Shashikala luxury affair
-
శశికళకు జైల్లో ప్రత్యేక మర్యాదలు
-
ఐదు గదులు... ప్రత్యేక కిచెన్
బెంగళూరు: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న అన్నా డీఎంకే మాజీ నాయకురాలు శశికళకు జైలులో ప్రత్యేక మర్యాదలు, సౌకర్యాలు కల్పించారని విచారణ కమిటీ తేల్చింది. ఆర్టీఐ కార్యకర్త నరసింహ మూర్తి దాఖలుచేసిన అర్జీకి ఈ మేరకు సమాధానం లభించింది. బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో శశికళకు ప్రత్యేక కిచెన్‌తో పాటు, ఐదు గదులు కల్పించారని అప్పటి డీఐజీ(జైళ్లు) డి. రూప ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలు నిజమేనని విచారణ జరిపిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వినయ్ కుమార్ కమిటీ నివేదిక ధ్రువీకరించింది. ఆర్టీఐ అర్జీ ద్వారా ఆ కమిటీ నివేదికను సంపాదించానని, శశికళకు ప్రత్యేక మర్యాదలు జరిగిన సంగతి నిజమేనని దీని ద్వారా తెలుస్తోందని నరసింహ మూర్తి చెప్పారు. కాగా ఈ పరిమాణంపై రూప స్పందిస్తూ..తాను ఆనాడు చెప్పిన విషయాల్నే విచారణ కమిటీ ధ్రువీకరించిందని పేర్కొన్నారు. వినయ్ కుమార్ తన నివేదికను 2017లో ప్రభుత్వానికి సమర్పించారు. జైలులో శశికళ తనకు నచ్చిన దుస్తులు ధరించి వంట చేసుకునేవారని, ఆమె సెల్లో సుగంధ ద్రవ్యాలు లభించాయని ఆ నివేదిక పేర్కొంది. జైలులో ఆమె స్వేచ్ఛగా సంచరించేవారని, తన సహచరిణి ఇళవరసితో కలసి బయటికి వెళ్తున్నట్లు వీడియోలో కనిపించిందని తెలిపింది. 2017 జూన్ 11న తెలుపు రంగు చొక్కా, ప్యాంటు ధరించిన ఓ వ్యక్తితో శశికళ సుమారు నాలుగు గంటలు మాట్లాడినట్లు పేర్కొంది. కానీ, ఆ వ్యక్తితో శశికళ 45 నిమిషాలే మాట్లాడినట్లు రిజిస్టర్లో నమోదైంది. -
పథకం ప్రకారం శశికళపై వల
♦ జైల్లో లగ్జరీ వ్యవహారం కేంద్రానికి ఏప్రిల్‌లోనే తెలుసు ♦ సీసీ టీవీ పుటేజీలకు సహకరించిన ఖైదీలు ♦ మాజీ డీజీపీకి రూ.2 కోట్ల ముడుపుల వ్యవహారం సాక్షి ప్రతినిధి, చెన్నై: బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో సాధారణ ఖైదీ శశికళ అసాధారణ సౌకర్యాలను అనుభవిస్తున్నట్లు జైళ్లశాఖ (మాజీ) డీఐజీ రూప కనుగొన్నారు. ఈ బాగోతం వెనుక రూ.2 కోట్లు చేతులు మారినట్లు నిర్ధారించుకుని లోకాయుక్తకు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం బట్టబయలైంది. అయితే శశికళ చిక్కుకోక ముందే కర్ణాటక హోంశాఖ మాజీ మంత్రి పరమేశ్వర్ సహాయకుడు ప్రకాష్ ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలమే ప్రధాన కారణం. అన్నాడీఎంకే రెండాకుల చిహ్నం పొందడం కోసం ఎన్నికల కమిషన్‌కు పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ రూ.50 కోట్లు ఎరవేసే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించి బ్రోకర్ సుకేష్‌కు రూ.10 కోట్లు అడ్వాన్సుగా ఇచ్చారు. ఈ కేసులో బెంగళూరుకు చెందిన సుకేష్ అనే బ్రోకరు ఢిల్లీలో క్రైం బ్రాంచ్ పోలీసులకు పట్టుబడ్డాడు. సుకేష్ వాగ్మూలంతో దినకరన్, ఆయన స్నేహితుడు బెంగళూరుకు చెందిన మల్లికార్జున్లను ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌చేశారు. మల్లికార్జున్‌తో జరిపిన విచారణలో అతను హోంశాఖ మాజీ మంత్రి పరమేశ్వరన్ సహాయకుడు ప్రకాష్‌తో తరచూ సంభాషించినట్లు కనుగొన్నారు. ప్రకాష్ ద్వారానే రూ.10 కోట్ల హవాలా సొమ్ము ఢిల్లీ చేరినట్లు పోలీసులు తెలుసుకుని అతన్నిఢిల్లీకి పిలిపించుకుని విచారించారు. ఎన్నికల కమిషన్‌కు లంచంతో తనకు సంబంధం లేదని, అయితే దినకరన్ మాత్రం తెలుసని అంగీకరించాడు. అయితే బెంగళూరు జైలు అధికారులకు లక్షలాది రూపాయాలు సరఫరా అవుతున్నట్లు తెలిపాడు. శశికళకు లగ్జరీ సౌకర్యాల కోసం రూ.2 కోట్లు చెల్లించినట్లు చెప్పడంతో ఢిల్లీ పోలీసులు ఆశ్చర్యానికి లోనయ్యారు. మూడు నెలలుగా నిఘా ప్రకాష్ ఇచ్చిన వాంగ్మూలాన్ని 306 చట్టం సెక్షన్ కింద నమోదు చేశారు. అంతేగాక ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖకు ఢిల్లీ పోలీసులు చేరవేశారు. ఆ తరువాత నుంచే శశికళ, ఆమె బంధువులపై గత మూడు నెలలుగా నిఘాపెట్టారు. శశికళకు జరుగుతున్న ప్రత్యేక మర్యాదలను తెలుసకున్నారు. జైలు అధికారులు శశికళ నుంచి సొమ్ము తీసుకుంటున్నట్లు తేలింది. అయితే రెడ్హాండెడ్గా పట్టుకునేందుకు సీసీ టీవీ పుటేజీలను కేంద్రం సేకరించింది. ఇందుకోసం ఖైదీలనే వాడుకుంది. శశికళకు తెలియకుండా అంతా గోప్యంగా జరిపించింది. శశికళ మేకప్ సామాను, షాపింగ్ చేసిన దృశ్యాలను సైతం సేకరించింది. ఈ విషయంలో డీఐజీ రూప ప్రముఖ పాత్ర పోషించారు. బెంగళూరులో రూప ఇంటి పక్కనే కేంద్రమంత్రి ఒకరు నివసిస్తున్నారు. ఉదయం వేళ జాగింగ్ సమయంలో ఒకరోజు శశికళ లగ్జరీ జీవితాన్ని మంత్రికి చెప్పినట్లు సమాచారం. ఈ నేపధ్యంలోనే రూపను జైళ్లశాఖ డీఐజీగా బదిలీచేసినట్లు కూడా చెబుతున్నారు. కాగా, శశికళకు సంబంధించి ఆధారాలు సేకరించిన ఖైదీలను ప్రస్తుతం అకస్మాత్తుగా వేరే జైలుకు బదిలీ చేసినట్లు తెలుస్తోంది.