Shamshabad District
-
షాబాద్‌లో తీవ్ర ఉద్రిక్తత
షాబాద్ : రంగారెడ్డి జిల్లా షాబాద్‌ను కొత్తగా ఏర్పాటయ్యే శంషాబాద్ జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ భారీ ఎత్తున ఆందోళన కొనసాగుతోంది. శనివారం ఉదయం నుంచి ముంబై-బెంగళూరు లింక్ జాతీయరహదారిపై అఖిలపక్షాల ఆధ్వర్యంలో రాస్తారోకో జరుగుతోంది. ఆందోళన కారణంగా రెండు వైపులా 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ఎంత నచ్చజెప్పినా ఆందోళన కారులు వెనక్కి తగ్గలేదు. దీంతో సాయంత్రం 4 గంటల సమయంలో పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు అక్కడికి చేరుకున్నాయి. ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేసే అవకాశాలున్నట్లు సమాచారం. ఆందోళనలో బీసీ సంఘం రాష్ట్ర నేత కృష్ణ యాదవ్, అఖిలపక్షాల నేతలు రవీందర్‌రెడ్డి, శివకుమార్, గంగయ్య, నర్సింహగౌడ్, నారాయణ, మేకల నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. -
సెల్‌టవర్ ఎక్కిన యువకుడు
⇒ అర గంటపాటు మండల కేంద్రంలో కలకలం ⇒ పోలీసులు, అఖిలపక్షం నాయకుల జోక్యంతో కిందికి దిగిన వైనం మొయినాబాద్: మండలాన్ని శంషాబాద్ జిల్లాలో కలపాలని కోరుతూ ఓ యువకుడు ఆదివారం సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. మొయినాబాద్ మండలాన్ని శంషాబాద్ జిల్లాలో కలపుతామని ప్రభుత్వం ప్రకటించకపోతే టవర్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. అరగంటపాటు టవర్‌పైనే కూర్చొని కలకలంరేపాడు. పోలీసులు, అఖిలపక్షం నాయకుల జోక్యంతో కిందికి దిగివచ్చాడు. మొయినాబాద్‌ను శంషాబాద్‌లో కలపాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో రిలే నిరహార దీక్షలు చేపడుతున్నారు. అన్ని గ్రామాల అంబేద్కర్ యువజన సంఘాల అధ్యక్షులు, సభ్యులు దీక్షలో ఆదివారం కూర్చున్నారు. దీక్ష కొనసాగుతుండగానే మొయినాబాద్‌కు చెందిన కంజర్ల నరేష్ రోడ్డుపక్కనే ఓ భవనంపై ఉన్న సెల్ టవర్‌పైకి ఎక్కాడు. మొయినాబాద్, శంషాబాద్‌లో కలపకపోతే ఇక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటాని పెద్దగా కేకలు వేయడంతో కిందన్న జనం అతన్ని చూశారు. కిందకు దిగాలని ఎంత అరిచినా దిగలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు భవనంపైకి ఎక్కి అతన్ని కిందకి రావాలని కోరారు. అయినా రాకపోవడంతో అఖిలపక్షం నాయకులు భవనంపైకి వెళ్లి కిందకు దిగాలని కోరారు. ఉద్యమాన్ని శాంతియుతంగా చేపట్టి డిమాండ్‌ను సాధించుకోవాలని నచ్చజెప్పారు. అరగంటపాటు సెల్‌టవర్‌పైనే ఉన్న యువకుడు చివరకు పోలీసులు, అఖిలపక్షం నాయకుల జోక్యంతో కిందికి దిగాడు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం పలువురు నాయకులు, యువకులు అతనికి పూలమాలలు వేసి సన్మానించారు. మొయినాబాద్ మండలాన్ని శంషాబాద్ జిల్లాలో కలపకపోతే ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆ యువకుడు తెలిపాడు. -
మొయినాబాద్‌ను శంషాబాద్ జిల్లాలో కలపాలి
♦ ఉద్యమం తీవ్ర తరం చేసిన అఖిలపక్షం ♦ ఆదివారం అన్ని గ్రామాల్లో ర్యాలీలు, నిరసనలు ♦ గ్రామసభలు నిర్వహించి ఏకగ్రీవ తీర్మాణాలు ♦ సోమవారం మండల బంద్‌కు పిలుపు మొయినాబాద్: జిల్లాల పునర్విభజనపై నిరసన సెగలు వెల్లువెత్తున్నాయి. మొయినాబాద్ మండలాన్ని వికారాబాద్ కేంద్రంగా ఏర్పడే రంగారెడ్డి జిల్లాలో కాకుండా శంషాబాద్ జిల్లాలో జిల్లాలో కలపాలనే డిమాండ్‌తో మండల అఖిలపక్షం నాయకులు ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. ఇప్పటి వరకు వినతిపత్రాలు అందజేయడం, గ్రామాల్లో ప్రజల అభిప్రాయం తీసుకుంటూ సంతకాల సేకరణ చేపట్టిన అఖిలపక్షం ఇక ప్రత్యక్ష కార్యచరణలోకి దిగింది. అందులో భాగంగా ఆదివారం మండలంలోని అన్ని గ్రామాల్లో ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. గ్రామసభలు నిర్వహించి పంచాయతీ పాలకవర్గంతోపాటు యువజన సంఘాలు, మహిళా సంఘాలు, కుల సంఘాలు, ప్రజాసంఘాలు, ఉద్యోగసంఘాలతో ఏకగ్రీవ తీర్మాణాలు చేశారు. మండలంలోని పెద్దమంగళారం, సురంగల్, శ్రీరాంనగర్, వెంకటాపూర్, మొయినాబాద్, నాగిరెడ్డిగూడ, కుత్బుద్దీన్‌గూడ, మేడిపల్లి, చందానగర్, చిలుకూరు గ్రామాల్లో ఆదివారం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ‘వికారాబాద్ వద్దు.. శంషాబాద్ ముద్దు’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీలు నిర్వహించారు. మొయినాబాద్ మండలాన్ని పక్కనే ఉన్న శంషాబాద్ జిల్లాలో కలపకుండా వికారాబాద్‌లో కొనసాగిస్తే అన్ని విధాలుగా నష్టం జరుగుతుందని ప్రజలకు వివరించారు. నిరసన కార్యక్రమాల్లో జెడ్పీటీసీ సభ్యుడు చంద్రలింగంగౌడ్, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు కొంపల్లి అనంతరెడ్డి, సర్పంచ్‌లు గీతావనజాక్షి, గున్నాల సంగీత, సంధ్య, నవీన్, మల్లారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, రాంచంద్రయ్య, ఎంపీటీసీ సభ్యులు సహదేవ్, పెంటయ్య, గణేష్‌గౌడ్, మాధవరెడ్డి, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు మందడి వెంకట్‌రెడ్డి, నాయకులు కీసరి సంజీవరెడ్డి, కోట్ల నరోత్తంరెడ్డి, గున్నాల గోపాల్‌రెడ్డి, సిడిగిద్ద కృష్ణారెడ్డి, నర్సింహారెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, భరత్, ఈగ రవీందర్‌రెడ్డి, గడ్డం వెంకట్‌రెడ్డి, సంజీవరావు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు, ప్రజాసంఘాలు, కులసంఘాల నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. నేడు మొయినాబాద్ మండలం బంద్: అఖిలపక్షం మొయినాబాద్ మండలాన్ని శంషాబాద్ జిల్లాలో విలీనం చేయాలనే డిమాండ్‌తో సోమవారం మండలం బంద్‌కు పిలుపునిస్తున్నామని అఖిలపక్షం నాయకులు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర సాధనకోసం మొయినాబాద్ మండలానికి చెందిన ముగ్గురు ఆత్మబలిదానం చేసుకున్న విషయాన్ని ప్రభుత్వం మరువద్దన్నారు. సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొత్త నర్సింహారెడ్డి, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు షాబాద్ దర్శన్, బీజేపీ మండల అధ్యక్షుడు క్యామ పద్మనాభం, చేవెళ్ల నియోజకవర్గం కన్వీనర్ జంగారెడ్డి, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. -
షాబాద్ మండలాన్నిశంషాబాద్ జిల్లాలో కలపాలి
షాబాద్: షాబాద్ మండలాన్ని శంషాబాద్ జిల్లాలో కలిపేవరకు అఖిలపక్షం ఆధర్యంలో ఉద్యమాలు కొనసాగిస్తామని ఎ.రవీందర్‌రెడ్డి, బీసీ సేన రాష్ర్ట అధ్యక్షులు బర్క కృష్ణ యాదవ్ డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలోని ఆర్అండ్బి అథితి గృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శుక్రవారం షాబాద్ మండలాన్ని శంషాబాద్ జిల్లాలో కలిపేంత వరకు బంద్ ప్రకటిస్తామన్నారు. ధర్నాలు, రాస్తారోకోలు, రిలే నిరహార దీక్షలు, ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలను మూసివేయిస్తామన్నారు. షాబాద్ మండల ప్రాంతం శంషాబాద్ కు 30 కిలో మీటర్ల దూరంలో ఉందన్నారు. నిత్యం విద్యా, ఉద్యోగంకోసం శంషాబాద్‌కు ఎక్కువగా వెళ్తుంటారన్నారు. రైతులు ప్రతిరోజు శంషాబాద్ మార్కెట్‌కు నిత్యం కూరగాయలు, నిత్యవసర వస్తువుల కోసం వెళ్తుంటారని తెలిపారు. షాబాద్‌ను వికారాబాద్ జిల్లాల్లో కలిపితే పెద్దెత్తున ఉద్యమం చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ మంగలి శివకుమార్, కాంగ్రెస్ అధ్యక్షులు అంజనేయులుగౌడ్, బీజేపీ నాయకులు రాము, నరేందర్‌రెడ్డి, సర్పంచులు రవీందర్ నాయక్, శివకుమార్, మద్దూర్ మల్లేష్, కాంగెస్ నాయకులు తమ్మళి రవీందర్, అష్మత్ పాష, జనార్దన్‌రెడ్డి, పామెన నర్సింలు, మల్లేష్, జంగయ్య, మాణిక్యప్రభు, అఖిల పక్షం నాయకులు కర్రె శ్రీశైలం, హరిశంకర్, కిరన్, రాపోల్ నర్సింలు, మల్లేష్, శివకుమార్, తదితరులున్నారు. ప్రతాప్‌రెడ్డి, తదితరులున్నారు.