ఐటీకి ఆద్యుడని చెప్పుకున్న బాబు హయాంలో ఒక్క కంపెనీ అయినా వచ్చిందా?
ఆ విషయం తెలిసినా వాస్తవం రాయలేని రామోజీ
రాష్ట్రంలో సత్ఫలితాలిస్తున్న జగన్ ఐటీ పాలసీ
ఐదేళ్లలో ఇన్ఫోసిస్, రాండ్‌స్టాండ్, బీఈఎల్ వంటి దిగ్గజ సంస్థల రాక
గత ఐదేళ్లలో కొత్తగా పెరిగిన 75,551 మంది ఐటీ ఉద్యోగులు
చంద్రబాబు హయాంలో ఏమీ సాధించలేకున్నా... ప్రగతి పరుగులు తీసిందంటూ తప్పుడు రాతలు. పరిస్థితులు దిగజారినా... రాష్ట్రం పురోగమిస్తుందంటూ అడ్డగోలు అబద్ధాలు. ఐటీ కంపెనీ ఒక్కటైనా తీసుకురాలేకపోయినా... ఏదో సాధించారంటూనిస్సిగ్గుగా కితాబులు. ఇదీ పచ్చముసుగు వేసుకున్న రామోజీ పత్రికలో నిత్యం అచ్చవుతున్న అసత్య కథనాల తీరు. అదే జగన్ హయాంలో ఎంత ఉన్నతంగా ఎదిగినా... ఏమీలేదంటూ కబోది వ్యాఖ్యానాలు.
కళ్లముందే దానికి సంబంధించిన రుజువులున్నా... దాచిపెట్టి అడ్డగోలు రోతలు. అవాస్తవాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తూ... జనానికి ఏమీ తెలియదులే అన్న అహంకార ధోరణి. ఇదీ రోజూ ఈనాడులో వండివారుస్తున్న అబద్ధాలు. గడచిన ఐదేళ్లలో ఐటీరంగం రాష్ట్రంలో అభివృద్ధి సాధిస్తే ‘కల్పతరువును కాలదన్నారు’ అంటూ అభాండాలు వేసేశారు. వాస్తవాలేమిటో ఒక్కసారి పరిశీలిద్దాం...
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తరువాత రాష్ట్రంలో మునుపెన్నడూ లేనివిధంగా ఐటీ రంగం వేగంగా విస్తరిస్తోంది. కరోనా వంటి విపత్కర పరిస్ధితుల్లో అంతర్జాతీయంగా ఐటీ రంగం కుదేలైనా రాష్ట్రంలో ఆ సమస్య ఎదురుకాలేదు. బహుళజాతి సంస్థలైన ఇన్ఫోసిస్,విప్రో,భారత్ ఎల్రక్టానిక్స్ లిమిటెడ్ వంటి సంస్థలు విశాఖలో డెవలప్‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయగా, రాండ్‌స్టాండ్ వంటి అంతర్జాతీయ సంస్థలు విశాఖ కేంద్రంగా కార్యకలాపాలను ప్రారంభించాయి.
రాష్ట్రానికి 65కు పైగా కొత్త కంపెనీలు రాగా విశాఖలో డబ్ల్యూఎన్‌ఎస్, పల్సస్ గ్రూపులు భారీగా విస్తరించాయి. టెక్ మహీంద్రా విశాఖ నుంచి తన కార్యకలాపాలను విజయవాడకు విస్తరించింది. ‘ఐటీకి పితామహుడిని నేనే... సైబర్‌బాద్‌ను నేనే సృష్టించా...’ అని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు పాలనలో విశాఖకు వచ్చిన ఐటీ దిగ్గజం ఒక్కటంటే ఒక్కటైనా లేదు. ఆయన సీఎం పదవి ముగిసేనాటికి రాష్ట్రంలో ఐటీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 27,643 అయితే ఇప్పు డు ఆ సంఖ్య 75,551కు చేరింది.
చంద్రబాబు దిగిపోయే నాటికి ఉన్న ఐటీ ఉద్యోగుల్లో సగంమందికి పైగా దివంగత నేత ముందుచూపుతో విశాఖ, కాకినాడ, విజయవాడల్లో అభివృద్ధి చేసిన∙ఐటీ పార్కుల్లో పనిచేస్తున్నవారే. కానీ ప్రస్తుత వైఎస్ జగన్ హయాంలో ఐటీ రంగంలో 47,908 మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు లభించినా కళ్లకు గంతలు కట్టుకున్న రామోజీకి అవేవీ కనిపించడం లేదు. పైగా ప్రజలను తప్పుదారి పట్టించేలా ఐటీ పాలసీ తుస్ అంటూ గురువారం ఒక అబద్ధాన్ని వండివార్చారు.
తెలంగాణతో పోలికెందుకు రామోజీ...
2014–19 మధ్య చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్రానికి తీసుకువచ్చిన ఒక్క కంపెనీ పేరు కూడా ఆ కథనంలో రాసుకోలేకపోయారు. ఎంతసేపూ ప్రస్తుత ప్రభుత్వంపై విషం చిమ్మాలన్నదే వారి దుగ్ధ. అందుకే పొరుగు రాష్ట్రం తెలంగాణతో పోలుస్తూ అబద్దాలు అచ్చేశారు. బాబు పాలనలో తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ వెనుకబడి ఉంటే ఆయన ఎందుకు ఉద్ధరించడానికి కృషి చేయలేదు? ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్లు పాలించిన చంద్రబాబు నాయుడు వల్లే కదా విశాఖ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది.
తన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కేవలం హైదరాబాద్‌ను మాత్రమే ప్రోత్సహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలువునా ముంచేసిన విషయం రాష్ట్ర ప్రజలు మరచిపోయారనుకుంటున్నారా? రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా కేవలం అమరావతి పేరుతో గ్రాఫిక్స్ చూపించి ఐటీ రంగాభివృద్ధిని గాలికి వదిలేసిన విషయం ఇక్కడి యువత గమనించలేదనుకుంటున్నారా? పైగా ఇప్పుడు ఐటీ రంగంలో విశాఖ పురోగమిస్తుంటే తప్పుడు కథనాలతో జనాన్ని ఏమార్చడానికి యత్నిస్తారా?
నాడు ప్రచారం... నేడు ప్రోత్సాహం...
చంద్రబాబు ప్రభుత్వం కేవలం ఇంక్యుబేషన్ సెంటర్ పేరుతో ప్రచారానికే పరిమితం చేసి స్టార్టప్‌లలో రాష్ట్రం చతికిలబడితే వైఎస్ జగన్ ప్రభుత్వం స్టార్టప్‌ల ప్రోత్సాహానికి అనేక చర్యలు చేపట్టింది. స్టార్టప్‌లకు మెంటార్‌షిప్, ఫండింగ్, ఇండస్ట్రీ కనెక్ట్‌లతో పాటు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే విధంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసింది. దేశంలో ఎక్కడా లేని విధంగా తొలి నాలుగో తరం పారిశ్రామిక రంగం ఇండస్ట్రీ 4కు చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని ‘‘కల్పతరువు’’ పేరిట విశాఖలో ఏర్పాటు చేసింది.
దీంతోపాటు నాస్కామ్ సహాయంతో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐవోటీ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాల స్టార్టప్‌ల కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలను కూడా విశాఖలో ఏర్పాటు చేసింది. ఆంధ్రా యూనివర్సిటీలో ఓ హబ్, ఓడల నిర్మాణంపైన, మెడ్‌టెక్ జోన్‌లోనూ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలు ఏర్పాటు చేసింది. ఈ విధంగా ఐటీ రంగంలో విశాఖను కల్పతరువుగా మార్చేలా ప్రభు త్వం చర్యలు తీసుకుంటే యువతను నైరాశ్యంలో నెట్టివేసేలా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈనాడు రామోజీ రాస్తున్న తప్పుడు రాతలను ప్రజలు గమనిస్తున్నారు.
మూడు రెట్లు పెరిగిన స్టార్టప్‌ల సంఖ్య
నూతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకువస్తూ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీల ఏర్పాటుతో రాష్ట్రంలో స్టార్టప్‌ల సంఖ్య భారీగా పెరిగింది. వీటి ద్వారా సాంకేతిక నిపుణులైన యువత స్వయం ఉపాధి పొందడమే గాకుండా, వేలాది మందికి ఉద్యోగాలూ వస్తున్నాయి.
గడచిన ఐదేళ్లలో రాష్ట్రంలో స్టార్టప్‌ల సంఖ్య మూడు రెట్లకు పైగా పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వరంగ డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్(డీపీఐఐటీ) గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. ఆ సంస్థ తాజా గణాంకాల ప్రకారం.. 2019లో రాష్ట్రంలో 161 స్టార్టప్‌లు ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 586కు పెరిగింది. వీటిలో పనిచేసే ప్రత్యక్ష ఉద్యోగుల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరిగింది. 2019లో 1,552 మంది పనిచేస్తుండగా, ఆ సంఖ్య ఇప్పుడు 5,669కు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment