నవ దార్శనిక మహాకవి శేషేంద్ర
శేషేంద్ర దార్శనిక దృష్టిని మరొక కోణం నుండి కూడా చూడాల్సి ఉంది. ఎట్టి త్యాగాలు చేసి సంపాదించిన ఎంతటి మహత్తర శుభపరిణామమైనా శాశ్వతంగా నిలువదు. అది ఎలాగో క్రమక్రమంగా క్షీణిస్తుంది. మళ్ళీ త్యాగాలు చేసి మరొక సత్పరిణామాన్ని సాధించుకోవలసిందే.
నిర్మల హృదయ లతాంతమే నిఖిల కళాలతల పరమ ప్రయోజనం. కవితా కళ పరమ ప్రయోజనం నిర్మల హృదయాన్ని ఘటించటం. నిర్మల హృదయమంటే ప్రధానంగా సహానుభూతి హృదయం, సమతా వాంఛా హృదయం, పరపీడకులకు ప్రగాఢ క్రోధ హృదయం. ఏ కాలపు సత్కవిలోనైనా ఈ మూడు ప్రధాన విషయాలు గోచరిస్తయ్. కిరాతుడు క్రౌంచపక్షిని వధించినప్పుడు అది చూచిన వాల్మీకిలో క్రౌంచపక్షి యెడల సహానుభూతీ, కిరాతుని యెడల క్రోధమూ పెల్లుబికి శ్లోకరూపం ధరించాయ్. పక్షివధను చూచి తల్లడిల్లే సత్కవి కవితలో ప్రవహింపక ఏం చేస్తాడు!
అధర్మాన్నెదిరించటానికి, బహుజన హిత బహుజన సుఖాలు ఘటించటానికి విభన్న యుగాలలో విభిన్న మార్గాలు అనుసరణీయాలైతయ్. అప్పటి భౌతిక విజ్ఞాన మనో విజ్ఞాన పరిధుల అవగాహన ననుసరించి అప్పటి మార్గం ఏర్పడుతుంది. యుగావశ్యక మార్గాన్ని ఎత్తిచూపే మహాకవి ‘దార్శనిక మహాకవి’ ఔతాడు.
నేటి పీడిత ప్రపంచ మానవులకు తరణోపాయం ‘మార్క్సిజమ్’ (మార్క్సీయ దర్శనశాస్త్రం) అనేది గణనీయ సంఖ్యాక మేధావులు అంగీకరించిన విషయం. తెలుగు కవితలో మార్క్సిస్ట్ దృక్పథాన్ని ప్రధానంగా ప్రవేశపెట్టిన మొదటివాడు మహాకవి శ్రీశ్రీ.
‘కనబడలేదా మరో ప్రపంచపు
అగ్నికిరీటపు ధగధగలు,
హోమజ్వాలల భుగభుగలు
ఎర్రబావుటా నిగనిగలు’ అని శ్రీశ్రీ వ్రాశాడు.
‘సల సల క్రాగే చమురా? కాదిది,
ఉష్ణరక్త కాసారం!’ అన్నట్లుగా రక్తాన్ని ఉరకలెత్తించే గేయవేగంతో కవిత సాగించాడు.
శ్రీశ్రీ తరువాత మార్క్సిస్ట్ దృక్పథంతో ఎందరో కవిత్వం వ్రాశారు. వీరిలో ‘శేషేంద్ర’ (గుంటూరు శేషేంద్రశర్మ) హిమధరోన్నతుడు. మహాకవి శేషేంద్ర అత్యంత కవితామయంగా, ప్రతిభావంతంగా, ధ్వనియుతంగా మార్క్సిస్ట్ దృక్పథంతో వ్రాశాడు.
‘కులగోత్రమ్ములు లేవు మాకు, ధనిక క్రూరక్రియా పీడిత
జ్వలిత ప్రాణిచమూసమూహ మొకటే సత్యంబు, ఉహాభుజా
ర్గళముల్ విప్పిన విశ్వమూర్తియయి శంఖారవముం జేయుడో
దళితశ్రామిక జీవులారా! భువనద్వారంబు ఖేదిల్లగన్’
‘ప్రపంచ కార్మికులారా! ఏకం కండి!’ అనేదాన్ని ఇంత కవితామయం చేసిన రచన మరొకటి లేదు.
‘నా గీతి నిశ్శబ్దాల కుట్ర
అశ్రువుల తిరుగుబాటు
అవమానితుల భాషాసమితి,
ఒకనాడు నా ఛాతిలో ఉన్న కోళ్ళన్నీ అరుస్తాయి,
విప్తవాలన్నీ ఉదయిస్తాయి–’
‘మరణించే లోపుగా తన మాట చెప్పలేని
నిస్సహాయ మానవుడి గొంతు పేరే కవి’
కవి పీడిత జన పక్షపాతి అనీ, విప్తవ సూర్యోదయానికి ఉదయసంధ్యా పూర్వదశ అనీ అంటున్నాడు శేషేంద్ర.
‘ఎన్నాళ్ళో పెంచి పోగుచేసిన వాళ్ళు
ఎండల తలపాగాలతో వెళ్ళి పోతుంటే
మిలియన్ల గొంతులెత్తి ఏడుస్తున్నవి
ధాన్యపు రాసులు’
పీడననూ దోపిడినీ వర్ణిస్తున్నాడు శేషేంద్ర.
‘... వ్యథితానేక మనుష్య బాష్పజలముల్ వారాశిౖయె పొంగుచో
నుదయించున్ సముదగ్ర విప్తవము తానుచ్చైశ్రవంబో యనన్’
క్షీరాబ్ధి మథనవేళ ‘ఉచ్చైశ్రవం’ అనే అశ్వం ఉద్భవించినట్లు పీడితజన దుఃఖాశ్రు సముద్రం నుండి విప్లవం ఉదయిస్తుంది.
‘రైతు నాగలి మోస్తున్నాడు/ క్రైస్తు శిలువ మోసినట్లు’
అతని వృత్తియే అతనికి శిక్ష (దండన) ఐనంతగా దేశంలో రైతుకు అన్యాయం ఘటిల్లుతోంది.
‘అతడి పోరు పాడిన పాటలు / ప్రవహించే నదులు ఆగి ఆలకించేవి / చావులేని వాడ్ని చంపే మూర్ఖులకు తెలీదు/ ఏ మృత్తిక పువ్వును మనిషికి కానుకగా ఇస్తుందో/ అది వాడి నిర్మాణంలో ఉందని’. గద్దర్‌పై హత్యాయత్నం జ్ఞప్తికి రావటం లేదా?
శేషేంద్ర మార్క్సిజమ్ ఎడల గొప్ప గౌరవం కలవాడు. మార్క్స్‌కు ఈ శతాబ్దమంతా రుణపడి ఉన్నదంటాడు. కమ్యూనిజం తనలో పలికే ఏక్తారా అంటాడు.
‘ఇచట చరాచరమ్ములుదయింపకమున్ను, విదూర తారకల్
విచికిలకాంతులన్ గగనవీధుల దోచకమున్ను విశ్వ సం
కుచిత నిశీథిలో తిమిరకోణములో గల ఆది తేజమీ
రుచిర తనూలతల్ దొడిగె లోకపురోపరిణామ ధోరణిన్’
అన్నప్పుడు శేషేంద్రలో ఆధ్యాత్మికతా వాసన గోచరించింది. ‘దీనిని మార్క్సిజమ్‌తో సమన్వయించటం ఎలా?’ అనే సంశయం కలిగింది. పెన్నా శివరామకృష్ణ 1985 ఏప్రిల్‌లో ఇంటర్వ్యూ చేసినప్పుడు శేషేంద్ర చెప్పిన ఒక జవాబుతో ఈ విషయంపై కాంతి ప్రసరించింది.
‘మార్క్సు తొలుత ప్రతిపాదించిన ఆర్థిక సిద్ధాంతం రష్యా విప్లవం నాటికి మార్పు పొందింది. ఆ తర్వాత చైనా విప్లవంతో మరింత మార్పు పొందింది. విశేషతః చైనాలో మావ్–సే–తుంగ్ కమ్యూనిజాన్ని చైనీకరించాలి అనే గట్టి నినాదం స్వీకరించాడు. అలాగే మన దేశచరిత్రకు, మన సంస్కృతికి, మన ప్రజల పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మార్క్సిజాన్ని సవరించాలి’.
డయలెక్టికల్ మెటీరియలిజం, సైంటిఫిక్ సోషలిజం అనే రెండు పాదాల మీద మార్క్సిజమ్ నిలబడుతుంది. మొదటిది మెటీరియలిజం అనే జడపరిణామ సిద్ధాంతం. రెండవది మానవ సమాజం ప్యూడలిజం, కేపిటలిజం, కమ్యూనిజం అనే దశల్లోకి అంచెలవారీగా పరిణమిస్తూ చేరుతుంది అనే భావం. మన దేశానికి అనుగుణంగా సూచించిన మార్పు ఏమిటంటే– కమ్యూనిస్టు సమాజ స్థాపన కోసం ఏ చర్యాబద్ధ కార్యక్రమాన్నయితే చేపట్టాలో దాన్నిమాత్రం స్వీకరించి, మెటీరియలిజంను నిర్బంధ అంశం చెయ్యకుండా వ్యక్తి ఇష్టాధీనంగా విడిచెయ్యాలి. అంటే– కమ్యూనిస్టు సమాజ స్థాపనకు కావలసిన చర్యాబద్ధ కార్యక్రమమే నిర్బంధము. భారతదేశంలో మార్క్సిజమ్ బహుళ జనామోదం పొందటానికి ఈ మార్పు అవసరమూ, సముచితమూ అనిపిస్తోంది. ఈ విషయంలో మార్క్సిస్ట్ మేధావులలో శేషేంద్ర ఏకాకి కాడు.
రావిశాస్త్రి విరసం సభ్యత్వానికి రాజీనామా చేయటానికి – అతని విశ్వాసాలు కొన్ని డయలెక్టికల్ మెటీరియలిజంకు విరుద్ధం కావటం కూడా ఒక కారణమని మిత్రుల వలన విన్నాను. ఐనా రావిశాస్త్రి ‘సైంటిఫిక్ సోషలిజం’కు నిబద్ధుడు, విఖ్యాత ప్రజారచయిత. (రావిశాస్త్రి ఈ సందర్భంలో తన భావానికి దార్శనిక వివరణ నివ్వలేదు.)
శేషేంద్ర దార్శనిక దృష్టిని మరొక కోణం నుండి కూడా చూడాల్సి ఉంది. ఎట్టి త్యాగాలు చేసి సంపాదించిన ఎంతటి మహత్తర శుభపరిణామమైనా శాశ్వతంగా నిలువదు. అది ఎలాగో క్రమక్రమంగా క్షీణిస్తుంది. మళ్ళీ త్యాగాలు చేసి మరొక సత్పరిణామాన్ని సా«ధించు కోవలసిందే.
‘స్వర్ణంలాంటి రక్తంతో కూడా
స్వప్నాలు శాశ్వత వాస్తవాలుగా మారలేదు
మూర్ఖులే గ్రహించలేరు
పరిణామం కూడా పరిణామగ్రస్తం అని’
ఇక్కడ ‘వాస్తవాలుగా’ అనక, ‘శాశ్వత వాస్తవాలుగా’ అనటం గమనించదగింది.
‘జీవితమనే పద్మపత్రం మీద ఉన్న చంచలమైన జలబిందువు జ్ఞానం. అది శాశ్వతం కాదు, పరిణామగ్రస్తం. భూగోళం మీద అంకురించిన మానవ జన్మలో సహజంగా ఉన్న దోషాలూ, సృష్టి సిద్ధమైన హద్దులూ ఉన్నాయి. అవి మానవాతీతమైనవి. మానవుడు ఆర్జించే జ్ఞానం మీద వాటి శాసనం ఉంటుంది. కనుకనే యుగయుగాన పూర్వపూజిత సిద్ధాంతం అనంతరం పూజిత సిద్ధాంతం చేత త్రోసివేయ బడుతుంది. ఇలా ఒక యాతాయాత సిద్ధాంత పరంపరా వలయం మానవేతిహాసంలో నిరంతర భ్రమణం చేస్తూ ఉంటుంది. వాస్తవంగా ఈ జీవన సంగ్రామాన్ని ఎదుర్కొనే శక్తి మనిషికి కావాలి.
జీవన సంగ్రామాన్ని ఎదుర్కొనే శక్తినిచ్చే గ్రంథమే మానవ తరుణోపాయ «ధర్మకమైన జ్యోతి’.
ఈ మహత్తర దార్శనికతా భరితమైన కవిత కాబట్టే శేషేంద్రది మహత్తర కవిత. నవదార్శనిక మహాకవి శేషేంద్ర.
(రేపు శేషేంద్ర 10వ వర్ధంతి సందర్భంగా త్యాగరాయ గానసభలో సాయంత్రం 6 గంటలకు సాహిత్య సదస్సు జరగనుంది.)
గింజల నరసింహారెడ్డి
9490260573