కడుపులో కల్తీ! | Adultry Food Supplying Hotels in Kurnool | Sakshi
Sakshi News home page

కడుపులో కల్తీ!

Published Tue, Apr 16 2019 1:35 PM | Last Updated on Tue, Apr 16 2019 1:35 PM

Adultry Food Supplying Hotels in Kurnool - Sakshi

కర్నూలు(హాస్పిటల్‌): వ్యాపారులకు డబ్బు సంపాదనే ప్రదానం.   ప్రభుత్వ నిబంధనలు వారికి తెలియవు. తెలిసినా పట్టించుకోరు. ఇలా చేయడం తప్పు అని చెప్పాల్సిన అధికారులు నాలుగు డబ్బులు చేతిలో పడేసరికి చూడనట్లు వెళ్లిపోతారు. ఫలితంగా ప్రజారోగ్యం గుల్ల అవుతోంది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు తీసుకునే ఆహారం సర్వం కల్తీమయమై  కడుపు  రోగాల పుట్టగా మారుతోంది.
ఆహారానికి సంబంధించిన అన్ని వ్యాపారాలకు ఆహార పరిరక్షణ, నాణ్యత ప్రమాణాల సంస్థ లైసెన్స్‌ మంజూరు చేయాలి. ఈ శాఖ సూచించే నియమ నిబంధనలను వ్యాపారులు తు.చ తప్పకుండా పాటించాలి. అలా పాటించని వ్యాపారులపై కేసులు పెట్టాలి. ఆహారాన్ని శ్యాంపిల్‌గా తీసి ల్యాబ్‌కు పంపించి, అందులో ఆహారం కల్తీ అయినట్లు తేలితే జైలుకు పంపించాలి. ఇవేవీ చేయకుండా సంబంధిత శాఖ జిల్లాలో మొద్దు నిద్రపోతోంది. ఈ శాఖలో కేవలం ముగ్గురు గజిటెడ్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టరు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కో డివిజన్‌ పర్యవేక్షిస్తారు. వీరికి సహాయక సిబ్బంది, నాల్గవ తరగతి సిబ్బంది లేరు.  పనిభారం మోయలేక కొందరు సొంతంగా జీతం ఇచ్చుకుని ప్రైవేటు వ్యక్తులతో పనులు చేయించుకుంటుంటే మరి కొందరు అధికారులు మామూళ్లకు తెగబడుతున్నారు. లైసెన్స్‌లు మంజూరు చేయడం దగ్గర నుంచి శ్యాంపిల్స్‌ తీసే విషయం వరకు మామూళ్లు దండుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి.

నిబంధనలకు తూట్లు పొడుస్తున్న బిర్యానీ సెంటర్లు
హోటళ్లు, బిర్యానీ సెంటర్లు ఏర్పాటు చేయాలంటే ఫుడ్‌ సేఫ్టీ స్టాండర్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లైసెన్స్‌ తప్పనిసరిగా తీసుకోవాలి. లైసెన్స్‌ లేకపోతే తనిఖీల్లో దొరికినప్పుడు సెక్షన్‌ 63 ప్రకారం ఫుడ్‌ సేఫ్టీ కమిషన్‌ ద్వారా క్రిమినల్‌ కేసులు ఫైల్‌ చేస్తారు. నేరం రుజువైతే 6 నెలల జైలు శిక్షతో పాటు రూ.5లక్షల జరిమానా విధిస్తారు.   
ఆహార పదార్థాల్లో ప్రకృతి సిద్ధమైన రంగులే వాడాలి.
ఆహార పదార్థాల తయారీకి టేస్టింగ్‌ సాల్ట్‌ (చైనా సాల్ట్‌) వాడకూడదు. రోజువారీ వాడే ఉప్పునే వాడాలి. కానీ ఈ నిబంధనలను బిర్యానీ సెంటర్ల వారు పాటించడం లేదనే విమర్శలున్నాయి.

ప్రజల ఆరోగ్యంతో చెలగాటం
అన్ని రకాల హోటళ్లలో లోపలి భాగం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి. డ్రైనేజి వసతి బాగుండాలి. వంట వండే వ్యక్తి, వడ్డించే వ్యక్తులకు సంబంధిత హోటల్‌ యజమాని డాక్టర్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరిగా తీసుకోవాలి. ఇవి చాలా చోట్ల అమలు కావడం లేదు.   పెద్ద హోటళ్లు, కొన్ని రెస్టారెంట్లు మినహా మిగతా వాటిల్లో పరిశుభ్రత పాటించడం లేదు. భోజనం, టిఫిన్ల తయారీకి నాసిరకం సరుకులు, కూరగాయలు వాడుతున్నారు.  మిగిలిన ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో ఉంచి మరుసటి రోజు విక్రయిస్తున్నారు. మాంసం సైతం ఇదే విధంగా ఫ్రిజ్‌లో ఉంచి వండుతున్నారు. ఈ విషయం మున్సిపల్‌ అధికారులు, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు పలుమార్లు నిర్వహించిన దాడుల్లో బహిర్గతమైంది. అధిక శాతం  రోడ్డుసైడ్‌ వ్యాపారాలు మురుగుకాలువలు, చెత్పకుప్పల పక్కనే నిర్వహిస్తున్నా అడిగే నాథుడు కరువయ్యారు.  

జిల్లాలో 6వేలకు పైగా హోటళ్లు, దుకాణాలు
జిల్లాలో చిన్నా పెద్దా హోటళ్లు, రెస్టారెంట్లు, డాబాలు, చాట్, నూడుల్స్‌  షాపులు అన్ని కలుపుకుని 6 వేలకు పైగా ఉన్నాయి. ఒక్క కర్నూలు నగరంలోనే 1500 దాకా ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతోంది. ఈ వ్యాపార సంస్థల ద్వారా అధికారులు ఏడాదికి 350 శ్యాంపిల్స్‌ సేకరించాలి. అయితే,  నెలలో కేవలం 30 నుంచి 40 శ్యాంపిల్స్‌ తీసి చేతులు దులుపుకుంటున్నారు. ఒకవేళ తీసినా ల్యాబ్‌కు వెళ్లేలోగా ఆహారం కుళ్లిపోతోంది. ఫలితంగా ల్యాబోరేటరి పరీక్షల్లో కల్తీ గురించి సరైన నివేదికలు రావడం లేదన్న విమర్శలు ఉన్నాయి. జిల్లాలో ప్రస్తుతం నడుస్తున్న చిన్న మధ్యతరగతి హోటళ్లల్లో 20 శాతానికి మించి అనుమతులు లేవన్నది బహిరంగ రహస్యం.

ఆహారంలో కల్తీ ..ఇబ్బందులు
పాలల్లో చిక్కదనం కోసం నాసిరకం పాలపౌడర్లు, యూరియా, పిండి, నూనె, నీళ్లు కలిపి విక్రయిస్తున్నారు.  
ఇనుప రజను, రంపపు పొట్టును టీ పొడిలో కలపడం వల్ల ఊపిరితిత్తులు పాడై పోయే ప్రమాదం ఉంది.  
జంతువుల కళేబరాల నుంచి సేకరించిన ఎముకలను బట్టీల్లో అత్యధిక ఉష్ణోగ్రతపై మరిగించి తీసిన ద్రావణాన్ని వంట నూనెల్లో కలిపి విక్రయిస్తున్నారు. దీంతో జీర్ణకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.  
ఆరోగ్యకరమైన జంతువు మాంసాన్ని 24 గంటల్లోపే వినియోగించాలి. చాలా హోటళ్లలో చనిపోయిన జంతువుల మాంసాన్ని, ఎక్కువ కాలం నిల్వ ఉంచిన మాంసాన్ని విక్రయిస్తున్నారు.  
చికెన్, మటన్‌ బిర్యానీలు, తందూరి చికెన్‌లలో కస్టమర్లను ఆకట్టుకునేందుకు  ఎక్కువగా హానికర  రంగులు వాడుతున్నారు.  
నిషేధానికి గురైన క్యాట్‌ఫిష్‌లను సైతం నగరంలోని మద్దూర్‌నగర్, పెద్దమార్కెట్‌ ప్రాంతాల్లో విక్రయిస్తున్నా అడిగే నాథుడు లేడు.  
మిరపకాయల్లో ఎరుపు రంగు రావడానికి సూడాన్‌ రంగులు వాడుతుంటారు. పసుపులో మెటానిల్‌ ఎల్లో అనే పదార్థాన్ని కలుపుతారు. వీటిని వంటలో వినియోగిస్తే క్యాన్సర్‌ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఆహారాన్ని వండే సమయంలోనూ వండిన నూనెనే మళ్లీ మళ్లీ కాచి వండుతున్నారు. దీంతో క్యాన్సర్, అల్సర్లు వచ్చే ప్రమాదముంది.
చిన్న చిన్న హోటళ్లు, కర్రీపాయింట్లలో వేడి వేడి కూరలు, పప్పు, సాంబారు వంటి ఆహార పదార్థాలు పల్చటి పాలిథిన్‌ కవర్లలో వేసి ఇస్తున్నారు. పదార్థాల వేడికి ప్లాస్టిక్‌ కరిగిపోయి తిన్న తర్వాత అనారోగ్యాన్ని కలిగిస్తాయి.
షుగర్‌ లెస్‌ స్వీట్లలో అధికంగా  సాక్రిన్‌ వాడుతుండటంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
అల్లం, వెల్లుల్లి పేస్టులలో ఆలుగడ్డ, ఉల్లిగడ్డ పేస్ట్‌ను కలుపుతున్నారు.  
అన్ని రకాల పండ్లను ఆకర్షణీయంగా కనిపించేందుకు కార్బైడ్‌తో హానికారక రంగులు, జిగురు యథేచ్ఛగా వాడుతున్నారు. దీంతో  కాలేయ సమస్యలు, కడుపునొప్పి, నిద్రలేమి, కిడ్నీ వంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement