Sentenced to life in prison
-
విద్యార్థి హత్య కేసులో నలుగురికి యావజ్జీవం
బెంగళూరు: నగదు, నగల కోసం ఇంజనీరింగ్ విద్యార్థిని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసిన నలుగురికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించిందని బెంగళూరు నగర అడిషనల్ పోలీసు కమిషనర్ అలోక్‌కుమార్ శుక్రవారం చెప్పారు. పాట్నాకు చెందిన వారిక్, జార్ఖండ్‌కు చెందిన రోహిత్, బార్గర్ల్స్గా పని చేస్తున్న శివాని, ప్రీతి అనే నలుగురికి ఈ శిక్షతో పాటు ఒక్కొక్కరిని రూ. ఐదు వేలు జరిమాన విధించిందన్నారు. అదే విధంగా హత్యకు గురై ఇంజనీరింగ్ విద్యార్థి తుషార్ (21) కుటుంబ సభ్యులకు రూ. 45 వేలు నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసిందన్నారు. బీహార్‌కు చెందిన తుషార్ బెంగళూరు చేరుకుని ఇక్కడి ఎస్కేఐటీ కాలేజ్‌లో ఇంజనీరింగ్ విద్యాభ్యాసం చేసేవాడు. వారిక్ ప్రయివేటు కంపెనీ ఉద్యోగి. 2011 జనవరిలో ఈ నలుగురు తుషార్‌ను కిడ్నాప్ చేశారు. తరువాత యలహంక సమీపంలోని అట్టూరు లేఔట్‌లోని వారిక్ ఇంటిలో నిర్బందించారు. చివరికి ఓడ్కా బాటిల్‌తో తుషార్ తల పగలగొట్టి, గొంతు నులిమి హత్య చేశారు. మృతదేహాన్ని తీసుకు వెళ్లి విరసాగర రోడ్డులోని కెంపనహళ్ళి దగ్గర ఉన్న నీలగిరి తోటలో విసిరి వేసి అక్కడి నుంచి పరారైనారు. అప్పటి అమృతహళ్ళి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం.ఎస్. అశోక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నివేదిక కోర్టులో సమర్పించారు. కేసు విచారణ చేసిన న్యాయస్థానం నిందితులు నేరం చేసినట్లు రుజువు కావడంతో శిక్ష, జరిమాన విధించిందని అలోక్‌కుమార్ తెలిపారు. -
ఐదుగురికి యావజ్జీవం
న్యూఢిల్లీ: ఢిల్లీలో సంచలనం సృష్టించిన దౌలాకాన్ గ్యాంగ్‌రేప్ కేసులో స్థానిక కోర్టు సోమవారం ఐదుగురు దోషులకు యూవజ్జీవ కారాగార శిక్ష విధించింది. మిజోరంకు చెందిన ఓ బీపీఓ ఉద్యోగిపై 2010లో జరిగిన సామూహిక అత్యాచారం కేసు విచారణ సందర్భంగా స్థానిక అదనపుసెషన్స్ జడ్జి వీరేందర్ భట్ వీరికి యావజ్జీవ శిక్షతోపాటు ఒక్కొక్కరికీ రూ.50వేల చొప్పున జరిమానా విధించారు. ఈ మెుత్తాన్ని బాధితురాలికి నష్టపరిహారం కింద చెల్లించాలని ఆదేశించారు. అపహరణ, కుట్ర తదితర నేరాల కింద ఏడేళ్లు, ఐదేళ్ల చొప్పున కూడా వీరికి శిక్షలు విధించారు. దోషులుగా నిరూపితమైన ఉస్మాన్, శంషాద్, షాహిద్, ఇక్బాల్ల్, కవ్రుుద్దీన్‌లు హర్యానాలోని మేవాట్ ప్రాంతానికి చెందినవారు. వీరు పేద కుటుంబాలకు చెందిన వారని, ఈ దృష్ట్యా శిక్ష తగ్గించాలని వారి తరఫు న్యాయవాది చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. దోషులు ఉన్మాదులని, వారిని సమాజానికి దూరంగా ఉంచాలని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. 2010 నవంబర్ 23 అర్ధరాత్రి బాధితురాలు ఆఫీసు నుంచి వస్తుండగా దోషులు ఆమెను అపహరించి అత్యాచారానికి పాల్పడి ఓ నిర్జన ప్రాంతంలో వదిలేశారు. ఈ కేసులో 2010 డిసెంబర్ 2న ఇద్దరు 6న మిగతావారిని పోలీసులు అరెస్టు చేశారు. 2011 ఫిబ్రవరి 2న పోలీసులు చార్జిషీటు దాఖలు చేశారు. 2014 జూన్ 2న తుది వాదనలు జరిగారుు. అక్టోబర్ 14న కోర్టు నిందితులను దోషులుగా నిర్ధారించింది.