ఇండస్ టవర్స్ విలీనంపై కొనసాగుతున్న అనిశ్చితికి మరోమారు తెరతీస్తూ.. నేడు నిర్వహించవలసిన బోర్డు సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు టెలికం మౌలిక సదుపాయాల దిగ్గజం భారతీ ఇన్‌ఫ్రాటెల్ తాజాగా వెల్లడించింది. మరోపక్క గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో హోమ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రొడక్టుల కంపెనీ శంకర బిల్డ్ ప్రో కౌంటర్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఇన్‌ఫ్రాటెల్ షేరు నష్టాలతో కళతప్పగా.. శంకర బిల్డ్ భారీ లాభాలతో కళకళలాడుతోంది. వివరాలు చూద్దాం..
భారతీ ఇన్‌ఫ్రాటెల్
టెలికం మౌలిక సదుపాయాల దిగ్గజం భారతీ ఇన్‌ఫ్రాటెల్ నేడు నిర్వహించవలసిన సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. నేడు నిర్వహించతలపెట్టిన సమావేశంలో ఇండస్ టవర్స్ విలీనంపై బోర్డు నిర్ణయం తీసుకోనున్నట్లు తొలుత పేర్కొంది. అయితే బోర్డు తుది నిర్ణయం తీసుకునేందుకు మరికొన్ని ఇన్‌పుట్‌ల అవసరమున్నట్లు భారతీ ఇన్‌ఫ్రాటెల్ వివరించింది. దీంతో సమావేశాన్ని వాయిదా వేసినట్లు వెల్లడించింది. ఈ నెల 24లోగా తిరిగి బోర్డు సమావేశాన్ని చేపట్టనున్నట్లు బీఎస్‌ఈకి తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఇన్‌ఫ్రాటెల్ షేరు ఎన్‌ఎస్‌ఈలో 8 శాతం పతనమైంది. రూ. 214 వద్ద ట్రేడవుతోంది. నిజానికి ఈ నెల 4న ఇండస్ టవర్స్ విలీనంపై అనిశ్చితి కొనసాగుతున్నట్లు కంపెనీ వివరించింది. కాగా.. 2019 మార్చికల్లా ముగియవలసిన విలీన ప్రక్రియ నాలుగోసారి వాయిదా పడటం గమనార్హమని పరిశ్రమవర్గాలు వ్యాఖ్యానించాయి!
శంకర బిల్డ్ ప్రొ
గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించడంతో శంకర బిల్డింగ్ ప్రొడక్ట్స్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 61 ఎగసి రూ. 364 వద్ద ఫ్రీజయ్యింది. క్యూ4(జనవరి-మార్చి)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన శంకర బిల్డ్ ప్రొ పన్నుకు ముందు లాభం(పీబీటీ) మూడు రెట్లు ఎగసి రూ. 15 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం సైతం 74 శాతం పెరిగి రూ. 27 కోట్లను అధిగమించింది. ఇబిటా మార్జిన్లు 2.6 శాతం నుంచి 4.06 శాతానికి మెరుగయ్యాయి. ఈ కాలంలో మొత్తం ఆదాయం 12 శాతం పుంజుకుని రూ. 667 కోట్లను తాకింది.
Comments
Please login to add a commentAdd a comment