Shapoorji and Pallonji Group
-
మార్కెట్లు బేర్- ఈ షేర్ల దూకుడు తగ్గలేదు
వరుసగా ఆరో రోజు దేశీ స్టాక్ మార్కెట్లలో అమ్మకాలు ఊపందుకోవడంతో పతన బాటలో సాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 665 పాయింట్లు పడిపోయి 37,003కు చేరగా.. 183 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 10,949 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనూ సానుకూల వార్తల కారణంగా నాలుగో రోజూ రూట్ మొబైల్ సరికొత్త గరిష్టాన్ని తాకగా.. రెండో రోజూ షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ క్యాప్ కౌంటర్లకు డిమాండ్ నెలకొంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో పతన మార్కెట్లోనూ ఈ షేర్ల భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. రూట్ మొబైల్ పబ్లిక్ ఇష్యూ ధర రూ. 350తో పోలిస్తే లిస్టింగ్ రోజు సోమవారం 86 శాతం లాభంతో రూ. 650 వద్ద స్థిరపడిన రూట్ మొబైల్ తాజాగా సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. ఎన్ఎస్ఈలో తొలుత 18 శాతం దూసుకెళ్లి రూ. 972కు చేరింది. వెరసి నాలుగు రోజుల్లో 150 శాతం ర్యాలీ చేసింది. ప్రస్తుతం 16 శాతం జంప్‌చేసి రూ. 954 వద్ద ట్రేడవుతోంది. లిస్టింగ్ రోజు గోల్డ్‌మన్ శాక్స్, కువైట్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ రూ. 210 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసినట్లు వెల్లడికావడంతో ఈ కౌంటర్ జోరు చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. షేరుకి రూ. 697 ధరలో వీటిని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ షేర్లు కొద్ది నెలలుగా నలుగుతున్న వివాదాల నేపథ్యంలో టాటా సన్స్ నుంచి వైదొలగవలసిన అవసరమున్నట్లు షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ తాజాగా పేర్కొంది. టాటా సన్స్‌లో షాపూర్జీ గ్రూప్‌నకు 18.37 శాతం వాటా ఉంది. ఈ వాటా విక్రయం ద్వారా రూ. 1.5 లక్షల కోట్లవరకూ సమకూరగలవని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. షాపూర్జీ గ్రూప్ వాటాను మార్కెట్ ధరకే కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు టాటా సన్స్ ఇప్పటికే తెలియజేసింది. ఈ నేపథ్యంలో షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ కౌంటర్లకు వరుసగా రెండో రోజు డిమాండ్ కనిపిస్తోంది. ప్రస్తుతం స్టెర్లింగ్ అండ్ విల్సన్ షేరు ఎన్ఎస్ఈలో 5.2 శాతం జంప్‌చేసి రూ. 248 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 258 వరకూ ఎగసింది. ఇక బీఎస్ఈలో ఫోర్బ్స్ అండ్ కంపెనీ షేరు రెండో రోజూ 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 74 బలపడి రూ. 1,558 వద్ద ఫ్రీజయ్యింది. -
మిస్త్రీ ఎఫెక్ట్: షాపూర్జీ కంపెనీల హైజంప్
కొద్ది నెలలుగా నలుగుతున్న వివాదాల నేపథ్యంలో టాటా సన్స్ నుంచి వైదొలగవలసిన అవసరమున్నట్లు షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ తాజాగా పేర్కొంది. టాటా సన్స్‌లో షాపూర్జీ గ్రూప్‌నకు 18.37 శాతం వాటా ఉంది. తద్వారా టాటా గ్రూప్‌లో పల్లోంజీ మిస్త్రీ గ్రూప్ అతిపెద్ద వాటాదారుగా నిలుస్తూ వస్తోంది. వాటా విక్రయం ద్వారా రెండు గ్రూపుల మధ్య సుమారు ఏడు దశాబ్దాలుగా కొనసాగుతున్న అనుబంధానికి తెరపడనున్నట్లు విశ్లేషకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. (టాటా గ్రూపునకు ఎస్పీ గ్రూప్ టాటా) వాటా కొనుగోలు షాపూర్జీ గ్రూప్ వాటాను మార్కెట్ ధరకే కొనుగోలు చేసే యోచనలో ఉన్నట్లు ఇటీవల టాటా సన్స్ ప్రకటించింది. మరోవైపు టాటా సన్స్‌లో వాటా విక్రయం ద్వారా షాపూర్జీ గ్రూప్‌నకు భారీగా నిధులు సమకూరనున్నాయి. రూ. 1.5 లక్షల కోట్లు లభించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇటీవల కొంతకాలంగా షాపూర్జీ గ్రూప్ రుణ భారం భారీగా పెరిగినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. తద్వారా గ్రూప్ కంపెనీల రుణ భారాన్ని తగ్గించుకునేందుకు వీలు చిక్కనున్నట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎండ్టు ఎండ్ సోలార్ ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ కంపెనీ స్టెర్లింగ్ అండ్ విల్సన్, ఫోర్బ్స్ అండ్ కంపెనీ కౌంటర్లకు ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడింది. షేర్లు జూమ్ జూన్‌కల్లా స్టెర్లింగ్ అండ్ విల్సన్‌లో షాపూర్జీ గ్రూప్ వాటా 50.58 శాతంగా నమోదైంది. కంపెనీ ఆర్డర్‌బుక్ విలువ రూ. 5,696 కోట్లను తాకింది. ఈ ఏడాది ఏప్రిల్- జూన్ మధ్య కాలంలోనే 1 గిగావాట్ ఆర్డర్లు సంపాదించింది. వీటి విలువ రూ. 3,633 కోట్లుకాగా.. ఎన్ఎస్ఈలో స్టెర్లింగ్ అండ్ విల్సన్ షేరు 20 శాతం దూసుకెళ్లింది. కొనేవాళ్లు అధికంకాగా.. అమ్మకందారులు కరువుకావడంతో రూ. 39 ఎగసి రూ. 236 సమీపంలో ఫ్రీజయ్యింది. ఇక మరోవైపు బీఎస్ఈలో ఫోర్బ్స్ అండ్ కంపెనీ సైతం 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 71 ఎగసి రూ. 1484 వద్ద ఫ్రీజయ్యింది. -
సైరస్ మిస్త్రీ తొలగింపుపై విమర్శలు
టాటా సన్స్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సైరస్ మిస్త్రీకి ఉద్వాసన పలకడం చట్టవిరుద్ధమని టాటా గ్రూప్‌లోని మెజార్టీ స్టాక్హోల్డర్స్ షాపూర్జీ, పల్లోంజి గ్రూప్ విమర్శిస్తోంది. మిస్త్రీని తొలగిస్తూ తీసుకున్న నిర్ణయం ఏకగ్రీవంగా జరిగిందని కాదని పేర్కొంటోంది. ఈ విషయాన్ని సీనియర్ లాయర్ మోహన్ పరశారణ్ నిర్థారించారు.మొత్తం తొమ్మిది మంది బోర్డు సభ్యులో ఎనిమిది మంది ఈ నిర్ణయం తీసుకోవడంలో ఓటింగ్‌లో పాల్గొన్నారని పల్లోంజి గ్రూప్ తెలిపింది. వారిలో ఆరుగురు మిస్త్రీ ఉద్వాసనకు మద్దతు పలుకగా, మిగిలిన ఇద్దరు వ్యతిరేకించారని వెల్లడించింది. సైరస్ మిస్త్రీని తప్పించే నిర్ణయం ఏకగ్రీవంగా జరిగిందనే టాటా సన్స్ ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దేశీయ ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలో ఒకటైన టాటా సన్స్ సైరస్ మిస్త్రీని విధుల నుంచి తప్పిస్తూ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. తాత్కాలిక చైర్మన్‌గా రతన్ టాటాను నియమించింది. పూర్తిస్థాయి చైర్మన్‌ను నాలుగు నెలల్లో సెలక్షన్ కమిటీ నియమించనుంది. ఈ సెలక్షన్ కమిటీలో సభ్యులుగా రతన్ టాటా, వేణు శ్రీనివాసన్, అమిత్ చంద్రా, రోనెన్ సేన్, లార్డ్ కుమార్ భట్టాచార్య ఉన్నారు. మిస్త్రీ తొలగింపుపై ఎలాంటి కారణాలను టాటా సన్స్ వెల్లడించలేదు. కానీ లాభాపేక్ష లేని కంపెనీలను తొలగిస్తూ మిస్త్రీ తీసుకుంటున్న చర్యలతో టాటా సన్స్ అసంతృప్తిగా ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన్ను తొలగించిన్నట్టు సమాచారం.