నువ్వు ఆఫీసులో ఉంటే..మేం పనిలేక గ్రీవెన్స్‌లో ఉన్నామా?
రాంనగర్ : ‘‘నువ్వు ఆఫీసులో ఉంటే...మేం పని లేక గ్రీవెన్స్‌లో ఉన్నామా...కిందిస్థాయి ఉద్యోగిని పంపించి నువ్వేమి చేస్తున్నావ్...10 నిమిషాల్లో గ్రీవెన్స్‌లో ఉండాలి’’ అంటూ జిల్లా సహకార అధికారి తుమ్మ ప్రసాద్‌పై ఫోన్లో కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గరిడేపల్లి మండలం పొనుగోడు పీఏసీఎస్‌లో ఎరువులు అధిక ధరలకు అమ్ముతుండడంతో పాటు సొసైటీకి వచ్చే ఎరువులను వ్యాపారులకు విక్రయిస్తున్నారని కొంతమంది రైతులు చేసిన ఫిర్యాదుపై కలెక్టర్ సీరియస్‌గా స్పందించారు. దీంతో అధికారి ప్రసాద్ హుటాహుటిన గ్రీవెన్స్‌డేకు వచ్చి కలెక్టర్‌ను కలిశారు. ‘‘జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వస్తే మీకు పట్టదా...గ్రీవెన్స్‌డేకు హాజరు కాకుండా కిందిస్థాయి ఉద్యోగిని పంపి అక్కడ ఏం చేస్తున్నావు’’ అంటూ అధికారిపై మండిపడ్డారు.
‘‘ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో యూరి యా, ఇతర ఎరువుల ధరలు పెంచి విక్రయిస్తుంటే ఎందుకు పట్టించుకోలేదు..ఎరువులు కొనుగోలు చేసిన రైతులకు రసీదులు ఎందుకు ఇవ్వడంలేదు...సొసైటీ ద్వారా మనం ఎందుకు ఎరువులు సరఫరా చేస్తున్నాం...రైతులకు ఇబ్బందులు రావద్దనే కదా...కనీసం అక్కడ రిజిస్టర్ నిర్వహణ కూడా లేకుంటే ఎలా’ అంటూ కలెక్టర్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఎరువులను వ్యాపారులకు విక్రయిస్తుంటే మీరేం చేస్తున్నారని ప్రశ్నించారు. సొసైటీని తనిఖీ చేసి నివేదికను మంగళవారం మధ్యాహ్నం లోగా అందించాలని డీసీఓను ఆదేశించారు. విధుల్లో అలసత్వం వహించిన డీసీఓకు మెమో జారీ చేయాలని కలెక్టరేట్ ఏఓకు సూచించారు.