సైరస్ మిస్త్రీ తొలగింపుపై విమర్శలు
సైరస్ మిస్త్రీ తొలగింపుపై విమర్శలు
Published Mon, Oct 24 2016 8:04 PM | Last Updated on Mon, Sep 4 2017 6:11 PM
టాటా సన్స్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్న సైరస్ మిస్త్రీకి ఉద్వాసన పలకడం చట్టవిరుద్ధమని టాటా గ్రూప్లోని మెజార్టీ స్టాక్హోల్డర్స్ షాపూర్జీ, పల్లోంజి గ్రూప్ విమర్శిస్తోంది. మిస్త్రీని తొలగిస్తూ తీసుకున్న నిర్ణయం ఏకగ్రీవంగా జరిగిందని కాదని పేర్కొంటోంది. ఈ విషయాన్ని సీనియర్ లాయర్ మోహన్ పరశారణ్ నిర్థారించారు.మొత్తం తొమ్మిది మంది బోర్డు సభ్యులో ఎనిమిది మంది ఈ నిర్ణయం తీసుకోవడంలో ఓటింగ్లో పాల్గొన్నారని పల్లోంజి గ్రూప్ తెలిపింది. వారిలో ఆరుగురు మిస్త్రీ ఉద్వాసనకు మద్దతు పలుకగా, మిగిలిన ఇద్దరు వ్యతిరేకించారని వెల్లడించింది. సైరస్ మిస్త్రీని తప్పించే నిర్ణయం ఏకగ్రీవంగా జరిగిందనే టాటా సన్స్ ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
దేశీయ ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలో ఒకటైన టాటా సన్స్ సైరస్ మిస్త్రీని విధుల నుంచి తప్పిస్తూ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. తాత్కాలిక చైర్మన్గా రతన్ టాటాను నియమించింది. పూర్తిస్థాయి చైర్మన్ను నాలుగు నెలల్లో సెలక్షన్ కమిటీ నియమించనుంది. ఈ సెలక్షన్ కమిటీలో సభ్యులుగా రతన్ టాటా, వేణు శ్రీనివాసన్, అమిత్ చంద్రా, రోనెన్ సేన్, లార్డ్ కుమార్ భట్టాచార్య ఉన్నారు. మిస్త్రీ తొలగింపుపై ఎలాంటి కారణాలను టాటా సన్స్ వెల్లడించలేదు. కానీ లాభాపేక్ష లేని కంపెనీలను తొలగిస్తూ మిస్త్రీ తీసుకుంటున్న చర్యలతో టాటా సన్స్ అసంతృప్తిగా ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన్ను తొలగించిన్నట్టు సమాచారం.
Advertisement
Advertisement