విశ్వనగరానికి రూ. 20 వేల కోట్లు
- పెట్టుబడి పెట్టేందుకు షాపూర్‌జీ పల్లోంజీ కంపెనీ సంసిద్ధత
- సీఎంను కలసిన సంస్థ చైర్మన్ షాపూర్ మిస్త్రీ
- రోడ్లు, ఫ్లైఓవర్లు, సపరేటర్లు, భవనాలపై చర్చ
- మెదక్ జిల్లాలో రూ. 980 కోట్లతో ఫ్యాక్టరీ విస్తరణ: ఎంఆర్‌ఎఫ్
- ముఖ్యమంత్రితో కంపెనీ సీఎండీ మమెన్ భేటీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేసేందుకు బడా కాంట్రాక్టు కంపెనీ ముందుకొచ్చింది. నగరంలోని రోడ్లు, ఫ్లై ఓవర్లు, సపరేటర్లు, ఇతర నిర్మాణాలకు రూ. 20 వేల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు షాపూర్‌జీ పల్లోంజీ కంపెనీ ముందుకొచ్చింది. ఈ అంశంపై చర్చిం చేందుకు కంపెనీ చైర్మన్ షాపూర్ పి.మిస్త్రీ, ఎండీ సుబ్రమణ్యం తదితరులు గురువారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం కె.చంద్రశేఖర్‌రావును కలుసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక నిర్మాణాలు చేపట్టిన తాము రాష్ట్రాభివృద్ధిలో పాలుపంచుకునేందుకు సిద్ధం గా ఉన్నట్లు ఆకాంక్షను వెలిబుచ్చారు. రాష్ట్రం లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పారిశ్రామిక విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యను నివారించడానికి రూపొందించిన ప్రాజెక్టును ముఖ్యమంత్రి వారికి వివరించారు. రహదారుల విస్తరణ, ఫ్లైఓవర్‌లపై జంక్షన్ల వద్ద సపరేటర్ల ( వివిధ రోడ్లపైకి వెళ్లేందుకు వీలుగా రహదారులు) ఏర్పాటు, కొత్త సచివాలయం, అత్యాధునిక పోలీసు ప్రధాన కార్యాలయం, కళాభారతి తదితర నిర్మాణాలపై చర్చించారు. దీనిపై స్పందించిన కంపెనీ ప్రతినిధులు హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటామన్నారు. అంచనగా వీటికయ్యే రూ.20 వేల కోట్ల పెట్టుబడులు తామే సమకూర్చి ఈ నిర్మాణాలు చేపడతామని కంపెనీ చైర్మన్ షాపూర్ మిస్త్రీ సీఎంకు తెలిపారు. ై
హెదరాబాద్‌లోని మూసీ నది పరీవాహక ప్రాంత అభివృద్ధి, నాలాల సక్రమ వినియోగం తదితర అంశాలు కూడా వీరి భేటీలో చర్చకు వచ్చాయి. వీటిని కూడా త్వరలోనే చేపట్టాలని నిర్ణయించారు. త్వరలోనే ఆ కంపెనీ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఇందుకు సంబంధించి చర్చలు జరపనున్నారు. ఈ సమావేశంలో ఎం పీలు జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, మున్సిపల్‌శాఖ కార్యదర్శి ఎంజీ గోపాల్, హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
త్వరలోఅత్యుత్తమ పారిశ్రామిక విధానం
మెదక్ జిల్లా సదాశివపేట మండలం అంకంపల్లి గ్రామంలో ఉన్న టైర్ల ఫ్యాక్టరీని రూ. 980 కోట్ల పెట్టుబడితో విస్తరించనున్నట్లు ఎంఆర్‌ఎఫ్ కంపెనీ తెలిపింది. దీంతో మరో 905 మందికి ఉద్యోగ అవకాశం లభిస్తుందని పేర్కొంది. గురువారం క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్‌ను కలసిన ఆ కంపెనీ సీఎండీ కేఎం మమెన్, సీనియర్ జనరల్ మేనేజర్ ఐజాక్ తంబురాజ్‌లు ఫ్యాక్టరీ విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలను వివరించారు. ప్రస్తుతమున్న ఫ్యాక్టరీ 1990 నుంచి నడుస్తోందని...రూ. 4,300 కోట్ల వార్షిక టర్నోవర్‌తో 6,500 మంది ఉద్యోగులు అందులో పని చేస్తున్నారని చెప్పారు. దీనిపై సీఎం స్పందిస్తూ ఫ్యాక్టరీ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని హామీ ఇచ్చారు.
దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని రాష్ట్రంలో అమలు చేస్తామని, త్వరలోనే పారిశ్రామికవేత్తలతో సమావేశమై విధాన ప్రకటన చేస్తామన్నారు. పరిశ్రమల స్థాపనను రాష్ట్ర ప్రభుత్వం ఒక హక్కుగా గుర్తిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో పరిశ్రమలకు నిరంతర విద్యుత్, అవసరానికి తగ్గట్లు నీటి సరఫరా చేస్తామన్నారు. విద్యుత్ కొరత నివారణకు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిచ్చాయని.. భవిష్యత్తులో రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండవన్నారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలోని అన్ని పరిశ్రమలకు కావల్సినంత నీరు కూడా అందుతుందని వెల్లడించారు. రాష్ట్రంలో విద్యుత్ కోత లేకుండా చేసినందుకు సీఎంకు సంస్థ ప్రతినిధులు అభినందనలు తెలిపారు. ఈ భేటీలో పరిశ్రమలశాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర తదితరులు పాల్గొన్నారు.