రాజ భాష.. రాచబాట
ప్రపంచంలో రెండో భాషగా హిందీ
ఆసక్తి చూపుతున్న యువత
నేడు జాతీయ హిందీ భాషాదినోత్సవం
పాలకుర్తి టౌన్ : ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే భాష ‘మాండలీస్’.. ఆ తర్వాత స్థానం ‘హిందీ’కే దక్కింది. మన దేశం వరకు ఈ భాషదే మొదటి స్థానం. అత్యధిక రాష్ట్రాల్లో మాతృభాషగా ఉన్నది కూడా హిందీయే కావడం గమనార్హం. దేశంలో రాజభాషగా ప్రాధాన్యమున్న హిందీని అభివృద్ధి పరిచే లక్ష్యంతో ఏటా సెప్టెంబర్ 14న జాతీయ దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమా లు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో హిందీ భాష విశేషాలు, ఉపాధి అవకాశాలపై ప్రత్యేక కథనం.
అవకాశాలు బోలెడు
హిందీ భాషాభివృద్ధికి అనేక సంస్థలు పనిచేస్తున్నాయి. సాఫ్ట్వేర్ రంగాల వైపు విద్యార్థులు పరుగులీడుతున్న తరుణంలోనూ హిందీ పండిత శిక్షణ (హెచ్పీటీ)కు అనేక మంది యువకులు అసక్తి కనబ రుస్తున్నారు. హిందీభాషతో ఉపాధ్యాయులుగా, అనువాదకులుగా పనిచేసేందుకు బోలెడు అవకాశాలున్నాయి.
పలు కార్యక్రమాలు..
1950 జనవరి 26 నుంచి హిందీ అధికార భాషగా చెలామణి అవుతోంది. జాతీయ హిందీ దినోత్సవాన్ని పురస్కరించుకుని వారం రోజులపాటు హిందీ భాష వికాస సమితి ఆధ్వర్యంలో పాఠశాలల్లో విద్యార్థులకు హిందీ భాషపై వకృ్తత్వ, పాటల పోటీలు నిర్వహిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి హిందీ భాష ప్రాముఖ్యతను కూడా వివరిస్తున్నారు.
హిందీ ప్రాముఖ్యత..
ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే భాషల్లో హిందీ ద్వితీయ, సాహిత్యంలో తృతీయ స్థానంలో ఉంది.
ప్రపంచంలో అతి ముఖ్యమైన 16 భాషల్లో హిందీది ఐదో స్థానం.
అమెరికాలోనూ హిందీ నేర్పేందుకు అక్కడ 114 కేంద్రాలు పనిచేస్తున్నాయి.
రష్యాలో 7 హిందీ కేంద్రాలున్నాయి.
మన దేశంలో 8 రాష్ట్రాల్లో హిందీ అధికార భాషగా కొనసాగుతోంది.
రోజుకో హిందీ పదంతో ఆం్ర«ధాబ్యాంకు, ఎల్ఐసీ తదితర కార్యాలయాల్లో హిందీ భాషను ప్రోత్సహించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. కార్యాలయంలోని బోర్డుపై రోజుకో హిందీ పదాన్ని రాసి అటు సిబ్బం దికి ఇటు వినియోగదారులకు అవగాహన పెంచుతున్నారు.