Shapoorji Pallonji Company
-
అదానీ చేతికి గోపాల్పూర్ పోర్టు
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం అదానీ గ్రూప్ ఖాతాలోకి మరో పోర్టు వచ్చి చేరనుంది. గ్రూప్‌లో భాగమైన అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ సంస్థ (ఏపీసెజ్) తాజాగా ఒడిశాలోని గోపాల్పూర్ పోర్టును (జీపీఎల్) దక్కించుకోనుంది. ఇందుకోసం జీపీఎల్లో షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూప్, ఒడిశా స్టీవ్డోర్స్ లిమిటెడ్ (ఓఎస్ఎల్) నుంచి 95 శాతం వాటాలను రూ. 1,349 కోట్లకు కొనుగోలు చేయనుంది. జీపీఎల్లో ఎస్పీ పోర్ట్ మెయింటెనెన్స్‌కి 56 శాతం, ఓఎస్ఎల్కి 44 శాతం వాటాలు ఉన్నాయి. ఇందులో ఎస్పీ గ్రూప్ వాటాలను పూర్తిగా, ఓఎస్ఎల్ నుంచి 39 శాతం వాటాలను ఏపీసెజ్ కొనుగోలు చేయనుంది. ఓఎస్ఎల్ 5 శాతం వాటాతో జాయింట్ వెంచర్ భాగస్వామిగా కొనసాగనుంది. రూ. 3,080 కోట్ల ఎంటర్ప్రైజ్ విలువతో 95 శాతం వాటాను రూ. 1,349 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు ఏపీసెజ్ తెలిపింది. నిర్దిష్ట మైలురాళ్లను అధిగమించాకా 5.5 ఏళ్ల తర్వాత మరో రూ. 270 కోట్లు చెల్లించే ప్రాతిపదికన ఈ డీల్ ఉంటుందని పేర్కొంది. దీంతో ఎంటర్ప్రైజ్ విలువను రూ. 3,350 కోట్లుగా లెక్కగట్టినట్లవుతుంది. గోపాల్పూర్ పోర్టు కొనుగోలుతో తమ కస్టమర్లకు మరింతగా సమగ్రమైన సేవలు అందించేందుకు వీలవుతుందని ఏపీసెజ్ ఎండీ కరణ్ అదానీ తెలిపారు. దీనితో ఒడిశాలోని మైనింగ్ హబ్‌లు, పొరుగు రాష్ట్రాలు అందుబాటులోకి రాగలవని, తద్వారా మారుమూల ప్రాంతాలకు కూడా తమ లాజిస్టిక్స్ సేవలను విస్తరించడానికి వీలవుతుందని పేర్కొన్నారు. ఏపీసెజ్‌కి ప్రస్తుతం తూర్పు, పశ్చిమ తీరాల్లో పద్నాలుగు పోర్టులు, టెర్మినల్స్ ఉన్నాయి. 20 మిలియన్ టన్నుల సామర్థ్యం.. ఒరిస్సాలోని గంజాం జిల్లాలో 20 మిలియన్ టన్నుల వార్షిక సామర్ధ్యంతో గోపాల్పూర్ పోర్టు పని చేస్తోంది. ఇనుప ఖనిజం, బొగ్గు, అల్యూమినా మొదలైన కార్గోను హ్యాండిల్ చేస్తోంది. ఇటీవలే ఇది ఎల్ఎన్జీ రీగ్యాసిఫికేషన్ టెరి్మనల్‌ను నెలకొల్పేందుకు పెట్రోనెట్ ఎల్ఎన్జీతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. 2024 ఆర్థిక సంవత్సరంలో జీపీఎల్ 11.3 మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ ద్వారా రూ. 520 కోట్ల ఆదాయం ఆర్జించవచ్చని అంచనాలు ఉన్నాయి. అసెట్ మానిటైజేషన్‌పై ఎస్పీ దృష్టి.. రూ. 20,000 కోట్ల రుణభారాన్ని తగ్గించుకునే దిశగా ఎస్పీ గ్రూప్ గత కొన్నాళ్లుగా అసెట్ మానిటైజేషన్ (ఆస్తులను విక్రయించడం లేదా, లీజుకివ్వడం ద్వారా నిధులు సమకూర్చుకోవడం)పై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా గతంలో మహారాష్ట్రలోని ధరమ్‌తార్ పోర్టును రూ. 710 కోట్ల విలువకు జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థకి విక్రయించింది. 2015లో దీన్ని కొనుగోలు చేసిన ఎస్పీ గ్రూప్.. ఆ తర్వాత కార్యకలాపాలను టర్న్అరౌండ్ చేయగలిగింది. వార్షిక సామర్థ్యాన్ని 1 ఎంటీపీఏ నుంచి 5 ఎంటీపీఏకి పెంచింది. ఇక గోపాల్పూర్ పోర్టు ఒప్పందం గత కొద్ది నెలల్లో రెండో డీల్. రెండు పోర్టులను గణనీయమైన విలువకు విక్రయించడమనేది అసెట్స్‌ను టర్న్అరౌండ్ చేయడంలోను, స్వల్పకాలంలోనే వాటాదారులకు మెరుగైన రాబడులు అందించడంలోనూ తమకు గల సామర్థ్యానికి నిదర్శనమని ఎస్పీ గ్రూప్ ప్రతినిధి తెలిపారు. -
ముడుపులివ్వకపోతే మూడినట్లే!..
సాక్షి, అమరావతి: ‘‘అమరావతిలో రాజధాని భవనాల నిర్మాణ పనుల సమయంలో షాపూర్జీ పల్లోంజీ సంస్థ తరఫున నేను చాలాసార్లు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సమావేశమయ్యేవాడిని. ఇలా కలుస్తున్న సమయంలో ఒకసారి ఆయన తన పీఏ పెండ్యాల శ్రీనివాస్‌ను పరిచయం చేశారు. ఇక నుంచి శ్రీనివాస్ చెప్పినట్లుగా నడుచుకోవాలని నన్ను ఆదేశించారు’’ అని ఆదాయపు పన్ను శాఖకు ఇచ్చిన స్టేట్మెంట్లో మనోజ్ వాసుదేవ్ పార్థసాని వెల్లడించాడు. తదనంతరం పీఏ శ్రీనివాస్ చంద్రబాబు నాయుడికి ముడుపులు ఏ రూపంలో ఎలా ఇవ్వాలో చెప్పేవారని, లేకపోతే తమ బిల్లులు పాస్ చెయ్యకుండా పెండింగ్‌లో పెట్టేవారని, చేసేదేమీ లేక చంద్రబాబుకు వందల కోట్ల రూపాయలు ముడుపులుగా ఇచ్చామని మనోజ్ పార్థసాని ఐటీ శాఖకు స్పష్టంగా చెప్పటంతో... రాజధానిలో తాత్కాలిక భవనాలను నిర్మిస్తున్నామనే ముసుగులో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాగించిన ముడుపుల దందా స్పష్టంగా బయటపడింది. కాంట్రాక్టు సంస్థలను బెదిరించి వాటి నుంచి వందల కోట్ల ముడుపులను షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు నాయుడు ఎలా తన జేబులో వేసుకున్నారో ఐటీ శాఖ సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టింది. మనోజ్ పార్థసానికి చెందిన కార్యాలయాలపై 2019లో సోదాలు జరిపిన ఐటీ శాఖ.... అదే ఏడాది నవంబరు 1, 5 తేదీల్లో ఆయన్ను విచారించి ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేసింది. తదనంతరం ఆయన చెప్పిన వివరాల ఆధారంగా 2020లో చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్ ఇల్లు, కార్యాలయాల్లో కూడా సోదాలు జరిపింది. అందులో చంద్రబాబు పాత్రను నిర్ధారించే పలు కీలక డాక్యుమెంట్లు దొరకటంతో... అలా ముడుపుల రూపంలో అందిన మొత్తాన్ని బయటకు వెల్లడించకుండా దాచిన అక్రమ ఆదాయంగా ఎందుకు పరిగణించకూడదో చెప్పాలంటూ చంద్రబాబు నాయుడుకు నోటీసులిచ్చింది. నాకు నోటీసులిచ్చే అధికారం మీకు లేదంటూ చంద్రబాబు ఎదురు తిరగటంతో... ఐటీ శాఖ తాజాగా వివిధ చట్టాలను ఉటంకిస్తూ చంద్రబాబుకు మళ్లీ నోటీసులిచ్చింది. ఆ నోటీసులతో పాటు మనోజ్ పార్థసాని ఇచ్చిన స్టేట్మెంట్ను కూడా జత చేయటంతో చంద్రబాబు సాగించిన ముడుపుల దందా కళ్లకు కట్టినట్లు బయటపడింది. దీంతోపాటు అక్రమంగా రూ.118.98 కోట్లు చంద్రబాబు సొంత ఖాతాల్లోకి ఎలా చేరాయన్న విషయాన్ని ఐటీ శాఖ స్పష్టంగా ఓ పట్టిక రూపంలో వివరించింది. ఇంత స్పష్టమైన ఆధారాలున్నాయి కనక దీన్ని చంద్రబాబు సంపాదించిన అక్రమ ఆదాయంగా ఎందుకు పరిగణించకూడదో చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది. మనోజ్ పార్థసాని ఏం చెప్పారంటే... మనోజ్ పార్థసాని కార్యాలయంలో సోదాల అనంతరం ఆయన్ను ఐటీ శాఖ కొన్ని ప్రశ్నలడిగింది. దానికి ఆయనిచ్చిన సమాధానాలను రికార్డు చేసింది. ఆ ప్రశ్న జవాబులు ఎలా సాగాయంటే... ఐటీ శాఖ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మీరు తరచూ కలిసేవారా? ఎక్కడ? ఏం మాట్లాడుకునేవారు? ఎంవీపీ రాజధాని తాత్కాలిక భవనాల నిర్మాణ పనులు షాపుర్జీ పల్లోంజీ సంస్థకు దక్కాయి. ఆ సమయంలో అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడిని పలు సమావేశాలు, ప్రజంటేషన్ల సమయంలో కలిశాను. ఏపీ టిడ్కో ఇళ్ల నిర్మాణం (2017లో షాపూర్జీ పల్లోంజీ 1.40 లక్షల ఇళ్లను నిర్మించే కాంట్రాక్టును దక్కించుకుంటే 2019 మార్చి నాటికి కేవలం 23వేల ఇళ్ల నిర్మాణాన్నే పూర్తి చేసింది) ఈడబ్ల్యూఎస్ హౌసింగ్, హైకోర్టు నిర్మాణం, అమరావతి రాజధాని ప్రాంతంలో ఇతర విభాగాధిపతులు కార్యాలయాల నిర్మాణాల సమయంలో చంద్రబాబును పలు సందర్భాల్లో కలిశా. ఇవి పూర్తిగా ప్రభుత్వం నిర్వహించిన సమావేశాలు. ఏపీటిడ్కో, ఏపీ సీఆర్డీఏ వాళ్లు నిర్వహించే ఈ సమావేశాలకు షాపూర్జీ పల్లోంజీ ప్రతినిధులతో కలిసి నేను హాజరయ్యాను.చంద్రబాబు నాయుడిని తొలిసారిగా వ్యక్తిగతంగా కలిసినప్పుడు... ఆయన 2019, ఫిబ్రవరిలో విజయవాడలోని తన ఇంటికి వచ్చి కలవాలని చెప్పారు. ఆయన చెప్పిన ప్రకారం ఆయన ఇంటికి వెళ్లా. అక్కడకు వెళ్లి కలిసినపుడు రాజధానిలో జరుగుతున్న వివిధ నిర్మాణ పనుల స్థితి గతులను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు తన వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్‌ను నాకు పరిచయం చేశారు. ఆయన చెప్పినట్టుగా నడుచుకోవాలని ఆదేశించారు. రూ.118 కోట్లకు లెక్కల్లేవని చంద్రబాబుకు ఐటీ జారీ చేసిన నోటీసుల్లో ఒక భాగం ఐటీ శాఖ చంద్రబాబు నాయుడు తరఫున శ్రీనివాస్ మీకు ఎలాంటి సూచనలిచ్చారు? ఎంవీపీ శ్రీనివాస్ నాకు కొన్ని కంపెనీల జాబితాను పంపిస్తానని చెప్పాడు. ఆ కంపెనీల ద్వారా ముడుపులు తరలించాలని చెప్పారు. శ్రీనివాస్ ఆదేశాల మేరకు సబ్ కాంట్రాక్టు పనులు పొందిన విక్కీజైన్ అనే వ్యక్తి టచ్‌లోకి వచ్చారు. విక్కీ జైన్ నయోలిన్, ఎవరెట్ అనే కంపెనీల పేర్లను ఇచ్చారు. శ్రీనివాస్ ఆదేశాల మేరకు మార్చి, 2019లో నన్ను విజయ్ నంగాలియా అనే వ్యక్తి కలిశారు. ముంబై కొలాబాలో ఉన్న షాపూర్జీ పల్లోంజీ ఆఫీసు బయట ఆయన నన్ను కలిశారు. నంగాలియా, హయగ్రీవ, అన్నై, షలాక కంపెనీలకు సబ్ కాంట్రాక్టు రూపంలో వర్క్ ఆర్డర్ల పేరిట ముడుపుల నగదు తరలించాల్సిందిగా సూచించారు. ఇలా తరలించిన నగదును విక్కి, వినయ్ నంగాలియాలు చంద్రబాబు నాయుడు ఎక్కడకు చేరవేయమంటే అక్కడకు చేరవేసేవారు. ఈ కంపెనీల్లోకి ఇంకా బోలెడంత నగదు వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చింది? దాన్ని ఎక్కడకు తరలించారన్న సంగతులు నాకు తెలియవు. ఎందుకంటే కేవలం షాపూర్జీ పల్లోంజీ కంపెనీ నుంచి జరిగిన చెల్లింపుల వరకే నాకు తెలుసు. ఆ విషయం నాకు తెలుసు కనక దాన్ని శ్రీనివాస్‌కు చెప్పి... ఆ మొత్తం చంద్రబాబుకు చేరిందా లేదా అన్న విషయాన్ని కనుక్కునేవాడిని. ఐటీ శాఖ చంద్రబాబు నాయుడు, శ్రీనివాస్ చెప్పినంత మాత్రాన బోగస్ ఇన్వాయిస్ల ద్వారా నగదు తరలించడం తప్పు కదా? దాన్ని మీరు ఎందుకు వ్యతిరేకించలేదు? ఎంవీపీ శ్రీనివాస్ ఈ కంపెనీల ద్వారా బోగస్ బిల్లులతో నగదు తరలించాలని చేసిన ప్రతిపాదనను మొదట్లో నేను వ్యతిరేకించాను. షాపూర్జీ పల్లోంజి అనేది అతిపెద్ద కార్పొరేట్ సంస్థ అని, అవసరమైతే వాళ్లు అడిగిన మొత్తాన్ని నేరుగా పార్టీ ఫండ్ రూపంలోనే చెల్లిస్తుందని చెప్పాను. అప్పుడు వాళ్లు చాలా స్పష్టంగా చెప్పారు... ‘‘ఇది పార్టీ ఫండ్ కాదు. ఈ కంపెనీల ద్వారా మేం చెప్పిన వ్యక్తులకు నేరుగా నగదును తరలించాల్సిందే. ఒకవేళ మీరు గనక మా ఆదేశాలు పాటించకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని. నిజానికి అప్పటికే మేం రాజధానిలో చాలా ప్రాజెక్టుల్లో ఇరుక్కుపోయి ఉన్నాం. నడుస్తున్న అనేక ప్రాజెక్టులతో భారీగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్లు చెప్పినట్లుగా వినటం తప్ప మాకు వేరే దారి కనిపించలేదు. -
ఫోర్బ్స్ టూల్స్ బిజినెస్ విడదీత
న్యూఢిల్లీ: ప్రెసిషన్ టూల్స్ బిజినెస్‌ను విడదీయనున్నట్లు షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ కంపెనీ ఫోర్బ్స్ అండ్ కంపెనీ(ఎఫ్‌సీఎల్) తాజాగా వెల్లడించింది. ఫోర్బ్స్ ప్రెసిషన్ టూల్స్ అండ్ మెషీన్ పార్ట్స్ లిమిటెడ్(ఎఫ్‌పీటీఎల్) పేరుతో కొత్త కంపెనీగా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. ఇందుకు సోమవారం సమావేశమైన బోర్డు అనుమతించినట్లు తెలియజేసింది. ఈ ప్రతిపాదన ప్రకారం ఎఫ్‌సీఎల్ వాటాదారులకు తమవద్ద గల ప్రతీ షేరుకి మరో ఎఫ్‌పీటీఎల్ షేరుని జారీ చేయనున్నట్లు వెల్లడించింది. వీటిని బీఎస్ఈలో లిస్ట్ చేయనున్నట్లు తెలియజేసింది. గతేడాది(2021–22) ఈ విభాగం రూ. 179 కోట్ల టర్నోవర్‌ను సాధించినట్లు తెలియజేసింది. సంబంధిత విభాగంపై మరింత దృష్టి సారించడంతోపాటు వాటాదారులకు విలువ చేకూర్చే బాటలో తాజా ప్రణాళికకు తెరతీసినట్లు వివరించింది. కాగా.. ఇండస్ట్రియల్ ఆటోమేషన్, కోడింగ్ మెడికల్ పరికరాలు, విడిభాగాలు, అప్లికేషన్లు, వెంటిలేటర్లు, రియల్టీ తదితర వివిధ బిజినెస్‌లను షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ కలిగి ఉన్న సంగతి తెలిసిందే. -
కొత్త సచివాలయ పనులు సీఎం కేసీఆర్ పరిశీలన
సాక్షి, హైదరాబాద్: అత్యాధునికంగా.. సకల సౌకర్యాలతో కొత్త సచివాలయ నిర్మాణం తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తోంది. దీనికి సంబంధించిన పనులను షాపూర్ పల్లోంజీ చేపడుతోంది. రూ.617 కోట్లతో చేపట్టిన ఈ నిర్మాణ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. అయితే ఈ పనులను మంగళవారం సీఎం కేసీఆర్ ఆకస్మికంగా పరిశీలించారు. గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న అనంతరం సీఎం కేసీఆర్ ట్యాంక్‌బండ్‌కు చేరుకుని సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో సచివాలయ నిర్మాణ పనులపై సీఎం కేసీఆర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. సచివాలయ నిర్మాణ పనులను అక్కడున్న సిబ్బందిని అడిగి కొన్ని సూచనలు చేశారు. త్వరితగతిన ఈ పనులను పూర్తి చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. -
కొత్త సచివాలయ టెండర్ షాపూర్జీ– పల్లోంజీకి?
సాక్షి, హైదరాబాద్: కొత్త సచివాలయాన్ని నిర్మించే అవకాశాన్ని దక్కించుకున్న సంస్థ పేరును గురువారం ప్రకటించనున్నారు. షాపూర్జీ– పల్లోంజీ, ఎల్ అండ్ టీ .. ఈ రెండు సంస్థలు మాత్రమే టెండర్లలో పాల్గొన్న విషయం తెలిసిందే. రోడ్లు, భవనాల శాఖ టెక్నికల్ బిడ్లను తెరిచి రెండు సంస్థలూ సాంకేతిక అర్హత సాధించినట్టు వెల్లడించింది. తదుపరి ఫైనాన్షియల్ బిడ్లను తెరిచేందుకుగాను టెండర్ వివరాలను కమిషనర్ ఆఫ్ టెండర్స్ (సీఓటీ)కు పంపారు. ప్రాజెక్టు వ్యయం (రూ.450 కోట్లకు పైగా) దృష్ట్యా టెండర్లను ఆమోదించే అధికారం రోడ్లు, భవనాల శాఖకు ఉండదు. ఫైనాన్షియల్ బిడ్లను తెరిచి ఎల్1ను సీఓటీ ప్రకటించనుంది. అధికారికంగా గురువారం ప్రకటించనున్నప్పటికీ, షాపూర్జీ–పల్లోంజీ సంస్థనే తక్కువ కోట్ చేసి ఎల్1గా నిలిచిందన్న (టెండర్ దక్కించుకుందన్న) ప్రచారం అధికారవర్గాల్లో సాగుతోంది. దీనికి సంబంధించి రోడ్లు, భవనాల శాఖ అధికారులను ప్రశ్నించగా, వివరాలను గురువారం వెల్లడిస్తామని పేర్కొన్నారు. పది రోజుల్లో ఎల్1 సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోనుంది. ఏడాదిలో నిర్మాణం పూర్తి చేయాలన్న విషయాన్ని అందులో పేర్కొంటారు. -
స్టెర్లింగ్ విల్సన్ - 8 రోజుల్లో 45% అప్
ఇటీవల ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్న సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల ఈపీసీ కంపెనీ స్టెర్లింగ్ అండ్ విల్సన్ సోలార్ కౌంటర్‌కు డిమాండ్ కొనసాగుతోంది. దీంతో ఎన్ఎస్ఈలో ఈ షేరు ప్రస్తుతం 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ. 230 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 215 ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. గత 8 రోజుల్లో ఈ కౌంటర్ 44 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ కంపెనీ ఈ షేరు 2019 ఆగస్ట్‌లో లిస్టయ్యింది. షేరుకి రూ. 780 ధరలో పబ్లిక్ ఇష్యూ చేపట్టడం ద్వారా రూ. 3100 కోట్లు సమీకరించింది. ఇన్వెస్టర్ల రక్షణ నిమిత్తం స్టాక్ ఎక్స్ఛేంజీలు ఏర్పాటు చేసిన ఏఎస్ఎంలో భాగంగా ఈ కౌంటర్‌కు 5 శాతం సర్క్యూట్ బ్రేకర్‌ను విధించినట్లు నిపుణులు పేర్కొన్నారు. రూ. 750 కోట్ల ప్రాజెక్ట్ యూఎస్ అనుబంధ సంస్థ ద్వారా అమెరికాలో అతిపెద్ద సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు కాంట్రాక్ట్ పొందినట్లు గత వారాంతాన స్టెర్లింగ్ అండ్ విల్సన్ సోలార్ వెల్లడించింది. 9.9 కోట్ల డాలర్ల( దాదాపు రూ. 750 కోట్లు) విలువైన ఈ ఆర్డర్లో భాగంగా 194 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేయవలసి ఉన్నట్లు కంపెనీ తెలియజేసింది. 2020 నవంబర్ నుంచి ఏడాది కాలంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయవలసి ఉన్నట్లు వివరించింది. కాగా.. 2020 మార్చికల్లా కంపెనీ ఆర్డర్‌బుక్ విలువ వార్షిక ప్రాతిపదికన 15 శాతం పుంజుకుని రూ. 9048 కోట్లకు చేరింది. -
విశ్వనగరానికి రూ. 20 వేల కోట్లు
పెట్టుబడి పెట్టేందుకు షాపూర్జీ పల్లోంజీ కంపెనీ సంసిద్ధత సీఎంను కలసిన సంస్థ చైర్మన్ షాపూర్ మిస్త్రీ రోడ్లు, ఫ్లైఓవర్లు, సపరేటర్లు, భవనాలపై చర్చ మెదక్ జిల్లాలో రూ. 980 కోట్లతో ఫ్యాక్టరీ విస్తరణ: ఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రితో కంపెనీ సీఎండీ మమెన్ భేటీ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేసేందుకు బడా కాంట్రాక్టు కంపెనీ ముందుకొచ్చింది. నగరంలోని రోడ్లు, ఫ్లై ఓవర్లు, సపరేటర్లు, ఇతర నిర్మాణాలకు రూ. 20 వేల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు షాపూర్జీ పల్లోంజీ కంపెనీ ముందుకొచ్చింది. ఈ అంశంపై చర్చిం చేందుకు కంపెనీ చైర్మన్ షాపూర్ పి.మిస్త్రీ, ఎండీ సుబ్రమణ్యం తదితరులు గురువారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం కె.చంద్రశేఖర్‌రావును కలుసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక నిర్మాణాలు చేపట్టిన తాము రాష్ట్రాభివృద్ధిలో పాలుపంచుకునేందుకు సిద్ధం గా ఉన్నట్లు ఆకాంక్షను వెలిబుచ్చారు. రాష్ట్రం లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పారిశ్రామిక విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యను నివారించడానికి రూపొందించిన ప్రాజెక్టును ముఖ్యమంత్రి వారికి వివరించారు. రహదారుల విస్తరణ, ఫ్లైఓవర్లపై జంక్షన్ల వద్ద సపరేటర్ల ( వివిధ రోడ్లపైకి వెళ్లేందుకు వీలుగా రహదారులు) ఏర్పాటు, కొత్త సచివాలయం, అత్యాధునిక పోలీసు ప్రధాన కార్యాలయం, కళాభారతి తదితర నిర్మాణాలపై చర్చించారు. దీనిపై స్పందించిన కంపెనీ ప్రతినిధులు హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటామన్నారు. అంచనగా వీటికయ్యే రూ.20 వేల కోట్ల పెట్టుబడులు తామే సమకూర్చి ఈ నిర్మాణాలు చేపడతామని కంపెనీ చైర్మన్ షాపూర్ మిస్త్రీ సీఎంకు తెలిపారు. ై హెదరాబాద్లోని మూసీ నది పరీవాహక ప్రాంత అభివృద్ధి, నాలాల సక్రమ వినియోగం తదితర అంశాలు కూడా వీరి భేటీలో చర్చకు వచ్చాయి. వీటిని కూడా త్వరలోనే చేపట్టాలని నిర్ణయించారు. త్వరలోనే ఆ కంపెనీ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఇందుకు సంబంధించి చర్చలు జరపనున్నారు. ఈ సమావేశంలో ఎం పీలు జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, మున్సిపల్‌శాఖ కార్యదర్శి ఎంజీ గోపాల్, హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. త్వరలోఅత్యుత్తమ పారిశ్రామిక విధానం మెదక్ జిల్లా సదాశివపేట మండలం అంకంపల్లి గ్రామంలో ఉన్న టైర్ల ఫ్యాక్టరీని రూ. 980 కోట్ల పెట్టుబడితో విస్తరించనున్నట్లు ఎంఆర్ఎఫ్ కంపెనీ తెలిపింది. దీంతో మరో 905 మందికి ఉద్యోగ అవకాశం లభిస్తుందని పేర్కొంది. గురువారం క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్‌ను కలసిన ఆ కంపెనీ సీఎండీ కేఎం మమెన్, సీనియర్ జనరల్ మేనేజర్ ఐజాక్ తంబురాజ్లు ఫ్యాక్టరీ విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలను వివరించారు. ప్రస్తుతమున్న ఫ్యాక్టరీ 1990 నుంచి నడుస్తోందని...రూ. 4,300 కోట్ల వార్షిక టర్నోవర్‌తో 6,500 మంది ఉద్యోగులు అందులో పని చేస్తున్నారని చెప్పారు. దీనిపై సీఎం స్పందిస్తూ ఫ్యాక్టరీ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని హామీ ఇచ్చారు. దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని రాష్ట్రంలో అమలు చేస్తామని, త్వరలోనే పారిశ్రామికవేత్తలతో సమావేశమై విధాన ప్రకటన చేస్తామన్నారు. పరిశ్రమల స్థాపనను రాష్ట్ర ప్రభుత్వం ఒక హక్కుగా గుర్తిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో పరిశ్రమలకు నిరంతర విద్యుత్, అవసరానికి తగ్గట్లు నీటి సరఫరా చేస్తామన్నారు. విద్యుత్ కొరత నివారణకు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిచ్చాయని.. భవిష్యత్తులో రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండవన్నారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలోని అన్ని పరిశ్రమలకు కావల్సినంత నీరు కూడా అందుతుందని వెల్లడించారు. రాష్ట్రంలో విద్యుత్ కోత లేకుండా చేసినందుకు సీఎంకు సంస్థ ప్రతినిధులు అభినందనలు తెలిపారు. ఈ భేటీలో పరిశ్రమలశాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర తదితరులు పాల్గొన్నారు.