వాళ్లందరి వయసూ పదహారే..!
ఒకే కాన్పులో ఇద్దరు పుడితే ట్విన్స్ లేదా కవలలు అని పిలుచుకోవచ్చు. ముగ్గురు పుడితే ట్రిప్లెట్స్ అని పిలుచుకోవచ్చు. మరి ఏకంగా ఒకే కాన్పులో ఏడుగురు పిల్లలు పుడితే..? 16 యేళ్ల కిందట అమెరికాకు చెందిన మెక్ కాఫీ ఒకే కాన్పులో ఏకంగా ఏడుమంది పిల్లలకు జన్మనిచ్చింది! ప్రపంచమంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది.
అంతవరకూ ఒకే కాన్పులో అంతమంది పిల్లలకు జన్మనిచ్చిన తల్లి ఎవరూ లేదని వైద్యులు ధ్రువీకరించారు. అలా ఒకేసారి ఏడుమంది పిల్లలు పుడితే వారిని ‘సెప్టప్లెట్స్’ అని పిలుచుకోవచ్చని అప్పట్లో డాక్టర్లు ఒక పదాన్ని సృష్టించారు. అదేసమయంలో వారి ఆరోగ్యస్థితిగతుల గురించి ఆందోళన వ్యక్తపరిచారు. అంతకుముందు కాన్పులో ఒక పాపాయిని, అప్పుడు ఏడుమందిని ఒకేసారి ప్రసవించిన కాఫీని, ఆమె పిల్లలను చాలారోజులు అబ్జర్వేషన్లో ఉంచారు.
నాటి అమెరికా అధ్యక్షుడు బిల్‌క్లింటన్ కూడా కాఫీదంపతులను ప్రత్యేకంగా కలిశాడు. ఆ తర్వాత కాఫీ, ఆమె పిల్లలను అందరూ మరచిపోయారు. ఇటీవలే ఈ ఏడుగురూ తమ 16వ పుట్టినరోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకొన్నారు. తద్వారా మళ్లీ వార్తల్లోకి వచ్చారు. పిల్లల పెంపకంలో పడిపోయి పదహారేళ్లు ఎలా గడిచిపోయాయో కూడా తమకు తెలియడం లేదని కాఫీ దంపతులు అన్నారు.