95 శాతానికి రూ. 1,349 కోట్లు
షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్, ఒరిస్సా స్టీవ్‌డోర్స్ నుంచి కొనుగోలు
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం అదానీ గ్రూప్ ఖాతాలోకి మరో పోర్టు వచ్చి చేరనుంది. గ్రూప్‌లో భాగమైన అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ సంస్థ (ఏపీసెజ్) తాజాగా ఒడిశాలోని గోపాల్‌పూర్ పోర్టును (జీపీఎల్) దక్కించుకోనుంది. ఇందుకోసం జీపీఎల్‌లో షాపూర్‌జీ పల్లోంజీ (ఎస్‌పీ) గ్రూప్, ఒడిశా స్టీవ్‌డోర్స్ లిమిటెడ్ (ఓఎస్‌ఎల్) నుంచి 95 శాతం వాటాలను రూ. 1,349 కోట్లకు కొనుగోలు చేయనుంది. జీపీఎల్‌లో ఎస్‌పీ పోర్ట్ మెయింటెనెన్స్‌కి 56 శాతం, ఓఎస్‌ఎల్‌కి 44 శాతం వాటాలు ఉన్నాయి. ఇందులో ఎస్‌పీ గ్రూప్ వాటాలను పూర్తిగా, ఓఎస్‌ఎల్ నుంచి 39 శాతం వాటాలను ఏపీసెజ్ కొనుగోలు చేయనుంది.
ఓఎస్‌ఎల్ 5 శాతం వాటాతో జాయింట్ వెంచర్ భాగస్వామిగా కొనసాగనుంది. రూ. 3,080 కోట్ల ఎంటర్‌ప్రైజ్ విలువతో 95 శాతం వాటాను రూ. 1,349 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు ఏపీసెజ్ తెలిపింది. నిర్దిష్ట మైలురాళ్లను అధిగమించాకా 5.5 ఏళ్ల తర్వాత మరో రూ. 270 కోట్లు చెల్లించే ప్రాతిపదికన ఈ డీల్ ఉంటుందని పేర్కొంది. దీంతో ఎంటర్‌ప్రైజ్ విలువను రూ. 3,350 కోట్లుగా లెక్కగట్టినట్లవుతుంది. గోపాల్‌పూర్ పోర్టు కొనుగోలుతో తమ కస్టమర్లకు మరింతగా సమగ్రమైన సేవలు అందించేందుకు వీలవుతుందని ఏపీసెజ్ ఎండీ కరణ్ అదానీ తెలిపారు. దీనితో ఒడిశాలోని మైనింగ్ హబ్‌లు, పొరుగు రాష్ట్రాలు అందుబాటులోకి రాగలవని, తద్వారా మారుమూల ప్రాంతాలకు కూడా తమ లాజిస్టిక్స్ సేవలను విస్తరించడానికి వీలవుతుందని పేర్కొన్నారు. ఏపీసెజ్‌కి ప్రస్తుతం తూర్పు, పశ్చిమ తీరాల్లో పద్నాలుగు పోర్టులు, టెర్మినల్స్ ఉన్నాయి.
20 మిలియన్ టన్నుల సామర్థ్యం..
ఒరిస్సాలోని గంజాం జిల్లాలో 20 మిలియన్ టన్నుల వార్షిక సామర్ధ్యంతో గోపాల్‌పూర్ పోర్టు పని చేస్తోంది. ఇనుప ఖనిజం, బొగ్గు, అల్యూమినా మొదలైన కార్గోను హ్యాండిల్ చేస్తోంది. ఇటీవలే ఇది ఎల్‌ఎన్‌జీ రీగ్యాసిఫికేషన్ టెరి్మనల్‌ను నెలకొల్పేందుకు పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. 2024 ఆర్థిక సంవత్సరంలో జీపీఎల్ 11.3 మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ ద్వారా రూ. 520 కోట్ల ఆదాయం ఆర్జించవచ్చని అంచనాలు ఉన్నాయి.
అసెట్ మానిటైజేషన్‌పై ఎస్‌పీ దృష్టి..
రూ. 20,000 కోట్ల రుణభారాన్ని తగ్గించుకునే దిశగా ఎస్‌పీ గ్రూప్ గత కొన్నాళ్లుగా అసెట్ మానిటైజేషన్ (ఆస్తులను విక్రయించడం లేదా, లీజుకివ్వడం ద్వారా నిధులు సమకూర్చుకోవడం)పై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా గతంలో మహారాష్ట్రలోని ధరమ్‌తార్ పోర్టును రూ. 710 కోట్ల విలువకు జేఎస్‌డబ్ల్యూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థకి విక్రయించింది. 2015లో దీన్ని కొనుగోలు చేసిన ఎస్‌పీ గ్రూప్.. ఆ తర్వాత కార్యకలాపాలను టర్న్‌అరౌండ్ చేయగలిగింది. వార్షిక సామర్థ్యాన్ని 1 ఎంటీపీఏ నుంచి 5 ఎంటీపీఏకి పెంచింది. ఇక గోపాల్‌పూర్ పోర్టు ఒప్పందం గత కొద్ది నెలల్లో రెండో డీల్. రెండు పోర్టులను గణనీయమైన విలువకు విక్రయించడమనేది అసెట్స్‌ను టర్న్‌అరౌండ్ చేయడంలోను, స్వల్పకాలంలోనే వాటాదారులకు మెరుగైన రాబడులు అందించడంలోనూ తమకు గల సామర్థ్యానికి నిదర్శనమని ఎస్‌పీ గ్రూప్ ప్రతినిధి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment