అవినీతి నేతలు రాజీనామా చేయాలి
ఏడు వామపక్ష పార్టీల ర్యాలీలో నేతల డిమాండ్
సాక్షి, హైదరాబాద్: అవినీతిలో కూరుకుపోయిన కేంద్రమంత్రులు సుష్మాస్వరాజ్, స్మృతీఇరానీ, బీజేపీ సీఎంలు శివరాజ్‌చౌహాన్, వసుంధరరాజే పదవులకు రాజీనామా చేయాలని ఏడు వామ పక్షాలు డిమాండ్చే శాయి. సోమవారం సుందరయ్యపార్కు నుంచి ఇందిరాపార్కు వరకు ర్యాలీని నిర్వహించాయి. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలిస్తూ ఊరేగింపు సాగింది. ఈ సందర్భంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సుష్మా,సృ్మతీ, శివరాజ్, వసుంధరల మాస్కులను ధరించి వామపక్షాల కార్యకర్తలు నిరసన తెలుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీపీఐనేత కె.నారాయణ మాట్లాడుతూ అవినీతిని నిర్మూలిస్తామని సామాన్యులకు మంచిరోజులు వస్తాయన్న వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఏడాదికిపైగా జరిపిన పాలన అవినీతికి చట్టబద్ధను కల్పించేదిగా ఉందని ధ్మజమెత్తారు. మధ్యప్రదేశ్‌లో ‘వ్యాపం’ కుంభకోణం, మహారాష్ట్రలో వెలుగుచూస్తున్న అవినీతిలో బీజేపీ నాయకుల హస్తం ఉందన్నారు. కేంద్రమంత్రుల అవినీతి బయటపడినా ప్రధాని వారిని కేబినెట్‌లోంచి ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు.
ఇప్పటికైనా వారితో రాజీనామా చేయించాలి లేదా అవినీతితో సంబంధమున్న వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీపీఎం నేత డీజీనరసింహారావు మాట్లాడుతూ దేశవిదేశాలతో ముడిపడిన అవినీతి కార్యక్రమాలతో కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు, పార్టీ నాయకులకు సంబంధాలున్నా దీనిపై బీజేపీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
ఆర్ఎస్పీ నేత జానకిరాములు మాట్లాడుతూ మిత్రపక్షమైన బీజేపీ ప్రభుత్వంలో అవినీతి భాగోతాలపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించాలని డిమాండ్‌చేశారు. ఎస్‌యూసీఐ నేత శ్రీధర్ ప్రసంగిస్తూ మంత్రులు, పార్టీనాయకులు అవినీతిలో మునిగినా వారిపై చర్య తీసుకోకుండా కాపాడే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని విమర్శించారు.