ఏడు రోజుల నష్టాలకు బ్రేక్
- సెన్సెక్స్ 600 పాయింట్ల శ్రేణిలో హెచ్చుతగ్గులు
- చివరకు లాభం 128 పాయింట్లు
- 8,550 దాటిన నిఫ్టీ
మార్కెట్ అప్డేట్
ఏడు ట్రేడింగ్ సెషన్ల నష్టాల నుంచి స్టాక్ మార్కెట్లు మంగళవారం కోలుకున్నాయి. ఎగ్జిట్ పోల్స్ రూపంలో ఢిల్లీలో బీజేపీ పరాజయాన్ని ఇప్పటికే మార్కెట్లు డిస్కౌంట్ చేసుకోవడంతో మార్కెట్లు పెరిగాయని ట్రేడర్లు పేర్కొన్నారు. మంగళవారం ఆద్యంతం స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల మధ్య కదలాడాయి. బ్యాంక్, లోహ షేర్ల కారణంగా స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ ఒక దశలో 400 పాయింట్లపైనే ఎగసింది. 28,122 పాయింట్ల వద్ద మొదలైన సెన్సెక్స్ 28,634- 28,044 పాయింట్ల గరిష్ట- కనిష్ట స్థాయిల మధ్య కదలాడి చివరకు 128 పాయింట్ల లాభంతో 28,356 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 39 పాయింట్ల లాభంతో 8,565 పాయింట్ల వద్ద ముగిసింది. గ్రీక్ రుణ సంప్రదింపులు, ఉక్రెయిన్‌లో ఉద్రిక్తతలు, చైనా ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా ప్రభావం చూపాయని ట్రేడర్లంటున్నారు. గత ఏడు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 1,454 పాయింట్లు (4.9 శాతం) నష్టపోయింది.
ఇక బడ్జెట్‌పై దృష్టి : జీడీపీ గణాంకాలతో మార్కెట్లు ముందుక దూసుకుపోయాయని, కానీ ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ విజయం కారణం గా కుదేలయ్యాయని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మా ంగ్లిక్ చెప్పారు. స్టాక్ మార్కెట్ల తదుపరి దృష్టి బడ్జెట్‌పైననే అని అంబిట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ సీఈఓ హొలండ్ పేర్కొన్నారు.
బ్యాంక్ షేర్ల జోరు : కొత్త గణాంకాల కారణంగా జీడీపీ 7 శాతానికి పైగా వృద్ధి చెందడం బ్యాంక్ షేర్లు పెరగడానికి కారణమైంది. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర బ్యాంక్ షేర్ ధరలు పెరిగాయి.