
సాక్షి, న్యూఢిల్లీ: వాటాలకు సంబంధించి టాటా సన్స్, షాపూర్‌జీ పల్లోంజీ (ఎస్‌పీ) గ్రూప్ మధ్య వివాదంపై సుప్రీం కోర్టులో తుది వాదనలు కొనసాగుతున్నాయి. హోల్డింగ్ సంస్థ అయిన టాటా సన్స్‌లో తమకున్న 18.37 శాతం వాటాలకు బదులుగా టాటా గ్రూప్ లిస్టెడ్ కంపెనీల్లో షేర్లను కేటాయించాలంటూ ఎస్‌పీ గ్రూప్ ప్రతిపాదించింది. అయితే, ఇది అర్థరహితమైన ప్రతిపాదనంటూ టాటా సన్స్ తోసిపుచ్చింది. అలా చేస్తే టాటా గ్రూప్‌లో భాగమైన ఇతర లిస్టెడ్ కంపెనీల్లో ఎస్‌పీ గ్రూప్ మళ్లీ మైనారిటీ వాటాలు తీసుకున్నట్లవుతుందే తప్ప పెద్ద తేడా ఉండబోదని పేర్కొంది. టాటా సన్స్ తరఫున సీనియర్ అడ్వకేట్ హరీష్ సాల్వే, ఎస్‌పీ గ్రూప్‌నకు సంబంధించిన సైరస్ ఇన్వెస్ట్‌మెంట్ తరఫున సీనియర్ అడ్వకేట్ సీఏ సుందరం వాదనలు వినిపించారు. దీనిపై విచారణ సోమవారం కూడాకొనసాగనుంది. టాటా సన్స్‌తో విభేదాల నేపథ్యంలో అందులో వాటాలు విక్రయించి వైదొలగాలని ఎస్‌పీ గ్రూప్ భావిస్తోంది. అయితే, వేల్యుయేషన్ విషయంలో సమస్య వచ్చి పడింది. టాటా సన్స్‌లో తమకున్న 18.37 శాతం వాటాల విలువ రూ. 1.75 లక్షల కోట్లుగా ఉంటుందని ఎస్‌పీ గ్రూప్ వాదిస్తుండగా, ఇది కేవలం రూ. 70,000-80,000 కోట్ల మధ్య ఉంటుందని టాటా సన్స్ చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment