ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు షురూ.. డెలివరీ ఎప్పుడంటే ?
Ola Electric Scooter Sales: యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూసిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి వచ్చే సమయం ఆసన్నమైంది. రేపటి నుంచి ఓలా స్కూటర్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఈ స్కూటర్‌ను సొంతం చేసుకోవాలని అనుకునేవారి కోసం ఈఎంఐ ఆప్షన్ని పలు బ్యాంకులు అందిస్తున్నాయి.
సెప్టెంబరు 8 నుంచి
ఓలా స్కూటర్‌కి ఇప్పటి వరకు ప్రీ బుకింగ్స్ ముగిశాయి. 2021 సెప్టెంబరు 8 నుంచి అమ్మకాలు ప్రారంభం అవుతున్నాయి. దీంతో ప్రీ బుకింగ్ చేసుకున్న వారు సెప్టెంబరు 8 నుంచి కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి బైక్‌ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మొత్తం సొమ్ము చెల్లించి లేదా ఈఎంఐ పద్దతిలో స్కూటర్ని కొనుగోలు చేయవచ్చు.
ఈఎంఐ ఆప్షన్
ఓలా స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే వారికి అనుకూలంగా ఉండేందుకు పలు బ్యాంకులతో ఓలా సంస్థ ఒప్పందం చేసుకుంది. ఇందులో హెచ్డీఎఫ్సీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, యస్ బ్యాంక్, ఇండస్ ఇండ్, కోటక్ మహీంద్రా, ఐసీఐసీఐ మహీంద్రా ప్రైమ్, టాటా క్యాపిటల్, ఏయూ స్మాల్ ఫైనాన్స్, జన స్మాల్ ఫైనాన్స్, వంటి పలు బ్యాంకింగ్ , ఫైనాన్స్ సంస్థలు ఉన్నాయి. అందరికీ అందుబాటులో ఉండేలా కనీస ఈఎంఐ రూ. 2,999గా నిర్ణయించారు.
అక్టోబరులో డెలివరీ
సెప్టెంబరు 8 నుంచి ఓలా వెబ్సైట్ ద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసిన వారికి అక్టోబరులో డెలివరీ ఇస్తామని ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ మార్కెటింగ్ చీఫ్ వరుణ్ దుబే తెలిపారు. షోరూం వ్యవస్థ లేనందున నేరుగా కస్టమర్ల ఇంటికే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు వస్తాయంటూ చెప్పారు.
స్పష్టత ఇస్తాం
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌కి విపరీతమైన డిమాండ్ ఉంది. లక్షకు పైగా ప్రీ బుకింగ్స్ సాధించింది. మరోవైపు ఆటోమొబైల్ ఇండస్ట్రీని చిప్‌ల కొరత వేధిస్తోంది. దీంతో బైక్‌ను కొనుగోలు చేసే సమయంలోనే డెలివరీ ఎప్పుడిస్తామనే వివరాలు కస్టమర్‌కి వెల్లడిస్తామని ఓలా ప్రతినిధులు తెలిపారు. ఓలా సంస్థకు తమిళనాడులో భారీ స్కూటర్ తయారీ ఫ్యాక్టరీ ఉంది.
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్స్
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను ఎస్ 1, ఎస్ 1 ప్రో అంటూ రెండు వేరియంట్లలో అందిస్తున్నారు. వీటిలో 8.5 కిలోవాట్ మోటార్, 3.97 కిలోవాట్ పర్ అవర్ బ్యాటరీని అమర్చారు. గరిష్ట వేగం గంటకు 90 నుంచి 115 కిలోమీటర్లుగా ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 121 నుంచి 180 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు, కేవలం మూడు సెకన్లలో 40 కిలోమీటర్ల స్పీడ్‌ను అందుకోగలదు. ఇందులో ఎస్ 1 ధర రూ. 99,999లుగా ఉండగా ఎస్ 1 ప్రో ధర రూ.1,29,000లుగా ఉన్నాయి. ఓలా స్కూటర్ పది రంగుల్లో లభిస్తోంది.
అంతటా ఆసక్తి
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌కి జులైలో ప్రీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. రీఫండబుల్ అమౌంట్‌గా రూ. 499 చెల్లించి ప్రీ బుకింగ్ చేసుకోవాలని ఓలా కోరగా.. రికార్డు స్థాయిలో లక్షకు పైగా ప్రీబుకింగ్స్ జరిగాయి. ఆ తర్వాత ఆగస్టు 15న ఓలా స్కూటర్ ఫీచర్స్, ధరను ఆ కంపెనీ సీఈవో భవీశ్ అగర్వాల్ వెల్లడించారు. అప్పటి నుంచి ఈ స్కూటర్ మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే వారి సంఖ్య పెరిగిపోయింది.
చదవండి: ఓలా కార్స్.. నడిపి చూడండి .. నచ్చితేనే కొనండి !