శరవేగంగా స్వాతంత్య్ర వేడుకల ఏర్పాట్లు
సాక్షి, కర్నూలు: రాష్ట్ర విభజన తరువాత కర్నూలులో నిర్వహిస్తున్న మొదటి స్వాతంత్య్ర వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను శరవేగంగా పూర్తి చేయాలని జిల్లా అధికారులకు రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి శ్యాంబాబు ఆదేశించారు. బుధవారం ఎస్ఏపీ క్యాంపు సమావేశ భవనంలో ఆయన అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతకు ముందు అధికారులు ఎస్ఏపీ క్యాంపు మైదానాన్ని పరిశీలించి ఏర్పాట్లను పర్యవే క్షించారు.
ఈ సందర్భంగా శ్యాంబాబు మాట్లాడుతూ సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ కన్నా ఎస్ఏపీ క్యాంపస్ చిన్నదిగా ఉందని దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు. గ్రౌండ్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కర్నూలు మున్సిపల్ కమిషనర్ మూర్తిని ఆదేశించారు. వీవీఐపీలకు టాయిలెట్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సదుపాయాలన్నీ ఈ నెల 31 లోపు పూర్తి చేయాలన్నారు. స్వాతంత్య్ర వేడుకలకు విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలని ట్రాన్స్‌కో ఎస్ఈ బసవయ్యను ఆదేశించారు.
విద్యార్థులకు అవసరమైన బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఆర్ఎంకు, పెరేడ్ గ్రౌండ్లో అంబులెన్స్ ఉండాలని జిల్లా వైద్యాశాఖ అధికారికి ఆదేశించారు. వీవీఐపీలకు సంబంధించిన బ్లడ్‌గ్రూపులను అందజేస్తామని, అందుకనుగుణంగా సిద్ధంగా ఉండాలని సూచించారు. కర్నూలు నగరాన్ని సుందరంగా తీర్చుదిద్దుతున్నామని కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ రవాణాశాఖ ముఖ్యకార్యదర్శికి వివరించారు. ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు, బ్యానర్లు, లైటింగ్ సిస్టం ఏర్పాటు చేస్తున్నామని, వీవీఐపీలకు ప్రభుత్వ, ఎస్ఏపీ క్యాంపు అతిథి గృహాలు, సస్య, ఎస్వీ రెసిడెన్సీ, డీవీఆర్ హోటళ్లలో విడిది కల్పించనున్నట్లు తెలిపారు.
వివిధ శాఖల ద్వారా ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలను పవర్ పాయింట్ ద్వారా జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులకు వివరించారు. సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనరు దానకిషోర్ మాట్లాడుతూ గ్రౌండ్‌ను బట్టి శకటాలను ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి చదివే ప్రసంగ పాఠాన్ని తయారు చేస్తామని చెప్పారు. సమావేశంలో జీఏడీ ముఖ్యకార్యదర్శి రాజేశ్వరి తివారీ, డీఐజీ మురళీకృష్ణ, ఎస్పీ రఘురామిరెడ్డి, కమాండెంట్ విజయకుమార్, జేసీ కన్నబాబు, ఏజేసీ అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.