Lok Sabha Election 2024: మథువాల మద్దతెవరికో!
బన్గావ్. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ సరిహద్దులోని లోక్సభ స్థానం. ఈ ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గంలో మథువాల ప్రాబల్యం ఎక్కువ. ఇక్కడ పారీ్టల గెలుపోటములను నిర్ణయించేది వాళ్లే. దాంతో బీజేపీ, తృణమూల్ రెండూ మథువా సామాజిక వర్గానికి చెందిన వారినే బరిలోకి దించాయి. గత ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీతో గెలుపొందిన శంతను కుమార్ బీజేపీ నుంచి మళ్లీ పోటీ చేస్తున్నారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ నుంచి బిశ్వజిత్ దాస్ రంగంలో ఉన్నారు...బన్గావ్ లోక్సభ స్థానం 2009లో ఏర్పడింది. స్వాతంత్య్రానంతరం, 1971లో బంగ్లాదేశ్ విమోచన యుద్ధ సమయంలో హిందూ శరణార్థులు భారీగా బన్గావ్ ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారు. వీరిలో అత్యధికులు మథువాలే. బన్గావ్ ఓటర్లలో 67 శాతం దాకా వాళ్లే ఉన్నారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) నేపథ్యంలో వీరు సహజంగానే బీజేపీకి మద్దతిస్తున్నారు. బన్గావ్ లోక్సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల ఆరు బీజేపీ చేతిలోనే ఉన్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీ బన్గావ్ నుంచి బెంగాల్ ప్రచారాన్ని ప్రారంభించారు. మథువా సామాజికవర్గానికి పౌరసత్వం ఇస్తామని హామీ ఇచ్చారు. దాంతో వారి ఓట్లు అత్యధికంగా బీజేపీకే పడ్డాయి. అలా ఇక్కడ తొలిసారి బీజేపీ విజయం సాధించింది. శంతను లక్షకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచి కేంద్ర నౌకాయాన శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో కూడా బన్గావ్లో సీఏఏ ప్రధాన ఎన్నికల అంశంగా మారింది. సీఏఏ చట్టాన్ని అమల్లోకి తెస్తూ ఎన్నికల ముందు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేయడం తెలిసిందే. అయితే ఆన్లైన్ దరఖాస్తుల్లో బంగ్లాదేశ్లో ఉన్నప్పటి చిరునామా, నివాస పత్రాల వివరాలను చాలామంది సమర్పించలేదు. ఇది సమస్యలకు దారి తీయడంపై ఇక్కడి మథువాలు అసంతృప్తితో ఉన్నారు. తప్పుదారి పట్టిస్తున్నారు: టీఎంసీ సీఏఏను తృణమూల్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది మథువా వర్గాన్ని తప్పుదోవ పట్టించేందుకు బీజేపీ చేస్తున్న కుట్రగా అభివరి్ణస్తోంది. మథువాలు ఇప్పటికే భారతీయులని, వారికి ఆధార్, ఓటరు గుర్తింపు కార్డు ఉన్నాయని తృణమూల్ అధినేత్రి మమత అంటున్నారు. ‘‘ఈ దేశ పౌరులు కాకుంటే ఇన్నేళ్లు వారు ఓటెలా వేశారు? ప్రజాప్రతినిధులుగా పార్లమెంటుకు, బెంగాల్ అసెంబ్లీకి ఎలా వెళ్లారు?’’ అని ప్రశి్నస్తున్నారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బన్గావ్లో ఘోర పరాజయం తర్వాత గతేడాది పంచాయతీ ఎన్నికల్లో తృణమూల్ దుమ్ము రేపింది. బోరో కుటుంబానిదే ఆధిపత్యం... బన్గావ్ రాజకీయాలను బోరో మా (బీనాపాణి దేవి) కుటుంబమే శాసిస్తోంది. 1947లో బీనాపాణి దేవి, ఆమె భర్త ప్రమథ్ రంజన్ ఠాకూర్ బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చి దక్షిణ కోల్కతాలోని బల్లిగంజ్లో స్థిరపడ్డారు. ప్రమథ్ నామశూద్ర (ఎస్సీ) కమ్యూనిటీకి చెందిన ప్రముఖ నాయకుడు. మథువాల హక్కుల కోసం పోరాడారు. తమలా వలస వచి్చన వారికి ఆశ్రయం కోసం స్థానిక ఠాకూర్నగర్లో భూమి కొనుగోలు చేశారు. ‘ఠాకూర్బరీ ల్యాండ్ అండ్ ఇండస్ట్రీస్’ పేరుతో కొన్న ఆ స్థలంలో శరణార్థుల కోసం తొలి ప్రైవేట్ కాలనీ నిర్మించారు. ప్రమథ్ 1962లో కాంగ్రెస్ అభ్యరి్థగా హన్స్ఖాలీ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచారు. కుమారుడు కపిల్ కృష్ణ ఠాకూర్ 2014లో ఎంపీ అయ్యారు. ఆయన మరణానంతరం భార్య మమత 2015 ఉప ఎన్నికలో గెలిచారు. చిన్న కుమారుడు మంజుల్ కృష్ణ ఠాకూర్ టీఎంసీ ఎమ్మెల్యేగా చేశారు. తర్వాత బీజేపీలో చేరారు. బీజేపీ అభ్యర్థి శంతను ఆయన రెండో కుమారుడే. – సాక్షి, నేషనల్ డెస్క్