న్యూఢిల్లీ: ప్రపంచంలోనే రెండో అతి పెద్ద టెలికం టవర్ల సంస్థ ఏర్పాటు దిశగా భారతి ఇన్‌ఫ్రాటెల్, ఇండస్ టవర్స్ త్వరలో విలీనం కానున్నాయి. తద్వారా 14.6 బిలియన్ డాలర్ల (రూ. 96,500 కోట్లు) దిగ్గజం ఆవిర్భవించనుంది. ఏకంగా 1,63,000 టవర్లతో చైనా టవర్ సంస్థ తర్వాత ప్రపంచంలోనే రెండో అతి పెద్ద టవర్స్ సంస్థగా నిలవనుంది. విలీనానికి సంబంధించి ఇరు సంస్థలు ఒక అంగీకారానికి వచ్చాయి. విలీన సంస్థ పేరు ఇండస్ టవర్స్ లిమిటెడ్‌గా ఉంటుంది. భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్ దీన్ని సంయుక్తంగా నిర్వహిస్తాయి. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ), మార్కెట్స్ నియంత్రణ సంస్థ సెబీ తదితర నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరులోగా డీల్ పూర్తి కాగలదని అంచనా. ప్రత్యేక స్కీమ్ ప్రకారం భారతి ఇన్‌ఫ్రాటెల్‌లో ఇండస్ టవర్స్ విలీనం అవుతుందని భారతి ఎయిర్‌టెల్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇండస్ టవర్స్ ప్రస్తుతం 15 టెలికం సర్కిల్స్‌లోను, భారతి ఇన్‌ఫ్రాటెల్ మిగతా 7 సర్కిల్స్‌లోనూ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. 2017–18లో ఇరు కంపెనీల ఆదాయాలు రూ. 25,360 కోట్ల పైగా ఉన్నాయి.
వాటాల పంపకం ఇలా..
ప్రస్తుతం భారతి ఎయిర్‌టెల్‌కి భారతి ఇన్‌ఫ్రాటెల్‌లో 53.5 శాతం వాటాలున్నాయి. విలీన సంస్థలో దీనికి 33.8 నుంచి 37.2 శాతం వాటాలు దక్కే అవకాశం ఉంది. ఇండస్ టవర్‌లో వొడాఫోన్‌కి 42 శాతం వాటాలుండగా, విలీన సంస్థలో 26.7 శాతం నుంచి 29.4 శాతం దాకా వాటాలు దక్కనున్నాయి. ఇండస్ టవర్‌లో భారతి ఇన్‌ఫ్రాటెల్‌కు కూడా 42 శాతం వాటా ఉండగా, ఐడియాకి 11.15 శాతం, ప్రావిడెన్స్‌కి 4.85 శాతం వాటాలున్నాయి. విలీన సంస్థలో ఐడియా, ప్రావిడెన్స్‌లు తమ వాటాలను అట్టే పెట్టుకోవడం లేదా విక్రయించడాన్ని బట్టి ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ల వాటాలు పెరగడం లేదా తగ్గడం ఆధారపడి ఉంటుంది. విలీన కంపెనీలో కొంత వాటాలను విక్రయించేందుకు ఇన్వెస్టర్లతో చర్చించనున్నట్లు భారతి ఎయిర్‌టెల్ తెలిపింది. డీల్ ప్రకారం భారతి ఇన్‌ఫ్రాటెల్‌కి చెందిన ప్రతి 1,565 షేర్లకు ఇండస్ టవర్ షేరు ఒక్కటి చొప్పున లభిస్తుంది. విలీన సంస్థలో భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్‌కి సమాన అధికారాలుంటాయి. డీల్ పూర్తయ్యాక 11 మంది డైరెక్టర్లలో ఇరు సంస్థల నుంచి చెరి ముగ్గురు నియమితులవుతారు.
ఐడియా, ప్రావిడెన్స్‌లు వాటాలు విక్రయిస్తే..
ఒకవేళ ఐడియా తన వాటాలను పూర్తిగా, ప్రావిడెన్స్ తనకున్న 4.85 శాతం వాటాలో 3.35 శాతాన్ని విక్రయించాలనుకున్న పక్షంలో .. విలీన సంస్థలో భారతి ఎయిర్‌టెల్‌కు 37.2 శాతం, వొడాఫోన్ గ్రూప్‌నకు 29.4 శాతం, ప్రావిడెన్స్‌కి 1.1 శాతం, మిగతా వాటాలు పబ్లిక్ షేర్‌హోల్డర్ల దగ్గర ఉంటాయి. అలా కాకుండా ఐడియా, ప్రావిడెన్స్ తమ పెట్టుబడులను కొనసాగించాలనుకుంటే భారతి ఎయిర్‌టెల్‌కి 33.8 శాతం, వొడాఫోన్‌కి 26.7 శాతం వాటాలు ఉంటాయి. ఐడియా గ్రూప్‌నకు 7.1 శాతం, ప్రావిడెన్స్‌కి 3.1 శాతం, మిగతా 29.3 శాతం వాటాలు పబ్లిక్ షేర్‌హోల్డర్స్ దగ్గర ఉంటాయి.
భారతి ఇన్‌ఫ్రాటెల్‌తో ఇండస్ టవర్స్ విలీనం
Published Thu, Apr 26 2018 12:39 AM | Last Updated on Thu, Apr 26 2018 9:50 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment