Shanta Sinha
-
పేద పిల్లల చదువుకు వెలుగు.. అమ్మఒడి
సాక్షి, అమరావతి: పేదపిల్లలు బడిలో ఉండేలా చూసేందుకు ఉద్దేశించిన ‘అమ్మఒడి’ పథకం వంటివి గతంలో దేశంలో ఎక్కడా అమలుచేయలేదని, పేద కుటుంబాల్లోని పిల్లల విద్యకు ఆర్థికంగా ఏ సాయం చేసినా మంచిదేనని బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ మాజీ చైర్పర్సన్ శాంతాసిన్హా అన్నారు. అదే సమయంలో.. నగదు బదిలీ చేసి వదిలేయకుండా పథకం లక్ష్యం నెరవేరేలా పటిష్ట కార్యాచరణ ఉండాలని అభిప్రాయపడ్డారు. ఇందుకు అధికారులతో పాటు తల్లిదండ్రుల కమిటీలు, పంచాయతీల్ని విద్యావ్యవస్థలో బాధ్యుల్ని చేయాలని సూచించారు. ‘జగనన్న అమ్మఒడి’ పథకంపై సోమవారం ఆమె సాక్షితో సంభాషించారు. విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యమిస్తే.. సామాజికంగా మనం ఆశించే మార్పులు సాధ్యమవుతాయని, అయితే ఇది ఏ ఒక్క రోజులోనో సాధ్యం కాదని.. నిరంతరాయంగా 20 ఏళ్లపాటు కొనసాగాలన్నారు. ‘అమ్మఒడి’ సహా విద్యా వ్యవస్థపై ఎంవీ ఫౌండేషన్ వ్యస్థాపకురాలిగా కూడా వ్యవహరిస్తున్న శాంతాసిన్హా పలు అభిప్రాయాలు పంచుకున్నారు. అవి ఆమె మాటల్లోనే.. బడికెళ్లేలా చూడాల్సిన బాధ్యత అందరిదీ.. ‘అమ్మఒడి’ పథకంపై తల్లుల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రభుత్వం చేస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలి. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు ఈ బాధ్యత అప్పగించాలి. అప్పుడు అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. ఏదో డబ్బులిచ్చారు? ఖర్చు చేద్దాంలే.. అనేలా ఉండకూడదు. పిల్లలు బడికెళ్లేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. స్కూళ్లు బాగా నడిస్తే పిల్లలు వారంతట వారే వస్తారు. విద్యావ్యవస్థపై ప్రతి ఒక్కరికీ బాధ్యత ఉండేలా చూడాలి. పైనుంచి కిందివరకు అందరినీ భాగస్వాముల్ని చేయాలి. పనిచేయకపోతే చర్యలు తీసుకోవాలి. ఎంఈవోలు, ఎంఆర్సీలు, సీఆర్సీలు, హెచ్ఎంలు, సబ్జెక్టు టీచర్లు ఇలా అందరూ పూర్థి స్థాయిలో ఉండి విద్యావ్యవస్థలో వారి విధుల్ని సక్రమంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలి. ఇవన్నీ ఉన్నా.. పిల్లలు రాకపోతే అప్పుడు పిల్లల తల్లిదండ్రులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. స్కూళ్ల అభివృద్ధికి ‘నాడు–నేడు’ దోహదం స్కూళ్ల అభివృద్ధికి నాడు–నేడు కార్యక్రమం ఎంతో ప్రయోజనకరం. తల్లిదండ్రుల కమిటీలు, గ్రామ పంచాయతీల్ని ఈ కార్యక్రమంలో భాగస్వాముల్ని చేయాలి. బడి బయట ఏ ఒక్క చిన్నారి ఉండడానికి వీల్లేదు. ప్రభుత్వ లక్ష్యం అదే కావాలి. పేరెంట్స్ కమిటీలు, గ్రామ పంచాయతీలకు కూడా బాధ్యత అప్పగించాలి. అవకాశం కల్పిస్తే పేద పిల్లలు బాగా చదవగలరన్నది సాధ్యం చేసి చూపించాలి. కార్పొరేట్ సంస్థల్ని రద్దు చేయాలి విద్యను వ్యాపారంగా మార్చిన ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల్ని పూర్తిగా రద్దుచేయాలి. కార్పొరేట్ యాజమాన్యాలకు సొంత ప్రయోజనాలే తప్ప సామాజిక, సేవా దృక్పథం ఉండదు. అమెరికా, యూరోప్‌లో విద్య పబ్లిక్ సర్వీస్‌గానే ఉంది. విద్య ప్రభుత్వ బాధ్యత. ప్రైవేట్‌లో ఉండడం వల్లే అసమానతలు ఏర్పడుతున్నాయి. పిల్లలందరికీ చదువు చెప్పించేందుకు ప్రభుత్వం సిద్ధమవ్వాలి. తగినన్ని సెకండరీ, హయ్యర్ సెకండరీ స్కూళ్లను పెట్టాలి. నాణ్యమైన విద్యను అందించాలి. ఈ కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల్ని బంద్ చేయిస్తే ప్రజలపై చదువు కోసం ఆర్థిక భారం ఉండదు. లాభాపేక్ష లేని ప్రైవేట్ సంస్థలకు పాఠశాలలు నడిపించే బాధ్యత అప్పగించాలి. ఫిర్యాదుల్ని పరిష్కరించేలా కమిషన్లు విద్యారంగంలో ప్రమాణాల కోసం కమిషన్ల ఏర్పాటు మంచి నిర్ణయమే. వాటిలో ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం ఉండాలి. ఎవరైనా తమకు సమస్య ఎదురైతే కమిషన్‌కు చెప్పుకుని పరిష్కారం పొందేలా చూడాలి. పంచాయతీలకు బాధ్యతలు అప్పగించాలి ప్రభుత్వ విద్యా విధానంలో పంచాయతీలు, ఇతర స్థానిక సంస్థల పర్యవేక్షణ బాధ్యత చాలా ముఖ్యం. కేరళలో ఈ వ్యవస్థ బాగా పనిచేస్తోంది. అక్కడి ప్రభుత్వం పంచాయతీలకు పెద్ద పాత్ర ఇచ్చింది. అక్కడి నిపుణులను రప్పించి ఇక్కడ మార్పులు చేసినా మంచిదే. -
కన్నుల పండువగా.. సాక్షి అవార్డుల పండుగ
సాక్షి, హైదరాబాద్: సాక్షి మీడియా గ్రూప్ నిర్వహించిన ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డులు 2018’ కార్యక్రమం శనివారం కన్నుల పండువగా సాగింది. హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ముఖ్య అతిథిగా, సాక్షి గ్రూపు మాజీ చైర్పర్సన్ వైఎస్ భారతీరెడ్డి గౌరవఅతిథిగా పాల్గొన్నారు. 2014లో ప్రారంభమైన ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డులు’ఐదో ఎడిషన్‌లో భాగంగా 2018కి సంబంధించి వివిధ రంగాల్లో విశేష కృషిచేసిన వారికి అవార్డులు ప్రదానం చేశా రు. సామాజిక సేవ, విద్య, ఆరోగ్య పరిరక్షణ, క్రీడ లు, సినిమా రంగాల్లో విశేష ప్రతిభ చూపిన వారికి అవార్డులు ప్రదానం చేశారు. సినీ నటి ఝాన్సీ వ్యాఖ్యానం, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ దీపికారెడ్డి బృందం ‘స్వాగతాంజలి’కూచిపూడి నాట్యంతో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్యఅతిథి గా హాజరైన గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, గౌర వ అతిథి వైఎస్ భారతీరెడ్డి చేతుల మీదుగా వ్యవసాయ రంగంలో చెరుకూరి రామారావు, విద్యారంగంలో పెరవలి గాయత్రి, ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్‌గా డాక్టర్ రమేశ్ కంచర్ల, తెలుగు పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ అవార్డులు అందుకున్నారు. సామాజిక సేవా రంగంలో మల్లికాంబ ఇనిస్టిట్యూట్ ఫర్ మెంటల్లీ హ్యాండీకాప్డ్ సంస్థ వ్యవస్థాపకురాలు రామలీల, విద్యారంగంలో డాక్టర్ ఐవీ శ్రీనివాస్‌రెడ్డి, ఆరోగ్య పరిరక్షణ విభాగంలో డాక్టర్ బిందు మీనన్, క్రీడారంగానికి సంబంధించి గరికపాటి అనన్య, షేక్ మహ్మద్ అరీఫుద్దీన్ తరపున అతడి సోదరుడు అవార్డులు అందుకున్నారు. ఆరోగ్య పరిరక్షణ, సామాజిక సేవా రంగాల్లో డాక్టర్ యాదయ్య, హుసాముద్దీన్‌తోపాటు సబీనా జేవియర్ తరపున దినేశ్ అవార్డులు స్వీకరించారు. ప్రముఖుల చేతుల మీదుగా: ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్‌ను వైఎస్ భారతీరెడ్డి సన్మానించారు. అవార్డు గ్రహీతలను ఎంపిక చేసిన జ్యూరీ చైర్పర్సన్, పద్మ శ్రీ అవార్డు గ్రహీత శాంతా సిన్హాతో పాటు, జ్యూరీ సభ్యులుగా వ్యవహరించిన రెయిన్బో హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ ప్రణతీరెడ్డి, రిటైర్డు ఐపీఎస్ అధికారి అరుణ బహుగుణ, పి.చంద్రశేఖర్‌రెడ్డి, ఎన్జీ రంగా యూనివర్సిటీ మాజీ వీసీ డాక్టర్ పద్మరాజు, కాటన్ బోర్డు మాజీ సలహాదారు దొంతి నర్సింహారెడ్డి, సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస్‌రావు, సురానా టెలికాం ఎండీ నరేంద్ర సురానా, రిటైర్డు ఐఏఎస్ అధికారి వినోద్ అగర్వాల్ తదితరులకు సాక్షి మీడియా గ్రూప్ డైరెక్టర్ రాణిరెడ్డి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. భారతి సిమెంట్ మార్కెటింగ్ డైరెక్టర్ రవీందర్‌రెడ్డి, సీఈఓ అనూప్ కుమార్ సక్సేనా, వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉపాధ్యక్షులు శేఖర్ విశ్వనాథన్, శంకర్ విశ్వనాథన్, సాక్షి సీఈఓ వినయ్ మహేశ్వరి, సాక్షి మీడియా డైరెక్టర్లు ఎ.లక్ష్మీనారాయణ రెడ్డి, కేఆర్పీ రెడ్డి, వైఈపీ రెడ్డి, పీవీకే ప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పలు విభాగాల్లో సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానం జరిగింది. ‘జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రముఖ సీనియ ర్ నటుడు కృష్ణంరాజు, ఉత్తమ నటుడిగా రామ్‌చరణ్, ఉత్తమ నటిగా పూజాహెగ్డే, ఉత్తమ దర్శకుడిగా నాగ్అశ్విన్, ఉత్తమ చిత్రం గా ‘మహానటి’కి అవార్డులు ప్రదానం చేశారు. ఇంకా పలువురు నటీనటులు, సాంకేతిక నిపు ణు లు ‘సాక్షి’ ఎక్సలెన్స్ అవార్డులు అందుకున్నారు. -
స్వేచ్ఛ, సమానత్వం కోసం పోరాడాలి
హైదరాబాద్: మహిళలు స్వేచ్ఛ, సమానత్వం కోసం పోరాటం చేయాల్సిన అవసరముందని జాతీయ బాలల హక్కుల మాజీ చైర్మన్ ప్రొఫెసర్ శాంతాసిన్హా స్పష్టం చేశారు. భారత రాజ్యాంగంలో స్త్రీలకు స్వేచ్ఛ, సమానత్వం కల్పించినప్పటికీ సమాజంలో నేటికీ వివక్షకు గురవుతూనే ఉన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బాగ్‌లింగంపల్లి అంబేడ్కర్ కళాశాలలో వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా ఆదివారం జరిగిన ‘శతకోటి ప్రజాగళం’ సదస్సులో పాల్గొని ఆమె మాట్లాడారు. మహిళలపై వివక్ష అనేది ఆంక్షల పేరుతో ఇంటి నుంచే ప్రారంభమవుతుందన్నారు. మహిళల వివక్ష పట్ల సమాజంలోని ఆలోచన విధానంలోనే మార్పు రావాలన్నారు. పోరాడితేనే మహిళలకు హక్కులువచ్చాయని గుర్తుచేశారు. మహిళగా మనల్ని మనం గౌరవించుకోవాలన్నారు. మహిళలపై దాడులు పెరిగాయి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలో మహిళలపై దాడులు, హింస పెరిగిపోయాయని ఐద్వా జాతీయ నాయకురాలు మల్లు స్వరాజ్యం ఆవేదన వ్యక్తం చేశారు. ï శబరిమలలో స్త్రీలకు ప్రవేశం లేదనటం వివక్ష కాదా అని ప్రశ్నించారు. హింస, వివక్షతకు వ్యతిరేకంగా మహిళలు పెద్ద ఎత్తున పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సభ ప్రారంభానికి ముందు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి అంబేడ్కర్ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్, రచయిత కె.విమల, ఐద్వా నాయకులు మల్లు లక్ష్మి, హైమావతి, భూమిక ఎడిటర్ కొండవీటి సత్యవతి, అమన్ వేదిక, రెయిన్బో హోమ్స్, అంకురం, అప్సా, భూమిక ఉమెన్ కలెక్టీవ్, వివిధ సచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
శాంతాసిన్హాకు ‘బెగోరె’ అవార్డు ప్రదానం
నెల్లూరు, న్యూస్‌లైన్ : ప్రముఖ సామాజిక కార్యకర్త, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, పద్మశ్రీ శాంతాసిన్హాకు మాజీ ముఖ్యమంత్రి బెజవాడ గోపాల్‌రెడ్డి స్మారక అవార్డును ఆదివారం నెల్లూరులోని పురమందిరంలో అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, సింహపురి ఆడపడచు శాంతాసిన్హాకు ఇలాంటి గొప్ప అవార్డును ప్రదానం చేయడం సింహపురికే గర్వకారణమన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు శాంతాసిన్హా చేస్తున్న సేవలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతిఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అవార్డు గ్రహీత శాంతాసిన్హా మాట్లాడుతూ, తన జీవితంలో ఎన్నో అవార్డులను అందుకున్నానని, ఈ అవార్డు మాత్రం మనసుకు హత్తుకుందన్నారు. బెజవాడ గోపాల్‌రెడ్డితో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అవార్డు ప్రదానం చేసిన వారిలో ప్రముఖ పారిశ్రామిక వేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.