ప్రత్యేక రాయలసీమ కోసం ఉద్యమం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ప్రత్యేక రాయలసీమ రాష్ర్ట సాధన కోసం పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 14, 15 తేదీల్లో శ్రీకృష్ణదేవరాయల విగ్రహం దగ్గర 48 గంటల పాటు నిరాహార దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. ఆదివారం ఏక్యాంపులోని కార్యాలయంలో ఇంజినీరింగ్ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ..ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాయలసీమ వాసి అయిన కోస్తాంధ్రాను అభివృద్ధి చేస్తూ సీమను విస్మరిస్తున్నారని విమర్శించారు.
తిరుపతి పద్మావతి మహిళా మెడికల్ కళాశాల సీట్లను కోస్తా వారికి కేటాయించేందుకు జీవో 120 తెచ్చి సీమ వాసులకు తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. ఎన్నికల హామీల్లో నిరుద్యోగ భృతి ఇస్తానన్న ముఖ్యమంత్రి దాని గురించి పట్టించుకోవడంలేదన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సుహాన్బాషా, నాయకులు సాయికృష్ణచౌదరి, ఉమామహేశ్వరరెడ్డి, గుర్రప్పయాదవ్ పాల్గొన్నారు.