శాస్త్రి భవన్‌కు పాకిన కరోనా ప్రకంపనలు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రకంపనలు దేశ రాజధానిలోని శాస్త్రి భవన్‌కు పాకాయి. శాస్త్రి భవన్‌లోని న్యాయ మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారికి కరోనా పాజిటివ్ రావడం కలంకలం రేపింది. దీంతో ఈ భవనంలోని నాల్గవ ఫ్లోర్ ను అధికారులు మూసివేశారు. గేట్ నంబర్ 1 నుండి గేట్ నంబర్ 3 వరకు నాల్గవ అంతస్తు 'ఎ' వింగ్ సీజ్ చేశామని, లిఫ్ట్ లు కూడా పనిచేయవని అధికారులు మంగళవారం ప్రకటించారు. పూర్తిగా శానిటైజ్ చేసిన తర్వాత దీన్ని తిరిగి తెరుస్తామని అధికారులు వెల్లడించారు. అలాగే కోవిడ్-19 సోకిన అధికారితో సంబంధమున్న వారిని క్వారంటైన్ లో ఉండాల్సిందిగా ఆదేశించామని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ మంత్రిత్వశాఖల అధికారుల నివాసముదాయం శాస్త్రి భవన్. కరోనా వైరస్ కారణంగా లుటియన్ జోన్లో ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయడం ఇది రెండవసారి. ఏప్రిల్ 28 న నీతి ఆయోగ్ ఉద్యోగికి కరోనా వైరస్ సోకడంతో, 48 గంటల గంటల పాటు నీతి ఆయోగ్ కార్యాలయాన్ని సీజ్ చేసిన సంగతి తెలిసిందే. రెండు వారాల క్రితం, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఉద్యోగికి కూడా కోవిడ్-19 కు పాజిటివ్ రావడంతో రాజీవ్ గాంధీ భవన్ లోని విమానయాన మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయాన్ని కూడా ఏడు రోజుల పాటు మూసివేశారు. (ఫ్లిప్‌కార్ట్‌కు కీలక ఎగ్జిక్యూటివ్ గుడ్ బై)
కాగా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం ప్రస్తుతం ఢిల్లీలో మొత్తం కరోనా వైరస్ కేసులు 4898 గా ఉన్నాయి. 1437 మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారు. 64 మరణాలు నమోదైనాయి. ఢిల్లీలో గత 24 గంటల్లో కొత్త మరణాలు సంభవించలేదు.