తిరుపతి ఐఐడీటీలో రొబోటిక్స్ విభాగం
సీఎం చంద్రబాబుకు టెక్ మహీంద్రా సీఈవో హామీ
సాక్షి, విజయవాడ బ్యూరో: తిరుపతిలో ఏర్పాటుచేయనున్న ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్(ఐఐడీటీ)లో ‘సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ రొబోటిక్స్ అండ్ ఎనలిటిక్స్’ విభాగం ఏర్పాటు చేయడానికి టెక్ మహీంద్రా సీఈఓ సీసీ గుర్నానీ అంగీకరించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. సోమవారం క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబుతో జరిగిన సమావేశంలో గుర్నానీ ఇందుకు అంగీకరించినట్లు పేర్కొంది. దీంతోపాటు రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని టెక్‌మహీంద్రా తరఫున హామీ లభించినట్లు వెల్లడించింది.
అలాగే విశాఖ టెక్ మహీంద్రా ఫెసిలిటీ సెంటర్‌లో మరో వెయ్యి మందికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు అంగీకరించినట్లు వివరించింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని గుర్నానీని కోరినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కోర్ టీమ్ సలహాదారుల్లో ఒకరుగా సేవలందించేందుకు గుర్నానీ అంగీకరించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఐటీ సలహాదారు జేఏ చౌదరి, టెక్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఏఎస్ సత్యమూర్తి పాల్గొన్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.