Shankara Building
-
ఇన్ఫ్రాటెల్ పతనం- శంకర బిల్డ్ ఖుషీ
ఇండస్ టవర్స్ విలీనంపై కొనసాగుతున్న అనిశ్చితికి మరోమారు తెరతీస్తూ.. నేడు నిర్వహించవలసిన బోర్డు సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు టెలికం మౌలిక సదుపాయాల దిగ్గజం భారతీ ఇన్ఫ్రాటెల్ తాజాగా వెల్లడించింది. మరోపక్క గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో హోమ్ ఇంప్రూవ్మెంట్ ప్రొడక్టుల కంపెనీ శంకర బిల్డ్ ప్రో కౌంటర్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఇన్ఫ్రాటెల్ షేరు నష్టాలతో కళతప్పగా.. శంకర బిల్డ్ భారీ లాభాలతో కళకళలాడుతోంది. వివరాలు చూద్దాం.. భారతీ ఇన్ఫ్రాటెల్ టెలికం మౌలిక సదుపాయాల దిగ్గజం భారతీ ఇన్ఫ్రాటెల్ నేడు నిర్వహించవలసిన సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. నేడు నిర్వహించతలపెట్టిన సమావేశంలో ఇండస్ టవర్స్ విలీనంపై బోర్డు నిర్ణయం తీసుకోనున్నట్లు తొలుత పేర్కొంది. అయితే బోర్డు తుది నిర్ణయం తీసుకునేందుకు మరికొన్ని ఇన్పుట్ల అవసరమున్నట్లు భారతీ ఇన్ఫ్రాటెల్ వివరించింది. దీంతో సమావేశాన్ని వాయిదా వేసినట్లు వెల్లడించింది. ఈ నెల 24లోగా తిరిగి బోర్డు సమావేశాన్ని చేపట్టనున్నట్లు బీఎస్ఈకి తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఇన్ఫ్రాటెల్ షేరు ఎన్ఎస్ఈలో 8 శాతం పతనమైంది. రూ. 214 వద్ద ట్రేడవుతోంది. నిజానికి ఈ నెల 4న ఇండస్ టవర్స్ విలీనంపై అనిశ్చితి కొనసాగుతున్నట్లు కంపెనీ వివరించింది. కాగా.. 2019 మార్చికల్లా ముగియవలసిన విలీన ప్రక్రియ నాలుగోసారి వాయిదా పడటం గమనార్హమని పరిశ్రమవర్గాలు వ్యాఖ్యానించాయి! శంకర బిల్డ్ ప్రొ గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించడంతో శంకర బిల్డింగ్ ప్రొడక్ట్స్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. ఎన్ఎస్ఈలో ఈ షేరు 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 61 ఎగసి రూ. 364 వద్ద ఫ్రీజయ్యింది. క్యూ4(జనవరి-మార్చి)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన శంకర బిల్డ్ ప్రొ పన్నుకు ముందు లాభం(పీబీటీ) మూడు రెట్లు ఎగసి రూ. 15 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం సైతం 74 శాతం పెరిగి రూ. 27 కోట్లను అధిగమించింది. ఇబిటా మార్జిన్లు 2.6 శాతం నుంచి 4.06 శాతానికి మెరుగయ్యాయి. ఈ కాలంలో మొత్తం ఆదాయం 12 శాతం పుంజుకుని రూ. 667 కోట్లను తాకింది. -
లిస్టింగ్ అదరగొట్టిన శంకర బిల్డింగ్
ముంబై: బెంగళూరుకు చెందిన హోమ్ ఇంప్రూవ్మెంట్, బిల్డింగ్ ప్రొడక్టుల సంస్థ శంకర బిల్డింగ్ ప్రొడక్ట్స్ బధవారం స్టాక్ ఎక్స్ఛేంజీలలో అట్టహాసంగా లిస్ట్ అయింది. ఇష్యూ ప్రైస్ తో పోలిస్తే భారీ ప్రీమియంతో రూ.555 వద్ద డెబ్యూ ఎంట్రీ ఇచ్చింది. అంచనాలకు తగ్గట్టుకుగానే 25 శాతం పైగా ప్రీమియంతో దూసుకుపోతోంది. రూ.ప్రస్తుతం 571 వద్ద పాజిటివ్‌గా ఉంది. కంపెనీ ఎండీ శ్రీ సుకుమార్ శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత నెలలో పబ్లిక్ ఇష్యూకి వచ్చిన ఈ ఐపీవో 41 రెట్లు అధికంగా సబ్స్క్రయిబ్ అయ్యింది. ఇష్యూకి ధరల శ్రేణి రూ. 440-460గా నిర్ణయించింది. ఈఐపివో ద్వారా కంపెనీ రూ. 350 కోట్లు సమీకరించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ దాదాపు 53 లక్షల షేర్లను ఆఫర్ చేయగా.. మొత్తం 22 కోట్ల షేర్లకు బిడ్స్ దాఖలయ్యాయి. క్విబ్ కోటా దాదాపు 52 రెట్లు, హెచ్ఎన్ఐల విభాగం నుంచి 91 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలుకాగా... రిటైల్ విభాగం నుంచి ఏకంగా 15 రెట్లకు పైగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. గత నెలలో లిస్టయిన ఎవెన్యూ సూపర్‌మార్ట్స్(డీమార్ట్) ఐపీవో ధరతో పోలిస్తే 110 శాతంపైగా లాభాలను పంచడంతో శంకర బిల్డింగ్ ఇష్యూకి రిటైలర్లు క్యూకట్టినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా దేశవ్యాప్తంగా 103 రిటైల్ స్టోర్లను శంకర రీటైల్ కంపెనీ నిర్వహిస్తోంది. వివిధ రాష్ట్రాలలో మొత్తం 11 ప్రాసెసింగ్ కేంద్రాలున్నాయి.