ఉమ్మడి హైకోర్టు తీర్పుపై సుప్రీం దిగ్భ్రాంతి
న్యూఢిల్లీ: యాసిడ్ పోసి ఓ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసిన నేరస్తుడి జైలు శిక్షను ఉమ్మడి హైకోర్టు 30 రోజులకు తగ్గిం చడంపై సర్వోన్నత న్యాయస్థానం సోమవారం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. 2003లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువ తి కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారనే కారణం తో ఓ యువకుడు ఆమెపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. నిందితుడికి దిగువ కోర్టు ఐపీసీ సెక్షన్ 326 (ఉద్దేశ పూర్వకంగా ప్రమాదకర వస్తువులు, ఆయుధాలతో గాయపర్చడం) ప్రకారం ఏడాది కఠిన కారాగార శిక్ష, రూ.5వేల జరిమానా విధించింది.
దీనిపై అతను హైకోర్టులో అప్పీలు చేయగా జైలుశిక్షను 30రోజులకు తగ్గిస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై బాధితురాలు సుప్రీం ను ఆశ్రయించారు. కేసును విచారించిన జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఆర్.భానుమతిలతో కూడిన బెంచ్ హైకోర్టు తీర్పుపై విస్మయం వ్యక్తం చేసింది. దిగువ కోర్టు విధించిన ఏడాది శిక్షను పునరుద్ధరించడంతో పాటు నేరస్తుడు రూ.50వేలు, రాష్ట్రప్రభుత్వం రూ.3 లక్షల నష్టపరిహారాన్ని బాధితురాలికి చెల్లించాలని తీర్పునిచ్చింది.