గేదెలు తెచ్చిన ముప్పు
మునగాల, న్యూస్‌లైన్ :బస్సులో హాయిగా నిద్రిస్తున్న ప్రయాణికులకు రెప్పపాటులో గేదెలు పెనుముప్పు తెచ్చిపెట్టాయి. గేదెల కాపరి నిర్లక్ష్యం ఒకరి ప్రాణాలను బలిగొనగా, మరో ఏడుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. మునగాల మండలం తాడువాయి స్టేజిసమీపంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన గరుడ బస్సు ప్రమాదానికి గేదెలే కారణమని తేలింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ డిపోకు చెందిన గరుడ బస్సు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి సోమవారం అర్ధరాత్రి 12గంటలకు 47 మంది ప్రయాణికులతో విజయవాడకు బయలుదేరింది. మార్గమధ్యలో మండలంలోని తాడువాయి స్టేజీ వద్దకు రాగానే వీరి ముందు ఉన్న లారీ గేదెలను తప్పించుకుని ముందుకు వెళ్లింది. అయితే ఆ వెనకే ఉన్న గరుడబస్సు ఎదురుగా ఒక్కసారిగా గేదెలు రావడంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో అదుపుతప్పి బోల్తాకొట్టింది.
ఏడుపులు.. పెడబొబ్బలు
తెల్లవారుజామున 3.30 గంటలకు గరుడబస్సులో గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులు అనుకోని ప్రమాదానికి ఒక్కసారిగా హతాశులయ్యారు. ఏంజరిగిందో తెలుసుకునే లోపే బస్సులో పెడబొబ్బలు, ఏడుపులు వినిపించాయి. ప్రమాదం జరిగినట్లు గుర్తించిన పలువురు ప్రయాణికులు బస్సు ముందు వెనుక ఉన్న అద్దాలను పగులగొట్టుకొని ఒక్కొక్కరుగా బయటకు వచ్చారు. అప్పటికే అందులో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, మరో ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి. మిగిలిన వారు సురక్షితంగా బయటపడ్డారు.
గుర్తింపుకార్డు చూపిస్తూ..
బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి తన గుర్తింపు కార్డును చూపిస్తూ వచ్చిపోయే వాహనాలను ఆపసాగాడు. కొద్ది సేపటికి ఓ కారు యజమాని తన వాహనాన్ని ఆపడంతో తన పేరు హరిప్రసాద్ అని, విజయవాడ రీజియన్‌లో కమ్యూనికేషన్ విభాగంలో ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నానని పేర్కొన్నాడు. తనను ఆస్పత్రికి తీసుకువెళ్లాలని ప్రాదేయపడ్డాడు. వెంటనే కారు యజమాని అతడిని 17 కి.మీ దూరంలో ఉన్న కోదాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాడు. అప్పటి వరకు మాట్లాడిన హరిప్రసాద్ అరగంటలోపే చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడు నంద్యాల హరిప్రసాద్(57)ది స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా ఆకివీడు మండలం కుప్పన పాడు గ్రామం. ఈయనకు భార్య కూతురు, కుమారుడు ఉన్నాడు.
గాయపడింది వీరే..
బస్సు బోల్తా ప్రమాదంలో హైదరాబద్‌కు చెందిన మెడక వెంకటేశ్వర్లు, సిరిపూరి ఫృథ్వీవర్మ, వడెపర్తి హేమంతకుమార్,డి.శేషుకుమారి, విజయవాడకు చెందిన కొత్తూరి గాయత్రిదేవి, కొత్తూరి రాజగోపాల్, అడ్డేపల్లి సాయిదాసు ఉన్నారు. కాగా బస్సు ైడ్రైవర్ బాబురావు, క్లీనర్‌కు గాయాలు కాలేదు. క్షతగాత్రులను 108, 1033హైవే అంబులెన్స్ వాహనాలలో కోదాడలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. జాతీయ రహదారిపై విజయవాడ వైపు వెళ్లే ఓ కారు యజమాని తుంగ బుచ్చిబాబు పోలీసులకు ఫిర్యాదు చేశా డు. ఈ మేరకు మునగాల ఏఎస్ఐ ఎంఏ.గఫూర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హరిప్రసాద్ మృతదేహానికి కోదా డ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఇదిలా ఉండగా బస్సు ప్రమాదంలో రెండు గేదెలు కూడా మృతిచెందాయి. వాటి యజమాని ఆచూకీ లభ్యం కాలేదు.
సంఘటన స్థలాన్ని సందర్శించిన ఎస్పీ
మునగాల వద్ద ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న ఎస్పీ ప్రభాకర్‌రావు హుటాహుటీన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును బస్సుడ్రైవర్‌ను అడిగి తెలుసుకున్నారు. జాతీయ రహదారిపై గేదెలు తిరగకుండా చర్యలు చేపడతామన్నారు.ఇందుకోసం స్థానిక పోలీసులు, జీఎమ్మార్సంస్థ ప్రతినిధుల తో చర్చించనున్నట్లు తెలిపారు. తరచు జాతీయ రహదారిపై గేదెలు సంచరిస్తుండడంతో ప్రమాదాల సంఖ్య పెరుగుతోందని ఆయన ఆవేదనవ్యక్తం చేశారు. ఆయన వెంట సూర్యాపేట డీఎస్పీ శ్రావణ్‌కుమార్, కోదాడ రూరల్, టౌన్, సూర్యాపేట రూరల్ సీఐ లు వై.మొగిలయ్య, శ్రీధర్‌రెడ్డి, శ్రీనివాసులు ఉన్నారు.