షాగౌస్‌లో అగ్ని ప్రమాదం
గచ్చిబౌలి: కొత్తగూడలోని షాగౌస్ హోటల్లో గ్యాస్ లీకై మంటలు అంటుకోవడంతో జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ వృద్ధురాలు మృతి చెందగా తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. కిచెన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం సంభవించింది. గచ్చిబౌలి సీఐ ఆర్.శ్రీనివాస్ తెలిపిన మేరకు..కొత్తగూడలోని షాగౌస్ హోటల్లో శుక్రవారం మధ్యాహ్నం 12.55 గంటలకు గ్యాస్ సిలిండర్ లీక్ కావడంతో కిచెన్‌లో మంటలు చెలరేగాయి. మంటల తాకిడి పెరగడంతో కిచెన్‌లో పని చేస్తున్న 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మాదాపూర్ అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో గంటసేపు శ్రమించి మంటలు ఆర్పారు. గాయపడిన క్షత గాత్రులను పక్కనే ఉన్న అపోలో ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేసి కొండాపూర్‌లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారందరినీ అక్కడి నుంచి చాంద్రాయణగుట్టలోని అపోలో డీఆర్డీఓ ఆస్పత్రికి తరలించారు. మహారాష్ట్ర ఈద్గిర్‌కు చెందిన శాంతా బాయి (50) చికిత్సపొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందింది.
భయానక పరిస్థితి
షాగౌస్ హోటల్ నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగ మంటలు రావడం, బాధితుల ఆర్తనాదాలు వినిపించడంతో స్థానికులు హోటల్లోకి వెళ్లేందుకు యత్నించారు. మంటలు ఎక్కువగా ఉండటం, పొగ కమ్ముకోవడంతో ఎవరు లోపలికి వెళ్లే సహసం చేయలేదు. పోలీసులు వచ్చి సహాయక చర్యల్లో భాగంగా తలుపు, కిటికీలు, అద్దాలు పగులగొట్టారు. అనంతరం బాధితులను బయటకు తీశారు. హోటల్ నుంచి హెచ్‌పీ, ఇండేన్ గ్యాస్ (19.5) కేజీల సిలిండర్లు 26 స్వాధీనం చేసుకున్నారు. మరో అరగంట తరువాత హోటల్‌కు వినియోగదారులు వచ్చేవారు.
గాయపడిన వారు వీరే...
మహారాష్ట్ర ఈద్గిర్‌కు చెందిన శాంతా బాయి(50), ఆమె కుమారుడు రాజు(31)లు హఫీజ్‌పేట్‌లో నివాసం ఉంటూ షాగౌస్ హోటల్లో పాచిపనులు చేస్తున్నారు. శాంతాబాయికి 90 శాతం గాయాలయ్యాయి. రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలతోనే త ల్లిని హోటల్ గుమ్మం వరకు తీసుకొచ్చాడని సా ్థనికులు చెబుతున్నారు. హోటల్లో పనిచేసే ఒ డిషా కు చెందిన నిహజ్ అహ్మద్(38), ఎస్.కె.సయిఫుల్లా(30), ఎస్.కె.మనీర్(21), హజారుద్దీన్ ఖా న్(19), ఎస్.కె.హఫియుల్లా(25), జార్ఖండ్‌కు చెందిన మోనిస్(25), బీహర్‌కు చెందిన సయిపుల్లా(23), శామీర్‌పేట్‌కు చెందిన ఎస్.కె.తస్లీమ్(30)లకు 20 నుంచి 30 శాతం గాయాలయ్యాయి.
హోటల్ సీజ్
శేరిలింగంపల్లి సర్కిల్ –20 ఏఎంహెచ్ఓ బిందు భార్గవి హోటల్‌ను పరిశీలించి సీజ్ చేశారు.హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు. ఘటన స్థలాన్ని పరిశీలించి హోటల్‌ను సీజ్ చేశారు.
శభాష్ కుమార్...
ఉబెర్ ఈట్స్‌లో డెలివరీ బాయ్‌గా పని చేసే కుమార్ షాగౌస్ హోటల్లో ప్రమాదం జరిగిందని తెలుసుకొని వెళ్లాడు. క్షతగాత్రులను బయటకు తీసుకొచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. కాని కుమార్ నేనున్నా అంటూ హోటల్లోకి వెళ్లి బాధితులను అంబులెన్స్ ఎక్కించాడు.