'భయో'మెట్రిక్
- సక్రమంగా పని చేయని సర్వుర్లు
- డీబీటీ ద్వారా ఎరువుల పంపిణీకి అవస్థలు
- కొత్తపద్ధతి తప్పనిసరి అంటున్న వ్యవసాయశాఖ
- ఆందోళనలో వ్యవసాయశాఖ సిబ్బంది
ప్రభుత్వ పథకాల అమలులో ఆధార్, బయోమెట్రిక్ తప్పనిసరి చేయడంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతికార్యక్రమానికీ ‘యాప్’ అంటూ ప్రభుత్వశాఖల్లో వందల కొద్దీ అందుబాటులోకి తెచ్చారు. కానీ అందుకు తగ్గట్టు సాంకేతిక పరిజ్ఞానం కల్పించక, సామర్థ్యం పెంచకపోవడంతో పథకాలు సక్రమంగా అమలుకాలేదు. తరచూ సర్వర్లు సతాయిస్తున్నాయి. స్వైపింగ్ మిషన్లు మొరాయిస్తున్నాయి. ఎరువుల పంపిణీలో డైరెక్ట్ బెనిఫిషర్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) విధానం అమలులోకి తేవడంతో రైతులకు ఇబ్బందిగా మారింది. బయోమెట్రిక్ మిషన్లు పనిచేయక ఎరువుల పంపిణీకి ఆటంకంగా మారింది. మరోవైపు వ్యవసాయాధికారులు తప్పనిసరిగా డీబీటీ విధానం పాటించాలని ఒత్తిడి చేస్తుండడంతో దుకాణదారులు దిక్కులు చూస్తున్నారు.
- అనంతపురం అగ్రికల్చర్
జిల్లాలో విత్తన, పురుగుముందులు, ఎరువుల దుకాణాలు : 890
ఎరువులు లైసెన్సు కలిగినవి : 680
కావాల్సిన బయోమెట్రిక్, స్వైపింగ్ మిషన్లు : 680
వ్యవసాయశాఖ పంపిణీ చేసింది : 301
సక్రమంగా పనిచేస్తున్నవి : 60
జిల్లాకు ఈ ఖరీఫ్‌లో 1.25 లక్షల మెట్రిక్ టన్నుల వివిధ రకాల ఎరువులు కేటాయించారు. ప్రస్తుతానికి జిల్లా అంతటా 43 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు నిల్వ ఉన్నట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. జిల్లా వ్యాప్తంగా లైసెన్సులు కలిగిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల దుకాణాలు ఉన్నాయి. అందులో ప్రస్తుతానికి ఎరువుల పంపిణీకి డీబీటీ విధానం అమలు చేయాలని ఆదేశాలు ఉన్నాయి. ఈ క్రమంలో కేవలం ఎరువులు లైసెన్సులు కలిగిన దుకాణాలు 680 వరకు ఉన్నాయి. అందరికీ బయోమెట్రిక్, స్వైపింగ్ మిషన్లు ఇవ్వాల్సిన వ్యవసాయశాఖ కేవలం 301 మందికి మాత్రమే ఇచ్చి జిల్లా అంతటా అమలు చేయాలని ఆదేశాలు ఇవ్వడం విశేషం. ఇచ్చిన 301 మిషన్లు పనిచేస్తున్నాయా అంటే అదీ లేదు. అందులో పని చేస్తున్నవి 60కి మించి లేవని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
680 షాపులకు గానూ 60 షాపుల్లో డీబీటీ విధానం అమలు చేస్తున్నా అక్కడ కూడా సర్వర్ సక్రమంగా పనిచేయకపోవడంతో చాలా మంది వాటిని పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. సర్వర్లు, సాంకేతిక పరిజ్ఞానం సమస్యలు చెప్పకుండా ఎలాగోలా పనిచేసేలా చూసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు ఒత్తిడి తెస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు దుకాణదారులు వాపోతున్నారు. ఆధార్ అనుసంధానం లేకుండా ఎరువులు పంపిణీ చేయొద్దని ఆదేశాలు ఉండటంతో చాలా మంది రైతులకు సకాలంలో ఎరువులు అందే పరిస్థితి కనిపించలేదు. దీనికితోడు వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఎరువులకు అంతగా గిరాకీ లేనందున సమస్య పెద్దగా కనిపించని పరిస్థితి.
జేడీఏ కార్యాలయ అధికారులేమంటున్నారంటే...
త్వరలోనే అందరికీ బయోమెట్రిక్ పరికరాలు అందజేస్తామని, 4–జీ సామర్థ్యం కలిగిన సిమ్, స్వైపింగ్ మిషన్లు అందుబాటులో పెట్టాలని ఆదేశించాం. ఇంకా పూర్తి స్థాయిలో డీబీటీ విధానం అందుబాటులోకి రాలేదు. దీంతో ప్రస్తుతానికి ఎవరిపైనా ఒత్తిడి చేయలేదని బదులిచ్చారు.