వేధింపుల కేసులో యువకుడికి జైలు శిక్ష రద్దు
న్యూఢిల్లీ: యువతిని వేధించాడనే ఆరోపణలపై ట్రయల్ కోర్టు విధించిన ఒక సంవత్సరం జైలు శిక్ష నుంచి యువకునికి విముక్తి కలిగిస్తూ సెషన్స్ కోర్టు గురువారం తీర్పు ఇచ్చింది. నిందితుడిపై వచ్చిన ఆరోపణలకు సరైన ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది, అతనిపై చేసిన ఆరోపణల్లో వాస్తవికతను కోర్టు సందేహించింది. ఆరోపణలు చేస్తున్న యువతి, విచారణాధికారులు వాస్తవాన్ని మరుగుపరిచేందుకు ప్రయత్నించినట్లు కోర్టు గుర్తించిందని న్యాయమూర్తి తెలిపారు. ఈ మేరకు జహంగిర్ పురి నివాసి అనిల్ కుమార్ను శిక్ష నుంచి తప్పిస్తూ సెషన్స్ కోర్ట్ జడ్జి మనురాయ్ సేథీ తీర్పునిచ్చారు. ఫిర్యాదు చేసిన యువతి ఆరోపణలలో వైరుధ్యాలున్నాయని, దీంతో ఆరోపణల్లో వాస్తవికతపై సందేహం కలుగుతున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. ఈ కేసులో నమోదు చేసిన ప్రాసిక్యూషన్ సాక్ష్యాలతోపాటు ప్రాసిక్యూషన్ కథనాలు కూడా సందేహాస్పదంగా ఉన్నాయని న్యాయస్థానం పేర్కొంది. బాధితురాలు ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన వాంగ్మూలానికి, వైద్య పరీక్షల నివేదికకు పొంతన లేదని కోర్టు తెలిపింది. సంశయ లాభం కింద అనిల్ శిక్షను రద్దు చేస్తున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు.