మొయినాబాద్‌ను శంషాబాద్ జిల్లాలో కలపాలి
♦ ఉద్యమం తీవ్ర తరం చేసిన అఖిలపక్షం
♦ ఆదివారం అన్ని గ్రామాల్లో ర్యాలీలు, నిరసనలు
♦ గ్రామసభలు నిర్వహించి ఏకగ్రీవ తీర్మాణాలు
♦ సోమవారం మండల బంద్‌కు పిలుపు
మొయినాబాద్: జిల్లాల పునర్విభజనపై నిరసన సెగలు వెల్లువెత్తున్నాయి. మొయినాబాద్ మండలాన్ని వికారాబాద్ కేంద్రంగా ఏర్పడే రంగారెడ్డి జిల్లాలో కాకుండా శంషాబాద్ జిల్లాలో జిల్లాలో కలపాలనే డిమాండ్‌తో మండల అఖిలపక్షం నాయకులు ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. ఇప్పటి వరకు వినతిపత్రాలు అందజేయడం, గ్రామాల్లో ప్రజల అభిప్రాయం తీసుకుంటూ సంతకాల సేకరణ చేపట్టిన అఖిలపక్షం ఇక ప్రత్యక్ష కార్యచరణలోకి దిగింది. అందులో భాగంగా ఆదివారం మండలంలోని అన్ని గ్రామాల్లో ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. గ్రామసభలు నిర్వహించి పంచాయతీ పాలకవర్గంతోపాటు యువజన సంఘాలు, మహిళా సంఘాలు, కుల సంఘాలు, ప్రజాసంఘాలు, ఉద్యోగసంఘాలతో ఏకగ్రీవ తీర్మాణాలు చేశారు. మండలంలోని పెద్దమంగళారం, సురంగల్, శ్రీరాంనగర్, వెంకటాపూర్, మొయినాబాద్, నాగిరెడ్డిగూడ, కుత్బుద్దీన్‌గూడ, మేడిపల్లి, చందానగర్, చిలుకూరు గ్రామాల్లో ఆదివారం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.
‘వికారాబాద్ వద్దు.. శంషాబాద్ ముద్దు’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీలు నిర్వహించారు. మొయినాబాద్ మండలాన్ని పక్కనే ఉన్న శంషాబాద్ జిల్లాలో కలపకుండా వికారాబాద్‌లో కొనసాగిస్తే అన్ని విధాలుగా నష్టం జరుగుతుందని ప్రజలకు వివరించారు. నిరసన కార్యక్రమాల్లో జెడ్పీటీసీ సభ్యుడు చంద్రలింగంగౌడ్, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు కొంపల్లి అనంతరెడ్డి, సర్పంచ్‌లు గీతావనజాక్షి, గున్నాల సంగీత, సంధ్య, నవీన్, మల్లారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, రాంచంద్రయ్య, ఎంపీటీసీ సభ్యులు సహదేవ్, పెంటయ్య, గణేష్‌గౌడ్, మాధవరెడ్డి, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు మందడి వెంకట్‌రెడ్డి, నాయకులు కీసరి సంజీవరెడ్డి, కోట్ల నరోత్తంరెడ్డి, గున్నాల గోపాల్‌రెడ్డి, సిడిగిద్ద కృష్ణారెడ్డి, నర్సింహారెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, భరత్, ఈగ రవీందర్‌రెడ్డి, గడ్డం వెంకట్‌రెడ్డి, సంజీవరావు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు, ప్రజాసంఘాలు, కులసంఘాల నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
నేడు మొయినాబాద్ మండలం బంద్: అఖిలపక్షం
మొయినాబాద్ మండలాన్ని శంషాబాద్ జిల్లాలో విలీనం చేయాలనే డిమాండ్‌తో సోమవారం మండలం బంద్‌కు పిలుపునిస్తున్నామని అఖిలపక్షం నాయకులు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర సాధనకోసం మొయినాబాద్ మండలానికి చెందిన ముగ్గురు ఆత్మబలిదానం చేసుకున్న విషయాన్ని ప్రభుత్వం మరువద్దన్నారు. సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొత్త నర్సింహారెడ్డి, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు షాబాద్ దర్శన్, బీజేపీ మండల అధ్యక్షుడు క్యామ పద్మనాభం, చేవెళ్ల నియోజకవర్గం కన్వీనర్ జంగారెడ్డి, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.