ఝలక్: భర్తకు ముస్లిం మహిళ తలాఖ్!
లక్నో: భర్త పెట్టే చిత్రహింసలు తాళలేక ఓ ముస్లిం మహిళ తన భర్తకు విడాకులు ఇచ్చేందుకు తలాఖ్ చెప్పింది. సాధారణంగా ముస్లిం పురుషులు తమ భార్యలకు విడాకులు ఇచ్చేందుకు తలాఖ్ చెబుతుంటారు. అయితే ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో భార్య తలాఖ్ చెప్పిన విషయం శుక్రవారం వెలుగుచూసింది. పుట్టింటికి వచ్చి చాలా రోజులైన భర్త నుంచి ఎలాంటి సమాచారం లేదని, కనీసం తన కూతురు కోసమైనా మా పుట్టింటికి వచ్చి చూడలేదని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు మూడుసార్లు తలాఖ్ అనే పదాన్ని పలకడం ద్వారా ముస్లిం పురుషులు వైవాహిక బంధాన్ని తెంచేసుకునే పద్ధతిపై దాఖలైన పలు పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ప్రత్యేకంగా వేసవి సెలవులు కూడా రద్దు చేసుకుని పనిచేస్తోన్న విషయం తెలిసిందే.
ఆరేళ్ల కిందట తన వివాహం జరిగిందిని చెప్పిన మహిళ భర్త, వారి కుటుంసభ్యులు అదనపు కట్నం కోసం చిత్రహింసలు పెట్టేవారని వాపోయింది. కూతురు పుట్టిన తర్వాత నుంచి వేధింపులు మరింత తీవ్రమయ్యాయని, పాపను ఒకసారి కిడ్నాప్ కూడా చేశాడంటోంది. అత్తింటి వారి ఆగడాలను భరించలేక ఇటీవల పుట్టింటికి వెళ్లినట్లు జాతీయ మీడియాకు చెప్పింది. తాను, తన పాప బతికున్నామో లేదో కూడా భర్త వాకబు చేయకపోవడంపై కన్నీటి పర్యంతమైంది. అతడితో జీవించాల్సిన అక్కర్లేదని భావించడంతో తాను భర్తకు తలాఖ్ చెప్పినట్లు వివరించింది.
తనకు, తన భార్యకు పోషణ కోసం భర్త నుంచి నగదు(భరణం) ఇప్పించాలని కోర్టును ఆశ్రయిస్తానని చెప్పింది. షరియత్ చట్టాల ప్రకారం వివాహ సమయంలో చెప్పినట్లుగా చేశాను.. భార్యను, కుటుంబాన్ని పట్టించుకోని భర్త నుంచి విడిపోవడం సరైనదేని మత పెద్దలు చెప్పినట్లు గుర్తుచేసుకుంది. కట్నం కోసం వేదించిన వ్యక్తిపై ఐపీసీ 498 సెక్షన్ ప్రకారం ఫిర్యాదు చేసినట్లు బాధితురాలి తరఫు లాయర్ చెప్పారు. ఈ ఫిర్యాదుపై స్పందించి చట్టప్రకారం ఆమెకు న్యాయం చేయాలని, భర్త నుంచి పరిహారం ఇప్పించడం సబబేనని అభిప్రాయపడ్డారు.