై: స్టాక్ మార్కెట్లు రక్తమోడుతున్నా కొన్ని షేర్లు నిబ్బరంగా నిలబడ్డాయి. నష్టాల సునామీ చుట్టుముట్టినా దాదాపు 206 షేర్లు లాభాల బాటలో సాగాయి. స్టాక్ మార్కెట్ కుప్పకూలి ఇన్వెస్టర్లు దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారు.ఇంత పతనంలోనూ కొన్ని కంపెనీల షేర్లు లాభాలు ఆర్జించడం విశేషం. మ్యాగీ నూడుల్స్ తో వివాదాలపాలైన నెస్లే ఇండియా టాప్ గెయినర్స్ లో ఒకటిగా నిలిచింది. ఇంట్రాడేలో నెస్లే ఇండియా షేర్లు 2 శాతం వరకు లాభపడ్డాయి. ఆరంభంలో రూ. 6100గా ఉన్న షేరు తర్వాత రూ.6,206కు పెరిగింది. వీడియోకాన్ ఇండస్ట్రీస్ వాటాలు 4.36 శాతం లాభపడ్డాయి. సన్ రైజ్ ఏషియన్, ఒరిసా స్పాంజ్ అండ్ ఐరన్, ఇమామీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, జిందాల్ వరల్డ్ వైడ్, బిన్నీ మిల్స్ తదితర షేర్లు లాభాలు ఆర్జించాయి. -
బ్లాక్ మండే: రూ.3 లక్షల కోట్లపైగా నష్టం
ముంబై: స్టాక్ మార్కెట్ చరిత్రలో మరో భారీ పతనం. ఊహించని నష్టాలతో స్టాక్ మార్కెట్ సూచీలు కుప్పకూలాయి. మూడో అతిపెద్ద పతనంతో సోమవారం స్టాక్ మార్కెట్ పాలిట బ్లాక్ మండేగా పరిణమించింది. బీఎస్ఈ సూచి సెన్సెక్స్ సుమారు 1500 పాయింట్లు పతనమై 26వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 7900 పాయింట్ల కిందకు పతనమైంది. నిఫ్టీలోని 50 షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బీఎస్ఈలోని 500 షేర్లలో కేవలం 6 షేర్లు మాత్రమే నష్టాల బారిన పడకుండా ఉన్నాయి. స్టాక్ మార్కెట్ కుప్పకూలడంతో ఇన్వెస్టర్లు దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు పైగా నష్టపోయినట్టు అంచనా. ఏడున్నరేళ్లలో ఇదే అతిపెద్ద నష్టం కాగా, స్టాక్ మార్కెట్ చరిత్రలో మూడోది. 2008, జనవరి 21న సెన్సెక్స్ 2,062 పాయింట్లు పతనమైంది.