ముంబై, సాక్షి: వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు రికార్డులను బ్రేక్ చేస్తున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 460 పాయింట్లు జంప్‌చేసి 44,537ను తాకింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. నిఫ్టీ 135 పాయింట్లు ఎగసి 13,061 వద్ద ట్రేడవుతోంది. వెరసి దేశీ స్టాక్ మార్కెట్ చరిత్రలో తొలిసారి 13,000 పాయింట్ల మార్క్‌ను నిఫ్టీ అధిగమించింది. ఈ నేపథ్యంలో సానుకూల వార్తల కారణంగా మౌలిక సదుపాయాల కంపెనీ అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, టెలికం టవర్ల దిగ్గజం భారతీ ఇన్‌ఫ్రాటెల్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..
అదానీ పోర్ట్స్ అండ్ సెజ్
ట్రాన్స్‌పోర్టేషన్, రవాణా మౌలిక సదుపాయాల విభాగంలో దేశీయంగా అదానీ పోర్ట్స్ అండ్ సెజ్‌కు 14వ ర్యాంక్ లభించినట్లు డోజోన్స్ సస్టెయినబిలిటీ ఇండైసెస్(డీజేఎస్‌ఐ) తాజాగా పేర్కొంది. ఎస్‌ఏఎం కార్పొరేట్ సస్టెయినబిలిటీ ఆధారంగా డోజోన్స్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండెక్స్‌లో అదానీ పోర్ట్స్‌కు మాత్రమే చోటు దక్కినట్లు తెలియజేసింది. దీంతో డీజేఎస్‌ఐ ఆధారంగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే పలు ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలు ఇకపై అదానీ పోర్ట్స్ కౌంటర్‌పై దృష్టి పెట్టే వీలున్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అదానీ పోర్ట్స్ కౌంటర్‌కు డిమాండ్ నెలకొంది. వెరసి అదానీ పోర్ట్స్ షేరు తొలుత ఎన్‌ఎస్‌ఈలో 7 శాతంపైగా జంప్‌చేసింది. రూ. 402ను తాకింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ప్రస్తుతం 5.5 శాతం ఎగసి రూ. 396 వద్ద ట్రేడవుతోంది.
భారతీ ఇన్‌ఫ్రాటెల్
ఇండస్ టవర్స్‌తో విలీనం పూర్తి చేసుకోవడం ద్వారా భారతీ ఇన్‌ఫ్రాటెల్ అతిపెద్ద టవర్ల కంపెనీగా ఆవిర్భవించింది. ఇండస్ టవర్స్ కంపెనీ పేరుతో ఏర్పాటైన సంయుక్త సంస్థలో భారతీ ఎయిర్‌టెల్‌కు 36.7 శాతం, వొడాఫోన్ గ్రూప్‌నకు 28.12 శాతం చొప్పున వాటా లభించింది. ఈ బాటలో పీఎస్ ఏషియా హోల్డింగ్ ఇన్వెస్ట్‌మెంట్స్ మారిషస్‌కు 3.25 శాతం వాటా దక్కింది. టవర్ల రంగంలో అతిపెద్ద కంపెనీగా ఆవిర్భవించిన నేపథ్యంలో భారతీ ఇన్‌ఫ్రాటెల్ కౌంటర్‌కు డిమాండ్ కొనసాగుతోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 5.3 శాతం జంప్‌చేసి రూ. 230 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 238 వరకూ ఎగసింది. విలీనం పూర్తయిన వార్తలతో గత మూడు రోజులుగా ఈ కౌంటర్ జోరు చూపుతోంది. వెరసి 28 శాతంపైగా లాభపడింది.
Comments
Please login to add a commentAdd a comment