ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయ్
– గొల్లపల్లి ప్రాజెక్టు వైఎస్ ఘనత
– రైతు ధర్నాలో జిల్లా అధ్యక్షులు శంకర్‌నారాయణ
పరిగి : రెండేళ్లుగా ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా ప్రకటించకుండా రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకర్‌నారాయణ అన్నారు. రైతులకు ఇంత వరకూ ఇన్పుట్ సబ్సిడీ, పంట బీమా ఇవ్వకుండా ప్రభుత్వం జాప్యం చేస్తుండటంపై శుక్రవారం పరిగి తహశీల్దార్ కార్యాలయం ఎదుట రైతు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాయలసీమను పట్టి పీడిస్తున్న కరువును శాశ్వతంగా పారద్రోలేందుకు నడుం బిగించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన జలయజ్ఞం వల్లే గొల్లపల్లి రిజర్వాయర్ ప్రాజెక్టు పూర్తయిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకర్‌నారాయణ పేర్కొన్నారు.
రాయలసీమను పట్టి పీడిస్తున్న కరువును శాశ్వతంగా పారద్రోలడంలో భాగంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన జలయజ్ఞం వల్లే గొల్లపల్లి రిజర్వాయర్ ప్రాజెక్టు పూర్తయిందన్నారు. హంద్రీ–నీవా కాలువ పనులు వైఎస్సార్ హయాంలోనే పూర్తయినా ప్రస్తుత ప్రభుత్వం తూతూ మంత్రంగా నీరు తెప్పించి మొత్తం తామే సాధించినట్లుగా గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. దమ్ముంటే పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేసి మడకశిర బ్రాంచ్ కెనాల్ నుంచి నీటిని విడుదల చేసి రైతుల్ని ఆదుకోవాలని సవాల్ విసిరారు. జిల్లాలో సుమారు 10లక్షల మంది రైతులు పంట రుణాలు తీసుకుంటే కేవలం 2 లక్షల మందికి మాత్రమే అరకొరగా రుణమాఫీ జరిగిందన్నారు. జిల్లాలో 150 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే వారందరికీ ధైర్యాన్ని నింపుతూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓదార్పు యాత్ర చేపట్టారన్నారు.
కానీ, టీడీపీ నాయకులు ఏ ఒక్క రైతు కుటుంబాన్ని ఆదుకోలేదన్నారు. ప్రభుత్వ పథకాలు టీడీపీ కార్యకర్తలకే అందుతున్నాయని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రుణాలను కూడా జన్మభూమి కమిటీల్లో రాబందుల్లా దోచుకుతింటున్నారని దుయ్యబట్టారు. కుమారుడిపై ఉన్న శ్రద్ధ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రాష్ట్ర ప్రజలపై లేదన్నారు. ధనార్జనే ధ్యేయంగా మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు ప్రజల సొమ్మును కాజేస్తుంటే కంచే చేను మేసిన చందంగా ఉందని, ఇక రైతాంగాన్ని ఎలా కాపాడుతారన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్ సుబ్బారెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో పరిగి మండల కన్వీనర్ జయరాం, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మారుతీశ్వర్‌రావు, అరుణ్‌రెడ్డి, నారాయణరెడ్డి, నరసింహారెడ్డి, మూర్తి, బాలు, మోహన్, నాగేంద్రరెడ్డి, ఎస్సీ సెల్ శంకరప్ప, మహిళా నాయకురాలు చౌడమ్మ, కిరణ్, మల్లికార్జున, తిమ్మారెడ్డి, రామాంజి, హర్షారెడ్డి, మల్లికార్జున, అనిల్, నరేష్, శివ, గణేష్, వెంకటేష్, ఈశ్వరప్ప, తదితరులు పాల్గొన్నారు.