తనిఖీ చేస్తున్న జీహెచ్‌ఎంసీ అధికారులు
రాయదుర్గం: ఆహారాన్ని కల్తీ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఆరోపణలు రావడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు మంగళవారం హోటళ్లలో తనిఖీలు నిర్వహించారు. రాయదుర్గం ఠాణాకు సమీపంలో ఉండే షాగౌస్ హోటల్ నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. వివరాలు ఇలా ఉన్నా యి. సోషల్ మీడియాలో ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారులు తనిఖీలకు ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ మూర్తిరాజు, వెస్ట్‌జోన్ వెటర్నీ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ వకీల్, సర్కిల్–11 ఏఎం హెచ్‌ఓ డాక్టర్ రవికుమార్, డాక్టర్ రంజిత్ హోటల్‌కు చేరుకుని ఆహార పదార్థాలను పరిశీలించారు. శాంపిల్స్‌ను సేకరించి నాచారంలోని స్టేట్ ఫుడ్ లేబరేటరీకి పంపించారు.
అనంతరం హోటల్ యజమానులకు నోటీసులు జారీ చేశారు. కాగా, తాము 25 ఏళ్లుగా హోటల్ బిజినెస్‌లో ఉన్నామని, 15 సార్లు ఉత్తమ హోటల్ అవార్డులను స్వీకరించామని హోటల్ యజమాని రబ్బానీ విలేకరులతో పేర్కొన్నారు. తమ ఎదుగుదలను చూసి ఓర్వలేనివారు సృష్టించిన ఈ వదంతులను నమ్మవద్దని కోరారు. తమ హోటల్‌పై తప్పుడు వార్తలు ప్రసారం చేసిన ప్రసార మాధ్యమాలపై సైబర్ క్రైం విభాగంలోనూ, రాయదుర్గం ఠాణాలోనూ ఫిర్యాదు చేశామన్నారు. నగరంలోని పలు హోటళ్ల యజమానులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.
కాగా, జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నడిచే కబేళాల నుంచి మాత్రమే మాంసాన్ని కొనుగోలు చేయాలని షాగౌస్ హోటల్ నిర్వామకులను వెటర్నిటీ సెక్షన్ అధికారులు ఆదేశించారు. ఈ మేరకు మరో నోటీసు కూడా జారీ చేశారు. అంతేకాకుండా గ్రేటర్ పరిధిలోని అన్ని హోటళ్లకు ఇలాంటి నోటీసులే జారీ చేస్తామని తెలిపారు. మాంసం కొనుగోళ్లకు సంబంధించి జీహెచ్ ఎంసీ అధికారులు జారీ చేసిన నోటీసు ఇదే...