sharing husband
-
ఏవండీ.. ఆవిడొచ్చింది! అంటే చెల్లుతుందా?
సినిమా వేరు.. నిజ జీవితం వేరు. సినిమాల్లో మాదిరి చేద్దామనుకుంటే చట్టాలు తొక్కిపడేస్తాయి. కాదని ముందుకు వెళ్తే.. కఠిన చర్యలకు, శిక్షలకు దారి తీస్తాయి. అలా చట్టాన్ని పట్టించుకోకుండా ముందుకు అడుగేసిన ఇద్దరు భార్యల ముద్దుల మొగుడి వాస్తవ గాథే ఇది. ఈవీవీ డైరెక్షన్లో వచ్చిన ఏవండి.. ఆవిడవచ్చింది చిత్రం గుర్తుందా? అందులో ఇద్దరు పెళ్లాల ముద్దుల భర్తగా సోగ్గాడు శోభన్‌బాబు, భార్యలుగా వాణిశ్రీ, శారదలు ప్రేక్షకులను అలరించారు. వారంలో చెరో మూడు రోజులు భార్యల దగ్గర.. మరో రోజు ప్రశాంతంగా తల్లిదండ్రుల దగ్గర గడిపే వెసులుబాటు ఉంటుంది ఆ సినిమాలో హీరోకి. కానీ, రియల్ లైఫ్‌లో అలా చేస్తామంటే కుదురుతుందా? అలాంటి పరస్పర ఒప్పందాలు చట్టప్రకారం చెల్లుతాయా? గురుగ్రామ్‌కు చెందిన ఓ ఇంజినీర్.. 2018లో గ్వాలియర్‌కు చెందిన ఓ మహిళను పెళ్లాడాడు. రెండేళ్లు కాపురం చేశారు వాళ్లు. అయితే.. కరోనా టైంలో(2020లో) వైరస్ భయానికి ఆమెను పుట్టింటికి పంపాడు. అయితే వైరస్ ఉధృతి తగ్గాక మళ్లీ ఈమెను తీసుకెళ్లేందుకు పోనేపోలేదు ఆ వ్యక్తి. రెండేళ్లపాటు రకరకాల సాకులు చెబుతున్న భర్త తీరుపై ఆమెకు అనుమానం కలిగింది. ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఉన్నపళంగా ఒక్కతే గురుగ్రామ్‌కు వెళ్లింది. అలా వెళ్లిన ఆమెకు పెద్ద షాకే తగిలింది. కరోనా టైంలోనే ఆఫీస్‌లో ఓ కొలీగ్ అమ్మాయిని ప్రేమించి-పెళ్లి చేసుకోవడమే కాదు.. ఏకంగా ఆ టైంలో ఆమె ద్వారా ఓ బిడ్డను కూడా కనేశాడు ఆ ప్రబుద్దుడు. దీంతో ఆమె ఆఫీస్ వద్దే నిరసనకు దిగింది. ఆపై తనకు న్యాయం కావాలంటూ గ్వాలియర్‌లోని ఫ్యామిలీ కోర్టుకు ఆశ్రయించింది. దీంతో సమన్లు జారీ చేసిన ఫ్యామిలీ కోర్టు.. అతనికి కౌన్సెలింగ్ ఇచ్చేందుకు యత్నించింది. అయినా కూడా రెండో భార్యను విడిచిపెట్టేందుకు అతను ససేమీరా అన్నాడు. దీంతో.. ఈసారి ఆ ఇద్దరు భార్యలను కూర్చోపెట్టి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. కానీ, వాళ్లు కూడా పరిస్థితిని అర్థం చేసుకోలేదు. చివరికి.. ఆ ముగ్గురు ఓ అండర్‌స్టాండింగ్‌కు వచ్చారు. వారంలో మూడు రోజులు ఒకరి దగ్గర, మూడు రోజులు మరొకరి దగ్గర గడపడం.. మిగిలిన ఆదివారం ఒక్కరోజును ఆ భర్త ఛాయిస్‌కు వదిలేశారు. ఇక ఒప్పందంలో భాగంగా.. ఇద్దరికీ ఉండేందుకు చెరో ఫ్లాట్‌ను ఇవ్వడంతో పాటు జీతం చెరిసమానంగా పంచాలని నిర్ణయించుకున్నాడు. అయితే.. ఈ ఒప్పందం చట్టప్రకారం చెల్లుబాటు కాదంటున్నారు వాళ్లకు కౌన్సెలింగ్ నిర్వహించిన న్యాయవాది హరీష్ దివాన్. ఇది పరస్పర అంగీకారంతో ముగ్గురు చేసుకున్న ఒప్పందం. ఇందులో కోర్టు పాత్రగానీ, కౌన్సిలర్ ప్రమేయంగానీ ఏమీ లేదు. ఈ ముగ్గురు హిందువులు. హిందూ చట్టాల ప్రకారం.. ఇలాంటి ఒప్పందం చెల్లదు. చట్టం ప్రకారం.. ఒక హిందువు ఒక భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాతే మరోకావిడను వివాహం చేసుకుంటేనే చెల్లుతుంది. కానీ, వీళ్లు తమ మానానా తాము ఒప్పందం చేసుకున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే వాళ్ల మీద చర్యలు ఉండొచ్చు అని చెప్పారు. -
భర్తను పంచుకుంటేనే మంచిదట!
బహుభార్యత్వం.. అంటే ఒకే వ్యక్తి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందిని పెళ్లాడటం తప్పని అందరూ అంటుంటారు. కానీ, తాజాగా చేసిన పరిశోధనలో మాత్రం.. కొన్ని పరిస్థితులలో భర్తను పంచుకోవడం వల్ల మహిళలకు, వాళ్ల పిల్లలకు సంపద పెరుగుతోందట! ప్రపంచంలో చాలా దేశాలు బహుభార్యత్వాన్ని నిషేధించాయి. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్, మహిళా హక్కుల సంఘాలు కూడా ఇది మహిళల పట్ల వివక్షేనంటాయి. ఈ విషయాన్ని తేల్చేందుకు ఉత్తర టాంజానియాలోని 56 గ్రామాల్లో బహుభార్యత్వం ఉన్న కుటుంబాలు, అలాకాకుండా ఒక భర్త ఒకే భార్యతో ఉంటున్న కుటుంబాలపై పరిశోధన చేశారు. టాంజానియాలోని కొన్ని తెగలలో బహుభార్యత్వాన్ని అనుమతిస్తారు. ఇక్కడ ఒక భర్తకు ఒకే భార్య ఉన్న కుటుంబాల కంటే ఇద్దరు ముగ్గురు ఉన్న కుటుంబాల్లోనే తగినతం ఆహారం, ఆరోగ్యవంతులైన పిల్లలు ఉన్నారట. బహుభార్యత్వం ఉన్న కుటుంబాల్లో పశుసంపద కూడా బాగుందని, మామూలు వాళ్ల కంటే పెద్ద కమతాలలో వీళ్లు వ్యవసాయం చేస్తున్నారని తెలిసింది. అప్పటివరకు పెళ్లి చేసుకోకుండా, 3 ఆవులు, ఒక ఎకరం భూమి ఉన్నవాళ్ల కంటే.. 180 ఆవులు, బోలెడంత భూమితో పాటు కొందరు భార్యలు కూడా ఉన్న వ్యక్తిని ఎంచుకోవడం మేలని అక్కడి యువతులు భావిస్తున్నట్లు పరిశోధనలో పాల్గొన్న యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన మోనిక్ బోర్గెరాఫ్ మల్డర్ చెప్పారు. అయితే, ఈ విషయంలో స్థానిక పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని అంటున్నారు. వాటిని లెక్కలోకి తీసుకోకుండానే బహుభార్యత్వాన్ని నిషేధించడం వల్ల మహిళలకు ఉండే అవకాశాలు తగ్గిపోతాయని చెప్పారు. ఎంతమంది భాగస్వాములు ఉండొచ్చన్నది సమస్య కాదని, తాము కోరుకున్న నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ మహిళలకు ఉండాలని ఆమె స్పష్టం చేశారు. టాంజానియా లాంటి దేశాల్లో ఆహారభద్రత చాలా సమస్యగా ఉంది. ఇక్కడ పౌష్టికాహారం అందక చిన్నవయసులోనే పిల్లలు మరణిస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మాసాయ్ లాంటి తెగలలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. ఈ పరిశోధన వివరాలను నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్‌లో ప్రచురించారు.