ముడుపులివ్వకపోతే మూడినట్లే!.. | Chandrababu threatened construction companies in Amaravati | Sakshi
Sakshi News home page

ముడుపులివ్వకపోతే మూడినట్లే!

Published Sun, Sep 3 2023 4:57 AM | Last Updated on Sun, Sep 3 2023 10:57 AM

Chandrababu threatened construction companies in Amaravati - Sakshi

సాక్షి, అమరావతి: ‘‘అమరావతిలో రాజధాని భవనాల నిర్మాణ పనుల సమయంలో షాపూర్జీ పల్లోంజీ సంస్థ తరఫున నేను చాలాసార్లు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సమావేశమయ్యేవాడిని. ఇలా కలుస్తున్న సమయంలో ఒక­సారి ఆయన తన పీఏ పెండ్యాల శ్రీనివాస్‌ను పరిచయం చేశారు. ఇక నుంచి శ్రీనివాస్‌ చెప్పి­నట్లుగా నడుచుకోవాలని నన్ను ఆదేశించారు’’ అని ఆదాయపు పన్ను శాఖకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో మనోజ్‌ వాసుదేవ్‌ పార్థసాని వెల్లడించాడు.

తదనంతరం పీఏ శ్రీనివాస్‌ చంద్రబాబు నాయుడికి ముడుపులు ఏ రూపంలో ఎలా ఇవ్వాలో చెప్పేవారని, లేకపోతే తమ బి­ల్లు­లు పాస్‌ చెయ్యకుండా పెండింగ్‌లో పెట్టేవారని, చేసేదేమీ లేక చంద్రబాబుకు వందల కోట్ల రూపాయలు ముడుపులుగా ఇచ్చామని మనోజ్‌ పార్థసాని ఐటీ శాఖకు స్పష్టంగా చెప్పటంతో... రాజధానిలో తాత్కాలిక భవనాలను నిర్మిస్తున్నామనే ముసుగులో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాగించిన ముడుపుల దందా స్పష్టంగా బయటపడింది. కాంట్రాక్టు సంస్థలను బెదిరించి వాటి నుంచి వందల కోట్ల ముడుపులను షెల్‌ కంపెనీల ద్వారా చంద్రబాబు నాయుడు ఎలా తన జేబులో వేసుకున్నారో ఐటీ శాఖ సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టింది.  

మనోజ్‌ పార్థసానికి చెందిన కార్యాలయాలపై 2019లో సోదాలు జరిపిన ఐటీ శాఖ.... అదే ఏడాది నవంబరు 1, 5 తేదీల్లో ఆయన్ను విచారించి ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసింది. తదనంతరం ఆయన చెప్పిన వివరాల ఆధారంగా 2020లో చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్‌ ఇల్లు, కార్యాలయాల్లో కూడా సోదాలు జరిపింది. అందులో చంద్రబాబు పాత్రను నిర్ధారించే పలు కీలక డాక్యుమెంట్లు దొరకటంతో... అలా ముడుపుల రూపంలో అందిన మొత్తాన్ని బయటకు వెల్లడించకుండా దాచిన అక్రమ ఆదాయంగా ఎందుకు పరిగణించకూడదో చెప్పాలంటూ చంద్రబాబు నాయుడుకు నోటీసులిచ్చింది.

నాకు నోటీసులిచ్చే అధికారం మీకు లేదంటూ చంద్రబాబు ఎదురు తిరగటంతో... ఐటీ శాఖ తాజాగా వివిధ చట్టాలను ఉటంకిస్తూ చంద్రబాబుకు మళ్లీ నోటీసులిచ్చింది. ఆ నోటీసులతో పాటు మనోజ్‌ పార్థసాని ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను కూడా జత చేయటంతో చంద్రబాబు సాగించిన ముడుపుల దందా కళ్లకు కట్టినట్లు బయటపడింది. దీంతోపాటు అక్రమంగా రూ.118.98 కోట్లు చంద్రబాబు సొంత ఖాతాల్లోకి ఎలా చేరాయన్న విషయాన్ని ఐటీ శాఖ స్పష్టంగా ఓ పట్టిక రూపంలో వివరించింది. ఇంత స్పష్టమైన ఆధారాలున్నాయి కనక దీన్ని చంద్రబాబు సంపాదించిన అక్రమ ఆదాయంగా ఎందుకు పరిగణించకూడదో చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది.  

మనోజ్‌ పార్థసాని ఏం చెప్పారంటే... 
మనోజ్‌ పార్థసాని కార్యాలయంలో సోదాల అనంతరం ఆయన్ను ఐటీ శాఖ కొన్ని ప్రశ్నలడిగింది. దానికి ఆయనిచ్చిన సమాధానాలను రికార్డు చేసింది. ఆ ప్రశ్న జవాబులు ఎలా సాగాయంటే... 

ఐటీ శాఖ 
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మీరు తరచూ కలిసేవారా? ఎక్కడ? ఏం మాట్లాడుకునేవారు? 
ఎంవీపీ 
రాజధాని తాత్కాలిక భవనాల నిర్మాణ పనులు షాపుర్జీ పల్లోంజీ సంస్థకు దక్కాయి. ఆ సమయంలో అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడిని పలు సమావేశాలు, ప్రజంటేషన్ల సమయంలో కలిశాను. ఏపీ టిడ్కో ఇళ్ల నిర్మాణం (2017లో షాపూర్జీ పల్లోంజీ 1.40 లక్షల ఇళ్లను నిర్మించే కాంట్రాక్టును దక్కించుకుంటే 2019 మార్చి నాటికి కేవలం 23వేల ఇళ్ల నిర్మాణాన్నే పూర్తి చేసింది) ఈడబ్ల్యూఎస్‌ హౌసింగ్, హైకోర్టు నిర్మాణం, అమరావతి రాజధాని ప్రాంతంలో ఇతర విభాగాధిపతులు కార్యాలయాల నిర్మాణాల సమయంలో చంద్రబాబును పలు సందర్భాల్లో కలిశా.

ఇవి పూర్తిగా ప్రభుత్వం నిర్వహించిన సమావేశాలు. ఏపీటిడ్కో, ఏపీ సీఆర్‌డీఏ వాళ్లు నిర్వహించే ఈ సమావేశాలకు షాపూర్జీ పల్లోంజీ ప్రతినిధులతో కలిసి నేను హాజరయ్యాను.చంద్రబాబు నాయుడిని తొలిసారిగా వ్యక్తిగతంగా కలిసినప్పుడు... ఆయన 2019, ఫిబ్రవరిలో విజయవాడలోని తన ఇంటికి వచ్చి కలవాలని చెప్పారు. ఆయన చెప్పిన ప్రకారం ఆయన ఇంటికి వెళ్లా. అక్కడకు వెళ్లి కలిసినపుడు రాజధానిలో జరుగుతున్న వివిధ నిర్మాణ పనుల స్థితి గతులను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు తన వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్‌ను నాకు పరిచయం చేశారు. ఆయన చెప్పినట్టుగా నడుచుకోవాలని ఆదేశించారు. 

రూ.118 కోట్లకు లెక్కల్లేవని చంద్రబాబుకు ఐటీ జారీ చేసిన నోటీసుల్లో ఒక భాగం 

ఐటీ శాఖ
చంద్రబాబు నాయుడు తరఫున శ్రీనివాస్‌ మీకు ఎలాంటి సూచనలిచ్చారు? 
ఎంవీపీ 
శ్రీనివాస్‌ నాకు కొన్ని కంపెనీల జాబితాను పంపిస్తానని చెప్పాడు. ఆ కంపెనీల ద్వారా ముడుపులు తరలించాలని చెప్పారు. శ్రీనివాస్‌ ఆదేశాల మేరకు సబ్‌ కాంట్రాక్టు పనులు పొందిన విక్కీజైన్‌ అనే వ్యక్తి టచ్‌లోకి వచ్చారు. విక్కీ జైన్‌ నయోలిన్, ఎవరెట్‌ అనే కంపెనీల పేర్లను ఇచ్చారు. శ్రీనివాస్‌ ఆదేశాల మేరకు మార్చి, 2019లో నన్ను విజయ్‌ నంగాలియా అనే వ్యక్తి కలిశారు. ముంబై కొలాబాలో ఉన్న షాపూర్జీ పల్లోంజీ ఆఫీసు బయట ఆయన నన్ను కలిశారు. నంగాలియా, హయగ్రీవ, అన్నై, షలాక కంపెనీలకు సబ్‌ కాంట్రాక్టు రూపంలో వర్క్‌ ఆర్డర్ల పేరిట ముడుపుల నగదు తరలించాల్సిందిగా సూచించారు.

ఇలా తరలించిన నగదును విక్కి, వినయ్‌ నంగాలియాలు చంద్రబాబు నాయుడు ఎక్కడకు చేరవేయమంటే అక్కడకు చేరవేసేవారు. ఈ కంపెనీల్లోకి ఇంకా బోలెడంత నగదు వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చింది? దాన్ని ఎక్కడకు తరలించారన్న సంగతులు నాకు తెలియవు. ఎందుకంటే కేవలం షాపూర్జీ పల్లోంజీ కంపెనీ నుంచి జరిగిన చెల్లింపుల వరకే నాకు తెలుసు. ఆ విషయం నాకు తెలుసు కనక దాన్ని శ్రీనివాస్‌కు చెప్పి... ఆ మొత్తం చంద్రబాబుకు చేరిందా లేదా అన్న విషయాన్ని కనుక్కునేవాడిని.  


ఐటీ శాఖ
చంద్రబాబు నాయుడు, శ్రీనివాస్‌ చెప్పినంత మాత్రాన బోగస్‌ ఇన్వాయిస్‌ల ద్వారా నగదు తరలించడం తప్పు కదా? దాన్ని మీరు ఎందుకు వ్యతిరేకించలేదు? 
ఎంవీపీ 
శ్రీనివాస్‌ ఈ కంపెనీల ద్వారా బోగస్‌ బిల్లులతో నగదు తరలించాలని చేసిన ప్రతిపాదనను మొదట్లో నేను వ్యతిరేకించాను. షాపూర్జీ పల్లోంజి అనేది అతిపెద్ద కార్పొరేట్‌ సంస్థ అని, అవసరమైతే వాళ్లు అడిగిన మొత్తాన్ని నేరుగా పార్టీ ఫండ్‌ రూపంలోనే చెల్లిస్తుందని చెప్పాను. అప్పుడు వాళ్లు చాలా స్పష్టంగా చెప్పారు... ‘‘ఇది పార్టీ ఫండ్‌ కాదు. ఈ కంపెనీల ద్వారా మేం చెప్పిన వ్యక్తులకు నేరుగా నగదును తరలించాల్సిందే.

ఒకవేళ మీరు గనక మా ఆదేశాలు పాటించకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని. నిజానికి అప్పటికే మేం రాజధానిలో చాలా ప్రాజెక్టుల్లో ఇరుక్కుపోయి ఉన్నాం. నడుస్తున్న అనేక ప్రాజెక్టులతో భారీగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్లు చెప్పినట్లుగా వినటం తప్ప మాకు వేరే దారి కనిపించలేదు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement